జీడి పిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..
ఆందోళన చేస్తున్న జీడి రైతులు
కోటవురట్ల: జీడి పిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ డిమాండ్ చేశారు. యండపల్లిలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీడి రైతులు శనివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ గత నాలుగేళ్లు పంట సరిగ్గా లేక, సరైన గిట్టుబాటు ధర లేక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. అసెంబ్లీలో చర్చించి జీడి పిక్కలకు కిలోకు రూ.200 మద్దతు ధర ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. జీడి పిక్కల వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి పప్పును భారీ ధరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మార్కెట్లో 80 కిలోల జీడిపిక్కల బస్తాకు రూ.8000 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జీడి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
రోలుగుంట: జీడి పిక్కల సమస్యపై అసెంబ్లీలో చర్చించాలంటూ శనివారం సాయంత్రం రత్నంపేట గ్రామంలో ఫారెస్ట్ భూమి సాగు రైతులు ఆందోళన చేశారు. కిలో జీడిపిక్కలకి రూ.200 ధర నిర్ణయించాలని డిమాండు చేశారు. జీడి పిక్కలు 80 కిలోల బస్తాకి రూ.18 వేలు మద్దతు ధర ఇవ్వాలన్నారు. జీడిపిక్కల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. జీడిపంటల సాగు విస్తీర్ణంపై గతంలో ఇచ్చిన రాయితీలు పునరుద్ధరించాలన్నారు. జీడిపిక్కలు, పండ్లు ప్రాసె సింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. తమ సమస్య పరిస్కారంపై స్పందించకుంటే తహసీల్దార్ కార్యాలయం వద్ద వంటా –వార్పు కార్యక్రమం చేపడతామని గెమ్మిలి చందర్రావు, చిన్నబ్బాయి, జీడిమామిడి గిరిజన సంఘం నాయకులు తెలిపారు.
జీడి పిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..


