డిజైన్ పూర్తి చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా పూర్తి
తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయ
తరగతులు నిర్వహించే జీవీఎంసీ ఉడ్‌పేట స్కూల్
సాక్షి, అనకాపల్లి : నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు.. నేడు జిల్లాలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తుకు సోపానంగా మారాయి. పదేళ్లుగా జిల్లా వాసులను ఊరించే కేంద్రీయ విద్యాలయానికి అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఏర్పడిన తరువాత నుంచి విద్య వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం..నాడే కేంద్రయ విద్యాలయం ఏర్పాటుకు పది ఎకరాల స్థలం కేటాయించడమే కాకుండా డిజైన్ పూర్తి చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా సుగమం చేసింది. 2025 విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లును ప్రారంభించాలనే ముందుచూపుతో నాటి అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడానికి నాడు అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి కృషితో సఫలీకృతం అయిందని చెప్పుకోవచ్చు. వచ్చే నెలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ అడ్మిషన్లు కూడా ప్రారంభం కావడం ఆమె కృషికి నిదర్శనం. దీనికోసం అనకాపల్లి పట్టణంలోని ఉడ్‌పేట జీవీఎంసీ పాఠశాలలో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పర్యవేక్షణ బాధ్యతను విశాఖలో ఉన్న కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌కు అప్పగించారు. కూటమి ప్రభుత్వంలో 20 నెలల పాటు జాప్యం జరగడం కారణంగానే అడ్మిషన్లు ప్రక్రియ ఆలస్యమైంది. లేదంటే గతేడాదిలోనే అడ్మిషన్లు ప్రారంభం కావాల్సి ఉంది.
వైఎస్సార్‌సీపీ హయాంలోనే స్థలం కేటాయింపు..
అనకాపల్లి జిల్లా ఏర్పడక ముందు నుంచే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాధన ఉన్నప్పటికీ నాడు టీడీపీ ప్రభుత్వంలో (2014–19) అడుగులు పడలేదు. కేవలం స్థలం పరిశీలనతోనే ముగిసింది. దాన్ని ప్రభుత్వం నుంచి అధికారికంగా జీవో గానీ..నిధులు కేటాయింపు గానీ రాలేదు. తరువాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి ప్రోత్సాహంతో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అన్ని విధాల సుగమం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేంద్రీయ విద్యాలయానికి అనకాపల్లి టౌన్‌లో సుందరయ్యపేట పంచాయితీ శివారులో అచ్చియ్యపేటలో సర్వే నెంబర్ 511–2లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జీవో కూడా ఇచ్చారు. వెనువెంటనే పది ఎకరాల ప్రభుత్వ భూమిని కేంద్రీయ విద్యాలయం (కేవీ) ఏర్పాటు కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (సికింద్రాబాద్)కు అప్పగించారు. ఎంపీ నిధులతో పది ఎకరాలను చదును చేయించడం కూడా జరిగింది. డిజైన్ పూర్తి చేసి ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా పూర్తి చేశారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటకు రూ.28.73 కోట్ల నిధులు కేంద్రీయ సంఘటన నుంచి కేటాయింపులు జరిగాయి. దీనికోసం అనకాపల్లి పట్టణంలోని ఉడ్‌పేట జీవిఎంసీ పాఠశాలలో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆలస్యం కారణంగా 20 నెలల పాటు జాప్యం జరిగింది. లేదంటే గతేడాదే అడ్మిషన్లు ప్రారంభం కావాల్సి ఉంది.
రూ.28.73 కోట్లతో కేవీ విద్యాలయం..
తాత్కలిక భవనంలో తరగతులు ప్రారంభమైన తరువాత నుంచి భవనాల నిర్మాణం చేపడతారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు రూ.28.73 కోట్ల నిధులు కేటాయించారు. వీటిలో రూ.10.5 కోట్లతో స్కూల్ భవనం, రూ.5.79 కోట్ల మౌలిక వసతులు, రూ.1.95 కోట్లతో వాల్ నిర్మాణం, రూ.4.77 కోట్లతో ఆటస్థలం, రూ.7 లక్షలతో క్యాంటీన్, గార్డు రూం ఏర్పాటుకు నిధులు కేటాయింపులు జరిగాయి.
కేవీతో ఈ ప్రాంత విద్యార్థులకు మంచి భవిష్యత్తు
కేంద్రీయ విద్యాలయం తీసుకు రావాలనే కృతనిశ్చయంతోనే పనిచేశాను. వచ్చే నెల నుంచి అడ్మిషన్లు ప్రారంభం అయితే ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు బావుంటుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు పది ఎకరాల స్థలం కేటాయిస్తూ జీవో వచ్చింది. అంతేకాకుండా నా ఎంపీ నిధులతో ఆ భూమిని చదును చేయించడమే కాకుండా..తాత్కాలికంగా ఉడ్‌పేట్‌లోఉన్న జీవీఎంసీ భవనాన్ని కూడా ఇవ్వాలని నిర్ణయించాం. 90 శాతం ప్రాసెస్ అంతా వైఎస్సార్‌సీపీ ప్రభ్వుత్వంలోనే జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నా..ఈ ప్రాంత విద్యార్థులకు మంచి జరగాలన్నదే వైఎస్సార్‌సీపీ ఉద్దేశ్యం.
– డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి, మాజీ ఎంపీ, అనకాపల్లి.


