‘మైనింగ్ మాఫియాతో టీడీపీ, జనసేన కుమ్మక్కు’
నర్సీపట్నం: మైనింగ్ మాఫియాతో టీడీపీ, జనసేన నేతలు కుమ్మకై ఆదివాసీ భూములను కబళిస్తున్నారని సీపీఐఎంఎల్ లిబరేషన్ పొలిట్‌బ్యూరో సభ్యుడు వి.శంకర్ మండిపడ్డారు. స్థానిక ఎన్జీవో హోమ్‌లో శనివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనింగ్ మాఫియా రెచ్చిపోతూ గిరిజనుల భూములను కాజేస్తోందని తెలిపారు. ఆదివాసీ గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్‌లో చేర్చకపోవడం వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అటవీ హక్కుల చట్ట సవరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.చట్టర్జీపురం ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్రకమిటీ సభ్యుడు డి.హరినాఽథ్ మాట్లాడుతూ మైనింగ్ మాఫీయాను కట్టడి చేసేందుకు ఆదివాసీలు ఉద్యమించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి బుగతాబంగార్రాజు మాట్లాడుతూ ఈ సమస్యలపై మార్చి 30న ‘చలో నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం’ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా 21 మందితో జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కార్యదర్శిగా కోసూరిరాజు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రకమిటీ సభ్యులు ఉదయ్‌కిరణ్, కె.జనార్దన్, కేదారి సత్య, కడాలి రాజేశ్వరి, బాలరాజు, పవన్‌కుమార్, చంటి, రాజు తదితరులు పాల్గొన్నారు.


