నోటమాట లేదు! | - | Sakshi
Sakshi News home page

నోటమాట లేదు!

Feb 26 2026 8:26 AM | Updated on Feb 26 2026 8:26 AM

నోటమా

నోటమాట లేదు!

పతనమైన టమాటా ధర

కిలో రూ.4కే వ్యాపారుల కొనుగోలు

కంటితడి పెడుతున్న రైతులు

గొలుగొండ: మార్కెట్లో టమాటా ధర పతనంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంట పండిస్తే, కిలో రూ.4కే వ్యాపారులు కొనుగోలు చేయడంతో గగ్గోలు పెడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధర లేక దిగాలుగా ఉన్న రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాడిపండు పడినట్టుగా తయారైంది. మూడు రోజుల నుంచి కురుస్తున్న తేలికపాటి వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ వర్షంతో పంట పాడవుతుందని వాపోతున్నారు.

600 ఎకరాల్లో సాగు

నర్సీపట్నం డివిజన్‌ పరిధిలో గొలుగొండ మండలంలోనే ఏటా టమాటా పంట విస్తారంగా సాగవుతోంది. తాండవ జలాశయం పరిసర ప్రాంతాలైన గొలుగొండ, సాలికమల్లవరం, వెంకటాపురం, కొత్తమల్లంపేట, అమ్మపేట పరిసర ప్రాంతాలతోపాటు వ్యవసాయ మోటార్లు ఉన్న ఏటిగైరంపేట, రిట్టవానిపాలెం, పాకలపాడు, చీడి గుమ్మల గ్రామాల్లో సుమారుగా 600 ఎకరాలకుపైగా పండిస్తున్నారు. గతే డాది డిసెంబరులో వేసిన పంట ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో కాపునకు వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో కిలో రూ.4కే ధర పలకడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.

ఎకరాకు రూ.30 వేల వరకు నష్టమే..

ఏటా జనవరిలో పంట కాపునకు వచ్చినప్పుడు కాస్త ధరలు తక్కువగా ఉంటాయి. గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లో వీటి ధరలు అధికంగా ఉండేవి. ఇవే ధరలు ఏప్రిల్‌ వరకు అనుకూలంగా ఉంటాయని భావించి అదనంగా సాగు చేశారు. అయితే ఈ నెల రెండో వారం నుంచి ధరలు పతనం కావడంతో ఎకరాకు రూ.30 వేల వరకు నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రవాణా సౌకర్యం లేక...

గొలుగొండ మండలంలో టమాటా పంట నాణ్యమైనది కావడంతో ఇతర ప్రాంతాల వ్యాపారులు వచ్చి పొలం వద్దే కొనుగొలు చేసి వాహనాలపై తరలించుకుపోతుంటారు. ఈ ఏడాది విశాఖ, తుని, రాజమండ్రి, అనకాపల్లి, విజయవాడ నుంచి వ్యాపారులు ఇక్కడికి రావడం లేదు. పై ప్రాంతాల్లో రైతులు టమాటా సాగు చేయడంతో వీటికి డిమాండ్‌ లేకుండా పోయింది. దీంతో ఇక్కడ పండిన పంటను నర్సీపట్నం, కృష్ణదేవిపేట మార్కెట్‌కు తరలించి అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల చిరు వ్యాపారులు తక్కువ ధరకు అమ్మకాలు చేయాల్సి వస్తోంది. ఒక్కొక్కసారి తీసుకెళ్లిన కాయలు అమ్మకంగాక అక్కడ దాచి మరుసటిరోజు విక్రయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ట్రే (25 కిలోలు) రూ. 80 నుంచి రూ. 100 వరకు అమ్మకం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.

అకాల వర్షంతో మరింత నష్టం

మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం రైతులకు మరింతగా నష్టాన్ని మిగులుస్తోంది. తేలికపాటి వర్షం పడటంతో కాయలు పాడై కుళ్లిపోతున్నాయి. ఇలా 20 నుంచి 30 శాతం కాయలు మూడు రోజుల్లోనే పాడయ్యాయి. రోజూ సాయంత్రం అరగంట పాటు తేలికపాటి వర్షం కురుస్తుందని వాపోతున్నారు. కనీసం మార్చి మొదటి వారంలోనైనా ధరలు ఉండాలని రైతులు ఆశిస్తున్నారు.

మార్కెట్‌లో కొనుగోలు లేక నిరీక్షణ

నేను ఎకరా వరకు టమాటా సాగు చేశాను. ప్రస్తుతం కాపు విస్తారంగా ఉంది. కోసిన కాయకులు కృష్ణదేవిపేట మార్కెట్‌కు తరలిస్తే గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. కాయలంతా ఒకేసారి రావడంతో కొనేవారు కరువయ్యారు. తక్కువ ధరకు అమ్మలేక, వాటిని మరలా ఇంటికి తీసుకురాలేక నరకయాతన పడుతున్నాం. – పరవాడ కవి,

రైతు, లింగంపేట, గొలుగొండ మండలం

తీవ్రంగా నష్టపోతున్నాం

ఫిబ్రవరిలో మంచి ధరలు ఉంటాయని ఉద్దేశంతో సాగు చేశాం. ఎన్నడూ లేని విధంగా ఈ నెలలోనే ధరలు పతనం కావడంతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మార్కెట్‌లో కిలో రూ.4కే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.

– ఎస్‌. సూకరాజు, రైతు, గొలుగొండ

నోటమాట లేదు! 1
1/4

నోటమాట లేదు!

నోటమాట లేదు! 2
2/4

నోటమాట లేదు!

నోటమాట లేదు! 3
3/4

నోటమాట లేదు!

నోటమాట లేదు! 4
4/4

నోటమాట లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement