రియల్‌ | - | Sakshi
Sakshi News home page

రియల్‌

Mar 3 2026 8:03 AM | Updated on Mar 3 2026 8:03 AM

సీఆర్‌జెడ్‌–3 నుంచి సీఆర్‌జెడ్‌–2 కేటగిరీకి మార్చేందుకు ప్రతిపాదనలు పర్యాటక ముసుగులో తీరప్రాంత విధ్వంసానికి కుట్ర కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ నిబంధనల్ని తగ్గించేందుకు పన్నాగాలు తీరప్రాంత రక్షణ కవచాల విచ్ఛిన్నానికి చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రాలు

తీరంలో
వేట

పర్యావరణ కంటే..

ప్రాఫిట్‌ ముఖ్యం

వీటిని పరిశీలిస్తే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కంటే ప్రాఫిట్‌కే పెద్దపీట వేస్తోందని స్పష్టమవుతోంది. ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటే.. నగరంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. తీరంలో ఇసుక దిబ్బలు, ఖాళీ ప్రదేశాలు సహజ సిద్ధమైన బఫర్‌ జోన్లుగా పనిచేసి ఉప్పెనలు, తుపాన్ల తీవ్రతను తగ్గిస్తాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో వాణిజ్య విస్తరణకు తెరతీస్తే.. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలకు విశాఖను బలి చేయడమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ విధ్వంసాన్ని మాత్రమే కోరుకుంటోంది తప్ప.. అభివృద్ధిని కాదంటూ పర్యావరణవేత్తలు, కూటమి పార్టీల ప్రతినిధులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు.

సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘమైన తీరప్రాంతంపై చంద్రబాబు ప్రభుత్వం పగబట్టింది. అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు అభివృద్ధి పేరుతో తీరాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతోంది. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలను సడలించడం, జోన్లు మార్చడం వంటి చర్యలతో తీరప్రాంత సమతుల్యతను దెబ్బతీస్తోంది. పర్యాటక ముసుగులో న్యాయస్థానాల హెచ్చరికల్ని కూడా బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కావాల్సిన వారికి ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతోంది. గతంలో పర్యావరణవేత్తలు, ప్రజలు పోరాడి కాపాడుకున్న తీరప్రాంతాలను ఇప్పుడు కమర్షియల్‌ హబ్‌లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. నగరంలోని సాగరతీర ప్రాంతాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరితో ఉందో అర్థమవుతోంది. తన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా కాంట్రాక్టర్ల కోసం పర్యావరణ అనుమతులను సైతం వేగవంతం చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలను పక్కనపెట్టి అడ్జస్ట్‌మెంట్లతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు.

భీమిలి తీరంలో

సీఆర్‌జెడ్‌ మాయాజాలం

విశాఖ–భీమిలి తీరప్రాంతంలో సీఆర్‌జెడ్‌ జోన్ల మార్పిడి (రీక్లాసిఫికేషన్‌)పై చంద్రబాబు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సీఆర్‌జెడ్‌ నిబంధనల ప్రకారం.. సీఆర్‌జెడ్‌–3 కేటగిరీలో ఉన్న ప్రాంతాలు తక్కువ నిర్మాణాలు కలిగి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. సముద్రమట్టం నుంచి 200 మీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ఇక్కడి ఇసుకదిబ్బలు, చిత్తడినేలలు వంటివి అలల తాకిడిని, తుపాన్లను అడ్డుకునే సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. సీఆర్‌జెడ్‌–2 కేటగిరీలో సముద్రతీరానికి అత్యంత సమీపంలో భారీ కాంక్రీట్‌ కట్టడాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవచ్చు. విశాఖ–భీమిలి బీచ్‌ వెంబడి సీఆర్‌జెడ్‌–3 పరిధిలో 500 ఎకరాలకుపైగా భూములున్నాయి. వీటిలో భారీ కాంక్రీట్‌ నిర్మాణాలకు వీలులేదు. ఇప్పుడు ఈ భూముల్ని సీఆర్‌జెడ్‌–2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ భూముల్లో మెజారిటీ వాటా ప్రభుత్వ నేతలదే కావడంతో.. మార్పిడి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విశాఖని గ్లోబల్‌ సిటీగా మారుస్తామనే సాకుతో తీరప్రాంత మాస్టర్‌ప్లాన్‌పై సమీక్షలు మొదలుపెట్టారు. 2024 అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య మాస్టర్‌ప్లాన్‌ సవరణల పేరుతో అంతర్గత కసరత్తు జరిగింది. ఆ సమయంలోనే సీఆర్‌జెడ్‌–3లోని భూముల్ని సీఆర్‌జెడ్‌–2 కిందకు చేర్చి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా మార్చాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపించి మార్పులు చేసెయ్యాలని ప్రభుత్వం ఆరాటపడిపోతోంది.

