దేవదాయ భూముల్లో అక్రమాలపై
అనకాపల్లి : స్థానిక రింగ్‌రోడ్డు ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ పక్కన ఉన్న విశాఖ కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూమిని ఎండోమెంట్ కమిషనర్‌కు తెలియకుండా ఎకరా 11 సెంట్లు సుమారుగా రూ.100 కోట్ల విలువైన భూముల రికార్డులను తారుమారు చేయడంపై సీబీఐ విచారణకు చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్లమెంట్, నియోజకవర్గ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, మలసాల భరత్‌కుమార్ అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ పట్టణ అధ్యక్షుడు జానకీరామరాజు ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కన్యకాపరమేశ్వరి అమ్మ వారి దేవస్థానం భూమి సర్వే నంబర్ 1539/5లో సుమారుగా 111 ఏళ్ల క్రితం డి.కామమ్మ అనే మహిళ బ్రాహ్మణులకు సత్రంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరిగిందన్నారు. అప్పట్లో ఈ భూమిని ఎండోమెంట్‌లో 22సీగా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 22 ఏలోకి గత ఏడాది సెప్టెంబర్‌లో మార్పు చేసిందన్నారు. దేవస్థానం భూములను ఇతర వ్యక్తుల పేర్లు మార్చే సమయంలో రాష్ట్ర దేవస్థానం కమిషనర్ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని, అటువంటి నిబంధనలను పాటించకుండా కూటమి నేతలకు భూమిని కట్టబెట్టడం అన్యాయమన్నారు. 111 సంవత్సరాల క్రితం దేవదాయశాఖ అధికారులు కాండ్రేగుల సూరిఅప్పారావుకు కౌలుకు ఇవ్వడం జరిగిందని సూరిఅప్పారావు మృతిచెందిన తరువాత భార్య కాండ్రేగుల చిన్నతల్లికి కౌలుకు ఇవ్వడం జరిగిందన్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం ఈ భూమిని కాజేసేందుకు చర్యలు చేపట్టగా దేవదాయశాఖ అధికారులు, ప్రజలు ఉద్యమాలతో అడ్డుకున్నారని, మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి ఈ భూమిపై కన్నువేసిందన్నారు. ఈ విషయంపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు ఈనెల 3న కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూ మి పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూమిపై చర్చ జరుగుతుంటే దేవస్థానం, రెవెన్యూ అధికారులు ఆ భూమిలో నేటికీ బోర్డును ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూమిని కూటమి నాయకుల్లో కొంతమందికి అప్పగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. 1915లో కామమ్మ విశాఖ కన్యకాపరమేశ్వరి దేవస్థానం బ్రాహ్మణులకు సత్రంగా వాడుకోవాలని అప్పు డు 2.16 ఎకరాలు భూమిని అప్పగించడం జరిగిందని, ఎన్టీఆర్ బెల్లం మార్కెట్‌కు కొంత మేరకు భూమిని తీసుకున్నారని, మిగిలిన ఎకరా 11 సెంట్లు దేవస్థానం ఆధీనంలో ఉందన్నారు. కౌలు చేసిన వ్యక్తులు ఎలా భూ యజమానులు అవుతారని రికార్డులు తారుమారు చేశారో కూటమి నేతలు, ప్రభుత్వ అధికారులే చెప్పాలన్నారు. ప్రభుత్వ భూములు 22(ఎ,బి,సి,డి) విభాగంలో ఉంటాయని 22సీ పూర్తిగా దేవదాయశాఖకు చెందిందని, కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూమి 22సీ నుంచి 22ఏకు ఎలా మార్పు చేశారో లిఖిత పూర్వకంగా ప్రజలకు తెలియజేయాలన్నారు. భూమిని అడ్డుగోలుగా కలెక్టర్ సహకారంతో దోచుకోవాలని కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. రెవెన్యూ పరంగా భూములు మార్పులు చేయాలంటే వీఆర్‌వో, ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ సంతకాల తరువాత కలెక్టర్ సంతకం చేస్తారని, కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూమి విషయమై ఇలా జరగలేదన్నారు. ఇక్కడే డి.కామమ్మకు చెందిన మరో రూ. 50 కోట్లు విలువచేసే భూమి ఉందని, ఈ విషయాన్ని త్వరలో వెలుగులోనికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దిలీప్‌కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80,81 వార్డు ఇన్‌ఛార్జ్‌లు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, పార్టీ నాయకులు కొణతాల మురళీకృష్ణ, కలగలక్ష్మి గున్యయ్యనాయుడు, ఎం.శ్రీనివాసరావు, డానీ, పద్మకుమారి, మర్రిపల్లి శోభ, లక్ష్మి పాల్గొన్నారు.


