వేడుకగా నాగవల్లి వసంతోత్సవం | - | Sakshi
Sakshi News home page

వేడుకగా నాగవల్లి వసంతోత్సవం

Mar 4 2026 7:34 AM | Updated on Mar 4 2026 7:34 AM

చంద్ర గ్రహణంతో ఆలయంలోనే

తిరువీధి, చక్రస్నానం

వడ్డాది పుర వీధుల్లో తిరగని వేంకటేశ్వరస్వామి

ఆలయం మూసేసిన దేవస్థానం అధికారులు

నేడు 4 గంటల నుంచి స్వామివారి పునదర్శనాలు

బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి నాగవల్లి వసంతోత్సవం వేడుకగా జరిగింది. స్వామివారి 153వ కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు నాగవల్లి వసంతోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అఖిలాండ బ్రహ్మండకోటి గోవింద నామశరణ ఘోషతో వడ్డాది వీధులన్నీ భక్తిభావంతో పులకించాయి. చంద్ర గ్రహణం కారణంగా శ్రీదేవి, భూదేవి, వేంకటేశ్వరస్వామికి తిరువీధి వసంతోత్సవం ఆలయ పరిసర ప్రాంతాల్లోనే నిర్వహించారు. గజ, గరుడ వాహనాలపై ఉంచి నిర్వహించే తిరువీధి వసంతోత్సవం, గ్రామ ఊరేగింపును అధికారులు రద్దు చేశారు. ఆలయ పరిసర ప్రాంతంలోనే భక్తులు స్వామివారిపై వసంతోత్సవం జల్లుతూ గోవింద నామస్మరణతో తరించారు. సన్నాయి, మేళతాళాలతో డప్పులు, వాయిద్యాల నడుమ స్వామివారి తిరువీధోత్సవం మంగళవారం గిరిజాంబ కొండ ప్రాంతంలోనే జరిగింది. చంద్ర గ్రహణం కారణంగా నాగవల్లి వసంతోత్సవం ఊరేగింపు సమయాన్ని కుదించారు. వడ్డాది శారదా నదిలో వేంకటేశ్వర స్వామికి చక్రస్నానం చేయాల్సివుండగా గ్రహణం కారణంగా ఆలయం దిగువన మంచి నీటిట్యాంకు వద్ద స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉంచి ధర్మకర్త శ్రీరామ్‌, ఈవో శర్మ సమక్షంలో వేదపండితులు శాస్త్రోక్తంగా చక్రస్నానం చేయించారు. స్వామి వారితో పాటు పలువురు భక్తులు స్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను గిరిజాంబ కొండపై ఉంచారు. గ్రహణంతో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేశారు. బుధవారం తెల్లవారు నాలుగు గంటలకు ఆలయంలో సంప్రోక్షణ పూజలు చేసిన తర్వాత భక్తులకు పునః దర్శనాలు కల్పిస్తామని ఈవో శర్మ, అర్చకులు సాధువులు, శ్రీకాంతచార్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement