ఆలయాల ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళిక
నాతవరం: దేవాలయాలకు ఆదాయ వనరులు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని యలమంచిలి దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్‌స్పెక్టరు డి. ఉమాదేవి తెలిపారు. నాతవరంలో గంగాదేవి నూకాలమ్మ దేవస్థానానికి చెందిన 13 ఎకరాల వ్యవసాయ భూములకు కౌలు వేలం పాట గురువారం స్థానిక రామాలయం వద్ద నిర్వహించారు. వేలంలో 11 మంది పాల్గొని రూ.5 వేల చొప్పున డిపాజిట్ చేశారు. గతేడాది ఈ భూములకు రూ.70 వేలు వేలం పాడగా, ఈ ఏడాది రూ.1. 48 లక్షలకు గ్రామానికి చెందిన గవిరెడ్డి అప్పల సత్యనారాయణ దక్కించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రూ. 25 లక్షలలోపు ఆదాయం ఉన్న ఆలయాలను సీ కేటగిరీలోకి ప్రభుత్వం మార్చిందన్నారు. తమ పరిధిలో ధూప, దీప నైవేద్యం కోసం 70 ఆలయాలకు ప్రతి నెలా రూ.10 వేల చొప్పున తమ శాఖ ద్వారా చెల్లిస్తుందన్నారు. మెట్ట భూములు ఆరేళ్ల వరకు కౌలుకు ఇస్తున్నామన్నారు. నర్సీపట్నం మండలంలో 70 ఎకరాలు సోలార్ ప్లాంటుకు ఇచ్చామన్నారు. సాగుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని, దీనివల్ల ఆదాయం రాకుండా భూములనీ నిరుపయోగంగా ఉన్నాయన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని కౌలు వేలం పాట పెంచామని, కమిషనర్ నుంచి ప్రత్యేకంగా అనుమతులు పొందాలన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రజల్లో భక్తిభావం పెరిగిందన్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం డివిజన్‌కు చెందిన దేవాదాయ ధర్మదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి ఈ.సాంబశివరావు, సూపర్‌వైజరు రామకృష్ణ, నాతవరం గంగాదేవి నూకాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు ధనాజీ, గ్రామపెద్దలు పాల్గొన్నారు.


