8 నెలలకే డిప్యుటేషన్‌ | - | Sakshi
Sakshi News home page

8 నెలలకే డిప్యుటేషన్‌

Mar 4 2026 7:34 AM | Updated on Mar 4 2026 7:34 AM

● ఆర్డీవో కార్యాలయ ఏవోగా మాకవరపాలెం తహసీల్దార్‌ వెంకటరమణ ● టీడీపీ నేతలకు అనుకూలంగా లేరనే ఆరోపణలు? ● చర్చనీయాంశమైన నియామకం

మాకవరపాలెం: స్థానిక తహసీల్దార్‌ వెంకటరమణ డిప్యుటేషన్‌ చర్చనీయాంశమైంది. మండలంలో కొందరు టీడీపీ నేతలకు అనుకూలంగా లేకనే ఆయన్ను సాగనంపినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది జూన్‌ 23న మాకవరపాలెం తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. కేవలం ఎనిమిది నెలలకే ఆయనకు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయ ఏవోగా నియమిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. అక్కడ ఏవోగా పనిచేస్తున్న ముసీబ్‌ను ఇక్కడ తహసీల్దార్‌గా నియమించారు.

ఆక్రమణలకు అడ్డుకట్ట వేసిన తహసీల్దార్‌..

తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వెంకటరమణ తనదైన శైలిలో విధులు నిర్వహించారు. తామరం రెవెన్యూలో టీడీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నించిన 20 ఎకరాల గెడ్డ పోరంబోకు భూమిని స్వాధీనం చేసుకున్నారు. రామన్నపాలెం శివారు చినరాపల్లి వద్ద టీడీపీకి చెందిన వారు ఊటగెడ్డ రిజర్వాయర్‌ భూమిలో చేపట్టిన ఆక్రమణలనూ అడ్డుకున్నారు. అంతేకాకుండా ఇటీవల తూటిపాల వద్ద సర్పానదిని ఆనుకున్న భూమిలో ఇసుక తరలింపునకు ఏర్పాట్లు చేసే క్రమంలో జేసీబీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. తామరంలో ప్రభుత్వ భూమికి పాసుపుస్తకాలు చేసేందుకు ఓ బ్రోకర్‌ ఆశచూపిన రూ.20 లక్షలను సైతం తిరస్కరించారు. ఏళ్ల తరబడి రాచపల్లి రెవెన్యూలో ఏపీఐఐసీ పేరున ఉన్న రైతుల భూముల మార్పునకు ఆయన కృషి చేశారు.

ల్యాండ్‌ బ్యాంకు సిద్ధం చేయడంలోనూ ..

మాకవరపాలెం మండలాన్ని పరిశ్రమల హబ్‌గా చేయాలనే స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో తొలుత రాచపల్లి రెవెన్యూలోని సర్వే నంబరు 737లో 406 ఎకరాల రైతుల భూమిని సర్వే చేసి కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధం చేశారు. పరిశ్రమల స్థాపనకు అనువుగా పైడిపాల, బూరుగుపాలెం, పాపయ్యపాలెం ప్రాంతాల పరిధిలోని మరో 4,400 ఎకరాల ల్యాండ్‌ బ్యాంకును సిద్ధం చేయడంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. భూ ఆక్రమణలు చేసే వారు ఏ పార్టీవారైనా కేసులు పెట్టాలన్న స్పీకర్‌ ఆదేశాలనూ ఆయన ముక్కుసూటిగా అమలు చేశారు. అయితే ఆర్డీవో కార్యాలయంలో పాలనా పరమైన ఇబ్బందులను అధిగమించేందుకు తహసీల్దార్‌ వెంకటరమణకు డిప్యుటేషన్‌పై ఏవోగా నియమించినట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కానీ కొందరు టీడీపీ నేతలకు అనుకూలంగా లేకపోవడంతోనే ఆయన డిప్యుటేషన్‌ జరిగిందని తీవ్రంగా చర్చ సాగుతోంది. ఏది ఏమైనా 8 నెలల్లోనే ఆయనను ఇక్కడ నుంచి డిప్యుటేషన్‌పై పంపడం మండలంలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement