4న చలో విజయవాడ
అనకాపల్లి : సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలు, మేకలు పెంపకందారుల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి, అధికారం చేపట్టి 20 మాసాలు కావస్తున్నా పట్టించుకోలేదని ఏపీ గొర్రెలు మేకలు పెంపకం దారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్ అన్నారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మార్చి 4న విజయవాడలో రాష్ట్ర ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పెంపకందారుకు 50 శాతం సబ్సిడీతో రూ.ఐదు లక్షలు రుణం ఇచ్చే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని, పశువైద్యశాలలు, ఆర్‌బీకేలలో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని, ఉచిత బీమా ద్వారా పశు నష్టపరిహారం రూ.10వేలు ఇవ్వాలని, సంవత్సరానికి నాలుగుసార్లు నట్టల నివారణ మందులు, అన్ని రకాల టీకాలు ఉచితంగా అందజేయాలని ఆయన కోరారు. సహకార సంఘాలకు ఎన్‌సీడీసీ ఇచ్చిన రూ. 88 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేసి, 90శాతం సబ్సిడీతో ఉపాధి హామీ నిధులతో షెడ్లు నిర్మించి, మందలను నిలుపుకోవడానికి వలలు పంపిణీ చేయాలని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన పెంపకందారునికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ పింఛన్ అందజేయాలన్నారు. పశు వైద్యకేంద్రాల్లో నెలకు పదివేల రూపాయల విలువైన నాణ్యమైన మందులు ఉంచాలని, పెంపకం దారుల రక్షణ కోసం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా సామాజిక రక్షణ చట్టం తేవాలని, పెంపకం దారులకు ఎక్స్‌గ్రేషియా పథకాన్ని పునరుద్ధరించి ప్రమాదంలో మరణిస్తే రూ.20 లక్షలు, సాధారణ మరణాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి గోకాడ దేముడు నాయుడు సభ్యులు మనబాల రాజేష్, గొర్లె రమణ తదితరులు పాల్గొన్నారు.


