‘బ్లూజెట్ ఫార్మాతో మత్స్యకారులకు నష్టం’
అచ్యుతాపురం రూరల్: తీవ్రమైన కాలుష్యాన్ని వెదజల్లే బ్లూ జెట్ ఫార్మా పరిశ్రమ వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారని, పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని పూడిమడక గ్రామ అఖిలపక్ష నాయకులు కోరారు. శనివారం జరిగిన పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావును అఖిలపక్షనాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. రాంబిల్లి మండలం సీతపాలెంలో ఏర్పాటు చేస్తున్న బ్లూ జెట్ ఫార్మా కారణంగా మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికే అచ్యుతాపురం, రాంబిల్లి మండాలాల్లో గల 480 ఫార్మా పరిశ్రమలు వ్యర్థ రసాయనాలను పూడిమడక వద్ద సముద్రంలో విడుదల చేస్తుండడం వల్ల చేపలు మృతిచెంది, మత్స్యకారుల జీవనోపాధి కోల్పోతున్నారని వారు తెలిపారు. పూడిమడకలో 20 వేల మంది నివసిస్తున్నారని, వారి ప్రాణాలను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మత్స్యకార నాయకులు చోడిపల్లి అప్పారావు, వాసుపల్లి శ్రీనివాసరావు, ఉమ్మిడి జగన్, చేపల తాతయ్యలు, మేరుగు అప్పలనాయుడు తదితరులున్నారు.


