తుమ్మపాల : జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించి, ఎంపీడీవోతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారం రోజులుగా వివిధ మండలాల్లో 10 నుండి 20 ఇండికేటర్ల (సూచికల) ఆధారంగా పనులను సమీక్షించడం జరిగిందని, ఎంపీడీవోలు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. వచ్చే సమీక్ష సమయానికి జిల్లా ర్యాంకింగ్‌లో గణనీయమైన మార్పు ఉండాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలన్నారు. ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ’అక్షర ఆంధ్ర’ కార్యక్రమం కింద 97 శాతం అటెండెన్స్ నమోదు కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. వచ్చే వారం నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిమిత్తం జిల్లాలో ఏర్పాటు చేసిన 108 పరీక్ష కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
స్టీల్ ప్రాజెక్ట్ భూమి పూజకు ఏర్పాట్లు
నక్కపల్లి మండలంలోఆర్సెలర్‌మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్రాజెక్ట్ సంస్థ స్థాపిస్తున్న భారీ ఉక్కు ప్రాజెక్ట్‌కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం 2,200 ఎకరాల భూమిని కేటాయించినట్టు అధికారులు తెలిపారు. భూమి పూజ ఏర్పాట్లపై చర్చించేందుకు ప్రాజెక్ట్ ప్రతినిధులు కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ను కలిశారు. సీఈవో దిలీప్ ఓమెన్ ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ప్రాజెక్ట్ చీఫ్ కేఎల్ చౌదరి, హెచ్‌ఆర్ డైరెక్టర్ అశితోష్ తెలియాంగ్, అడ్మిన్ హెడ్ కెప్టెన్ దీపక్ పట్నాయక్, హెచ్‌ఆర్ అడ్మిన్ డి.ఎస్.వర్మ పాల్గొన్నారు.


