ఆల్బెండజోల్ మాత్రలతో రక్తహీనత నివారణ
గొండుపాలెం హైస్కూల్‌లో ఆల్బెండజోల్ మాత్రలు వేసుకున్న విద్యార్థులతో జిల్లా లెపర్సీ అండ్ టీబీ వైద్యాధికారి స్వప్న
కె.కోటపాడు: ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగులను నివారించి, తద్వారా రక్తహీనత సమస్యను అధిగమించవచ్చని జిల్లా లెపర్సీ, టీబీ వైద్యాధికారిణి కె.స్వప్న తెలిపారు. మండలంలో చౌడువాడ పీహెచ్‌సీని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యాధికారులు మాదంనాయుడు, రామ్ నరేష్‌లతో మాట్లాడి పీహెచ్‌సీ పరిధిలో ఎంత మంది కుష్టు, టీబీ లక్షణాలతో వైద్యం పొందుతున్నారు, ఈ నెల 17న జరిగిన డీవార్మింగ్ డే కార్యక్రమంలో పీహెచ్‌సీ పరిధిలోఎంత మందికి ఆల్బెండజోల్ మాత్రలను అందించారో తెలుసుకున్నారు. అనంతరం గొండుపాలెం హైస్కూల్‌లో 143 మందికి నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడాదికి రెండుసార్లు ఈ ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో జె.సన్యాసిరావు, పీహెచ్‌ఎన్ కనకవేణి, టీబీ సూపర్‌వైజర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఆల్బెండజోల్ మాత్రలతో రక్తహీనత నివారణ


