చూసిన కనులదే భాగ్యం
నక్కపల్లి: కల్యాణకాంతులతో ఉపమాక దేదీప్యమా నంగా దర్శనమిచ్చింది. కోనేటిరాయుడి వార్షిక తిరుకల్యాణం శుక్రవారం అర్ధరాత్రి అంగరంగవైభవంగా జరిగింది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామి కల్యాణఘట్టాన్ని తిలకించేందుకు భక్తకోటి తెల్లవార్లు మేల్కోనిఉంది. ప్రతిఏటా ఫాల్గుణశుద్ధ ఏకాదశినాడు జరిగే వెంకన్న వార్షిక కల్యాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఉపమాకకు చెందిన అర్చక స్వాములు వేదపండితులు,గొట్టుముక్కల వరప్రసాద్, సంకర్షణ పల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు ఈ కల్యాణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. కల్యాణానికి ముందుగా వేంకటేశ్వరస్వామిని, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ఎదురెదురుగా ఉంచి, పెళ్లి మాటల తంతును నిర్వహించారు. ఈ సన్నివేశంలో స్వామివారి గొప్పతనాన్ని, గుణగణాలను,సౌశీల్యాన్ని, అమ్మవార్ల గుణగణాలను, ఔన్నత్యాన్ని ప్రముఖ తెలుగుపండితురాలు డాక్టర్‌గొట్టుముక్కల గాయత్రీ దేవి భక్తుల కళ్లకు కట్టినట్టు వివరించారు. కట్నకానుకలను, పెళ్లిమాటల కార్యక్రమాన్ని భక్తుల హర్షద్వానాల మధ్య నిర్వహించారు.అనంతరం ఉభయ నాంచారులతోకూడిన స్వామివారిని పెద్ద రథంపై ఉంచి రథోత్సవం నిర్వహించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. రథోత్సవం పూర్తయిన తర్వాత కల్యాణతంతు ప్రారంభమైంది. రాజగోపురం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదిక వద్ద కల్యాణమహోత్సవం నిర్వహించారు. తిరుపతినుంచి ప్రత్యేకంగా వచ్చిన అర్చక స్వాములు వేదాలను పఠించారు. స్వామివారికి టీటీడీ తరఫున అధికారులు పట్టవస్త్రాలు సమర్పించారు. జిల్లానలుమూలలతోపా టు, ఇతర జిల్లాలనుంచి వచ్చిన వేలాది మంది భక్తులు తెల్లవార్లు కల్యాణాన్ని వీక్షించారు. కల్యా ణోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నక్కపల్లి,పాయకరావుపేట, అడ్డురోడ్డు సీఐలు మురళి,రామకృష్ణ అప్పన్న ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.తెల్లవార్లు జాతర జరిగింది. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన తోడపెద్దులతో సంబరం నిర్వహించారు.కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు శుక్రవారం ఉదయం ఉపమాక చేరుకున్న భక్తులు అర్ధరాత్రి కల్యాణం అనంతరం శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకుని తిరుగుప్రయాణమయ్యారు.
చూసిన కనులదే భాగ్యం


