గంజాయిపై విశాఖ రేంజ్ పోలీసుల ఉక్కుపాదం
సాక్షి, అనకాపల్లి: గంజాయిపై విశాఖ రేంజ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్‌సిన్హా, అల్లూరి ఎస్పీ అమిత్ బర్దర్ నేతృత్వంలో బుధవారం పరవాడలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ వద్ద భారీ స్థాయిలో గంజాయి ధ్వంసం చేశారు. విశాఖ రేంజ్ పరిధిలో అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో 783 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 52,336.614 కిలోల గంజాయి, 142.187 మీటర్ల హసిష్ ఆయిల్‌ను దహనం చేశారు. వీటిలో అనకాపల్లి జిల్లాలో 332 కేసులకు సంబంధించి 17,068.24 కిలోల గంజాయి, 10.03 లీటర్ల హషీష్ ఆయిల్‌ను, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 451 కేసులకు సంబంధించి 35,268.374 కిలోల గంజాయి, 132.157 లీటర్ల హషీష్ ఆయిల్‌ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ మీడియాతో మాట్లాడుతూ 2024 జూన్ నుంచి 2026 జనవరి నెలాఖరి వరకూ గత 20 నెలల్లో పోలీసులు చేసిన దాడుల్లో 976 కేసుల్లో 2,405 మందిని గంజాయి స్మగ్లర్లు, అక్రమ రవాణా చేసిన వారిని అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి 55,346.292 కిలోల గంజాయి, 56.275 కిలోల హషీష్ ఆయిల్‌ను, 685 వాహనాలను సీజ్ చేశామన్నారు. 24 అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలను గుర్తించి, 129 మంది సభ్యులపై నిరంతర నిఘా ఉంచినట్టు చెప్పారు. అంతేకాకుండా రూ. 9.19 కోట్ల ఆస్తుల జప్తు చేశామన్నారు. ఇప్పటి వరకు 14 మంది ప్రధాన నిందితులకు సంబంధించి రూ. 9,19,17,290 విలువైన ఆస్తులను గుర్తించి, ఫ్రీజ్ చేస్తూ కన్ఫర్మేషన్ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అలవాటు పడ్డ నేరస్తులపై 92 ప్రతిపాదనలు సిద్ధం చేయగా, 34 డిటెన్షన్ ఆర్డర్లు అమలైనట్టు చెప్పారు. 1599 మందిపై హిస్టరీ షీట్లు తెరిచామన్నారు. నేరస్తుల డేటా ట్రాకింగ్ కోసం ఖాజ్, నిడాన్, నాట్‌గ్రిడ్ వంటి యాప్‌లను, 33 అత్యాధునిక డ్రోన్ల ద్వారా 129 హాట్‌స్పాట్‌లపై 1360 సార్లు నిఘా పెట్టి, నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు డీఐజీ వివరించారు. 6 డీ–అడిక్షన్ కేంద్రాల ద్వారా 401 మంది బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి, 244 మందిని కేంద్రాలకు తరలించి చికిత్స అందించామన్నారు. గంజాయి సాగు చేసే గిరిజనులకు 29,840 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా 1.59 కోట్ల మొక్కలు పంపిణీ చేశామన్నారు. గంజాయి సమాచారం కోసం 1972, 1933 నంబర్లలో సంప్రదించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు జి.ఆర్.ఆర్.మోహన్, వి.విష్ణుస్వరూప్, ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, బి.మోహనరావు, పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఎస్.బాలసూర్యారావు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పరవాడలో కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ వద్ద గంజాయి ధ్వంసం
అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 783 కేసుల్లో 52,336 కిలోల పట్టివేత
డీఐజీ గోపీనాథ్‌జెట్టి, ఎస్పీల ఆధ్వర్యంలో దహనం


