మెడికల్, ఫార్మా మాఫియా దోపిడీని అరికట్టాలి
తుమ్మపాల: మెడికల్, ఫార్మా మాఫియా దోపిడీని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావుకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ మెడికల్ మాఫియా నాసిరకం మందులను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను నిలువ దోపిడీ చేస్తోందన్నారు. అద్దె సర్టిఫికెట్లతో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించి, చర్యలు తీసుకోవడంలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్, ఫార్మా మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే వరకు సీసీఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోందని చెప్పారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఏటా రూ.300 కోట్లకు పైగా స్టైఫండ్ ఎగవేస్తున్నారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పీపీపీ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.వి.రమణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సన్యాసిరావు, జి.ఫణీంద్ర కుమార్, రాధాకష్ణ, మండల కార్యదర్శి వియ్యపురాజు, సీపీఐ నాయకుడు ఈశ్వరరావు పాల్గొన్నారు.


