టీసీఎల్‌ విజేత టాలీవుడ్‌ సెలబ్రిటీ ఎలెవన్‌ | - | Sakshi
Sakshi News home page

టీసీఎల్‌ విజేత టాలీవుడ్‌ సెలబ్రిటీ ఎలెవన్‌

Mar 2 2026 7:41 AM | Updated on Mar 2 2026 7:41 AM

టీసీఎ

టీసీఎల్‌ విజేత టాలీవుడ్‌ సెలబ్రిటీ ఎలెవన్‌

విశాఖస్పోర్ట్స్‌: నగరంలో నిర్వహించిన తెలుగు సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌(టీసీఎల్‌) ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టాలీవుడ్‌ సెలబ్రిటీ ఎలెవన్‌ ఘనవిజయం సాధించి ట్రోఫీని కై వసం చేసుకుంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడా సంబరాల్లో అటు వెండితెర తారలు, ఇటు బుల్లితెర సెలబ్రిటీలు జట్లుగా విడిపోయి తలపడ్డారు. తరుణ్‌, శ్రీకాంత్‌ వంటి అగ్ర నటులు అభిమానులను ఆహ్వానించడం, ప్రవేశం ఉచితం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.

ఉత్కంఠగా ఫైనల్‌ మ్యాచ్‌

ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో టాస్‌ గెలిచిన ఎన్‌ఎం స్పేసెస్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు దినేష్‌ (52), పవన్‌ (52) అర్ధ సెంచరీలతో రాణించి, రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టాలీవుడ్‌ బౌలర్లలో వినయ్‌, తమన్‌, సాంబా, దేవా తలో వికెట్‌ తీశారు. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టాలీవుడ్‌ సెలబ్రిటీ ఎలెవన్‌ ఓపెనర్లు సుధీర్‌ బాబు (35), నిఖిల్‌ (21) ధాటిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. మధ్యలో అశ్విన్‌ (44) బౌండరీలతో విరుచుకుపడగా, ఓంకార్‌ (23) సింగిల్స్‌తో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. చివరి 4 ఓవర్లలో 40 పరుగులు చేయాల్సిన దశలో సాంబా (30), వినయ్‌ (6) నిలకడగా ఆడి మరో 4 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి బౌలర్లలో శరత్‌, కల్కి రెండేసి వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. తొలుత జరిగిన మ్యాచ్‌లో పోలీస్‌ వారియర్స్‌ 18 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేయగా, ఎన్‌ఎం స్పేసెస్‌ జట్టు 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భరత్‌ (58), కిరీటి (48) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగారు. 10 ఓవర్ల పాటు జరిగిన మరో మ్యాచ్‌లో టీవీ కింగ్స్‌ 3 వికెట్లకు 140 పరుగులు చేసింది. అభిషేక్‌ (74) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీవీ టైగర్స్‌ 8 వికెట్ల నష్టానికి 98 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. బౌలింగ్‌లో నరేష్‌ 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. విజేతలకు నిర్వాహకులు ట్రోఫీని అందజేశారు. తారల సందడితో వైఎస్సార్‌ స్టేడియం కోలాహలంగా మారింది.

టీసీఎల్‌ విజేత టాలీవుడ్‌ సెలబ్రిటీ ఎలెవన్‌1
1/2

టీసీఎల్‌ విజేత టాలీవుడ్‌ సెలబ్రిటీ ఎలెవన్‌

టీసీఎల్‌ విజేత టాలీవుడ్‌ సెలబ్రిటీ ఎలెవన్‌2
2/2

టీసీఎల్‌ విజేత టాలీవుడ్‌ సెలబ్రిటీ ఎలెవన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement