జగనన్న కాలనీ స్థలం దురాక్రమణ | - | Sakshi
Sakshi News home page

జగనన్న కాలనీ స్థలం దురాక్రమణ

Mar 3 2026 8:04 AM | Updated on Mar 3 2026 8:04 AM

● దర్జాగా భారీ షెడ్‌ నిర్మాణం ● టీడీపీ కౌన్సిలర్‌ మద్దతుతో సీమ పందుల పెంపకం ● పట్టించుకోని అధికారులు

యలమంచిలి రూరల్‌ : కూటమి ప్రభుత్వంలో భూ అక్రమాలకు అధికార టీడీపీ నాయకులే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. ఓటు బ్యాంకు పెంచుకోవడమే లక్ష్యంగా అడ్డగోలు వ్యవహారాలకు అండగా నిలబడుతున్నారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి కొక్కిరాపల్లి రెల్లి కాలనీ సమీపంలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పక్కన జగనన్న కాలనీకి కేటాయించిన స్థలం దురాక్రమణ వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. వివరాలివి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొక్కిరాపల్లి రెవెన్యూ సర్వే నెంబర్లు 458/1,458/2,461/1,498/1లో సుమారు 14 ఎకరాల్లో జగనన్న లేఅవుట్‌ ఏర్పాటు చేశారు. యలమంచిలి పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఇక్కడ నివాస గృహాల నిర్మాణం కోసం ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ లేఅవుట్‌లో సుమారు 15 సెంట్ల స్థలాన్ని కొక్కిరాపల్లికి చెందిన ఒక కుటుంబం ఆక్రమించుకుంది. ఆక్రమిత స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా కాంక్రీట్‌ ఫ్లోరింగ్‌తో భారీ షెడ్‌ నిర్మించుకున్నారు. షెడ్‌లో సీమ పందుల పెంపకాన్ని చేపట్టారు. పందుల పెంపకం కోసం షెడ్‌కు ఎదురుగా సెప్టిక్‌ ట్యాంక్‌ సైతం నిర్మించారు. దీంతో ఈ ప్రాంతంలో విపరీతమైన దుర్గంధం వస్తోంది. భవిష్యత్తులో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటే ఇక్కట్లు తప్పవు.

ఆక్రమణకు టీడీపీ కౌన్సిలర్‌ అండ

జగనన్న కాలనీలో స్థలం ఆక్రమించుకుని భారీ షెడ్‌ నిర్మించిన అడ్డగోలు వ్యవహారానికి కొక్కిరాపల్లి వార్డు టీడీపీ కౌన్సిలర్‌ అండగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ నేత ప్రోత్సాహంతోనే ప్రభుత్వ స్థలంలో దర్జాగా షెడ్‌ నిర్మించుకున్నామని ఆక్రమణదారులు సైతం బహిరంగంగానే చెబుతున్నారు. షెడ్‌ నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చయిందని, మాకేమీ ఇబ్బంది లేదని ఆక్రమణదారులు ధీమా చూపుతున్నారు. ఇదంతా తమ కళ్ల ముందే జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీఆర్వో, సచివాలయ సిబ్బంది, ఇతర యంత్రాంగం ఆక్రమణకు ప్రోత్సాహం అందించడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీ నాయకుడే అండగా ఉండడంతో ప్రస్తుతం నిర్మించిన భారీ షెడ్‌ పక్కనే మరొకటి కట్టడానికి వీలుగా ఇసుక, మెటల్‌ సిద్ధం చేశారు. ఆక్రమిత స్థలం చుట్టూ కంచె వేసుకోవడానికి సైతం చూస్తున్నారు. భవిష్యత్తులో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఇక్కడ నివసించే వారికి విపరీతమైన కంపు, దోమలు, ఈగల బెడద తీవ్రం కానుందన్న అభిప్రాయాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇలాంటి ఆక్రమణను చూస్తూ ఊరుకుంటే మరికొంత మంది దురాక్రమణకు తెగబడే అవకాశం ఉందని, తమకు కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా అధికారులు చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement