ఏపీఐఐసీ భూముల్లో మట్టి, గ్రావెల్ తవ్వకాలు
మాకవరపాలెం: ఏపీఐఐసీ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయి. మండలంలోని రాచపల్లి రెవెన్యూ పరిధిలో ఏపీఐఐసీకి చెందిన 290 ఎకరాల భూమి ఉంది. అయితే రామన్నపాలెం శివారు వెంకయ్యపాలెం వద్ద ఈ భూముల్లో వారం రోజులుగా రాత్రివేళల్లో మట్టి, గ్రామవెల్‌ను పొక్లెయిన్‌లతో తవ్వి తరలించుకుపోతున్నారు. అయినా సంబంధిత అధికారులు ఈ తవ్వకాలను అడ్డుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ నుంచి తరలిస్తున్న మట్టి, గ్రావెల్‌ను సమీప గ్రామాల్లోని భూములు, వివిధ నిర్మాణాలు చేపట్టే స్థలాలను కప్పివేసేందుకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో అయితే ఎవరూ పట్టించుకోరనే ఉద్ధేశ్యంతో మట్టి మాఫియా ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. మట్టి, గ్రావెల్ తవ్వకాలతో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున ఏర్పడిన గోతుల్లో రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి నీరు చేరి ప్రమాదకరంగా మారాయి. ఇటుగా గడ్డి మేసేందుకు వచ్చే పశువులు ఏమాత్రం ఇందులో పడినా మృత్యువాత పడతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతం నుంచి గ్రావెల్ తరలిస్తున్న వారిపై కేసులు పెట్టారు. ప్రస్తుతం ఎవరూ పట్టించుకోకపోవడంతో దర్జాగా తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రభుత్వానికి చెందిన ఈ ఏపీఐఐసీ భూముల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకోవడంతో పాటు మట్టిని తరలించేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


