ప్రమాదస్థలాన్ని పరిశీలిస్తున్న యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఉపేంద్ర
యలమంచిలి రూరల్: రేగుపాలెంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు కన్నం కృష్ణారావు(58) దుర్మరణం చెందారు. మండలంలోని జంపపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ పట్టణంలోని సిగ్నేచర్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో పులపర్తిలో పొలంలో వ్యవసాయ పనులు చూసుకుని తిరిగి ఇంటికి తన ద్విచక్రవాహనంపై వస్తుండగా, తుని నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న ఏపీ31బీజీ8398 నంబరు లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అతడి శరీరంపై నుంచి లారీ చక్రాలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శరీరభాగాలు నుజ్జయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుడి సోదరుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. ఎంఈవో సూర్యప్రకాష్, ఉపాధ్యాయ సంఘాల నేతలు, సహచర ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు.


