బహిరంగ మల విసర్జనను అరికట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి : జిల్లాలోని గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల, గ్రామ/వార్డు సచివాలయ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పారిశుధ్యం మెరుగుకు 24 మండలాల్లో ప్రతి మండలానికి 5 గ్రామాలు చొప్పున ఎంపిక చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ప్రధానంగా రావికమతం, రాంబిల్లి, బుచ్చెయ్యపేట మండలాల పరిధిలో పనిచేస్తున్న ఎంపీడీఓలు, ఉప ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు. గ్రామాలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా ఉంచడం, ప్రతి ఇంటిలో మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావడం, గ్రామంలోని అన్ని వీధి దీపాలు వెలిగేలా చూడడం, మురుగు కాలువలను శుభ్రపరచడం, తడి చెత్తను చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించి నాడేప్ పిట్స్‌లో వేయడం, ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. గ్రామస్తులకు బహిరంగ మలవిసర్జన చేయవద్దని అవగాహన కల్పించాలని, పొడి చెత్త (ప్లాస్టిక్, పేపర్లు, పుస్తకాలు, ఇనుము, అల్యూమినియం తదితరాలు) స్వచ్ఛ రథం వాహనాలకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి సందీప్, జిల్లా గ్రామీణ నీటి పారుదల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ అనిల్ కుమార్, జీఎస్‌డబ్ల్యూఎస్ సమన్వయ అధికారి మంజుల వాణి, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
స్వర్ణాంధ్ర సాధనకు కలసిరండి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 విధానం అమలుకు సంపూర్ణ సహకారం అందించి స్వర్ణాంధ్ర సాధనలో భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసి పేదరికం లేని సమాజాన్ని స్థాపిద్దామని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర 2047, ప్రణాళికలపై మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర– 2047 విజన్‌లో భాగంగా పీ–4 విధానం అమలవుతుందని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీపీవో రామారావు, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీపీవో సందీప్, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శచిదేవి పాల్గొన్నారు.


