
కర్ణాటకలో ముఖ్యమంత్రి త్వరలోనే మారతారంటూ ఊహాగానాలు వినిపించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో మొదలు.. బీజేపీ, జేడీఎస్‌ల సెటైర్లతో అది జరగొచ్చని జోరుగా ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి ఎట్టకేలకు తెర పడింది. తానే ఐదేళ్లు సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య ప్రకటించగా.. దానికి కొనసాగింపుగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం కొట్టిపారేశారు. ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని, అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని మీడియాతో అన్నారాయన. అయితే కాసేపటికే ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు.
‘‘నాకు ఇంకేం ఆప్షన్ ఉంది చెప్పండి. ఆయనకు మద్దతుగా నిలవడం తప్ప..’’ అంటూ డీకేఎస్ బదులిచ్చారు. ‘‘నన్ను సీఎంగా చేయాలని నేరు ఎవరినీ కోరలేదు. నాకు మద్దతుగా మాట్లాడమని ఎవరినీ పురమాయించలేదు. ఆ అవసరం కూడా నాకు లేదు. ఒకరు సీఎం ఉన్నప్పుడు.. ఇలాంటి ప్రకటనలు ఎందుకు?. పార్టీలో నాతో పాటు లక్షల మంది పని చేస్తున్నారు. పార్టీ నిర్ణయమే నాకు శిరోధార్యం’’ అని స్పష్టం చేశారాయన.
అంతకుముందు.. సీఎం మార్పు ప్రచారంపై సీఎం సిద్ధరామయ్య కాస్త కటువుగానే స్పందించారు. యస్.. ఐదేళ్లు నేనే సీఎంగా కొనసాగుతా. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. మార్పు ఉందని చెప్పడానికి వాళ్లు(బీజేపీ, జేడీఎస్)ఏమైనా కాంగ్రెస్ అధిష్టానమా? అని మీడియాను ఎదురు ప్రశ్నించారాయన.
👉2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత.. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే అప్పట్లోనే ఇద్దరూ రెండున్నరేళ్ల చొప్పున పదవిని పంచుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారాన్ని ఇద్దరూ తోసిపుచ్చారు. కట్ చేస్తే..
👉ఈ ఏడాది జూన్ 29వ తేదీన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్.. 2–3 నెలల్లో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు అని వ్యాఖ్యానించడంతో అసలు చర్చ మొదలైంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుంది అని బదులిచ్చారు. అయితే..
👉ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు వేసింది. పార్టీ అధ్యక్షుడే హైకమాండ్ కాకపోతే మరెవరు?” అని ప్రశ్నించింది. మరోవైపు జేడీఎస్ కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ను ఎద్దేవా చేస్తూ సీఎం మార్పు తథ్యమన్నట్లు ప్రకటనలు ఇచ్చింది. ఈ తరుణంలో.. ఇటు సిద్ధరామయ్య, అటు శివకుమార్‌లు ఈ వ్యాఖ్యలను ఖండించారు.
హుస్సేన్‌కు నోటీసులు ఇస్తాం: డీకేఎస్
సీఎం మార్పు ప్రచారాన్ని ఖండించిన డీకే శివకుమార్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్‌కు నోటీసు ఇస్తాం. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరతాం. పార్టీ నియామావళికి అందరూ కట్టుబడి ఉండాలి.. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోకతప్పదు అని డీకే శివకుమార్ హెచ్చరించారు.