పర్యావరణ

నిబంధనలు అభివృద్ధికి

అడ్డంకి అన్న మంత్రి దుర్గేష్‌

నిబంధనల్ని పాటిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు అభివృద్ధికి అవే అడ్డంకి అనటం ఆందోళన కలిగిస్తోంది. పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ శాసనసభలో మాట్లాడుతూ పర్యావరణ నిబంధనలు అభివృద్ధికి అడ్డంకి అంటూ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కూడా అసెంబ్లీలో నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి కోసం కాకుండా.. బీచ్‌రోడ్డుని సీఆర్‌జెడ్‌–2లోకి తీసుకురావాలని కోరారు. ఇక్కడ సీఆర్‌జెడ్‌ నిబంధనల కారణంగా 9 మీటర్లపైన నిర్మాణాలు చేపట్టలేకపోతున్నామనీ.. వీటిని సడలించాలంటూ మాట్లాడటంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కేవలం విశాఖ విధ్వంసాన్ని మాత్రమే కోరుకుంటోంది తప్ప.. అభివృద్ధిని కాదంటూ పర్యావరణ వేత్తలు, కూటమి పార్టీ ప్రతినిధులే సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు.

సీఆర్‌జెడ్‌ నిబంధనల మాయాజాలం

విశాఖ సాగర రక్షణ కవచానికి తూట్లు

ఆత్మహత్యా సదృశ్యమే..

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఓవైపు గ్రేట్‌ గ్రీన్‌వాల్‌ వంటి కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు పర్యాటకశాఖ దానికి విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయం. కేవలం రూ.4,098 కోట్ల పెట్టుబడులు, 2,800 హోటల్‌ గదులు వంటి తాత్కాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం, శాశ్వత పర్యావరణ రక్షణ కవచాలైన సీఆర్‌జెడ్‌–3 నిబంధనలను సడలించి తీరాన్ని కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చాలని చూడటం ఆత్మహత్యా సదృశ్యమే. ఇప్పటికే జీవీఎంసీ, ఏపీపీసీబీ పర్యవేక్షణ లోపంతో సముద్రజలాలు కలుషితమవుతున్నాయి. ఇప్పుడు అదనపు కట్టడాలకు అనుమతినిస్తే విశాఖ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అభివృద్ధి అంటే ప్రకృతిని ధ్వంసం చేయడంకాదు, భావితరాలకు సురక్షితమైన తీరాన్ని అందించడమే. ప్రభుత్వం సీఆర్‌జెడ్‌ పునర్‌వర్గీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి.

– బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన ప్రతినిధి, పర్యావరణవేత్త

తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది

విశాఖపట్నం తీరప్రాంతంలో సీఆర్‌జెడ్‌–3 నిబంధనలను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుండటం గర్హనీయం. కేవలం పర్యాటక అభివృద్ధి, వాణిజ్య విస్తరణ పేరుతో చేస్తున్న ఈ మార్పువల్ల సాగరతీరంలోని ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు వంటి సహజ రక్షణ కవచాలు ధ్వంసమైపోతాయి. భవిష్యత్తులో తుపాన్లు, ఉప్పెన్ల ముప్పు పెరుగుతుంది. ప్రభుత్వం తాత్కాలిక లాభాల కోసం మత్స్యకారుల జీవనోపాధిని పణంగా పెడుతోంది. ఇప్పటికే కాలుష్యంతో అల్లాడుతున్న విశాఖకు ఇది మరో పెద్దదెబ్బ. చట్టబద్ధమైన పర్యావరణ రక్షణలను అడ్డంకులుగా చూడటం బాధ్యతారాహిత్యం. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందే.

– వై.రాజేష్‌, వీఎస్‌ కృష్ణ, మానవహక్కుల ఫోరం ప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement