శిథిల బతుకులు | Sigachi Industry Explosion: Bodies are being uncovered as rubble is cleared | Sakshi
Sakshi News home page

శిథిల బతుకులు

Jul 3 2025 1:41 AM | Updated on Jul 3 2025 7:40 AM

Sigachi Industry Explosion: Bodies are being uncovered as rubble is cleared

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ గేటు ఎదుట రోదిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు

మరో రెండు మృతదేహాలు వెలికితీత!

చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మృతి?

ఇంకా తెలియని 10 మంది ఆచూకీ 

మూడో రోజూ కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌ 

తమ వారి మృతదేహాల కోసం బాధిత కుటుంబ సభ్యుల నిరీక్షణ  

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/పటాన్‌చెరు: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించిన చోట శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నా యి. బుధవారం మరో రెండు మృతదేహాలు లభించినట్టు సమాచారం. తీవ్రగాయాల పాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మరణించినట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య 45కు చేరువైనట్టు అనధికారిక అంచనా. 

సిగాచి పరిశ్రమ యాజమాన్యం మాత్రం 40 మంది చనిపోయారని ప్రకటించింది. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్నా పదిమంది ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్‌ బుధవారం కూడా కొనసాగింది. డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి.    వర్షం, సాంకేతిక కారణాలతో సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. దీంతో శిథిలాల తొలగింపు ప్రక్రియ గురువారం కూడా కొనసాగనుంది.  

డీఎన్‌ఏ రిపోర్టుల రాక ఆలస్యం  
శిథిలాల్లో బయటపడిన మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేస్తున్నారు. మొత్తం 37 మృతదేహాలు పటాన్‌చెరు ఆస్పత్రికి చేర్చారు. ఈ మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఎన్‌ఏలు సరిపోయాకే మృతదేహాలను అప్పగిస్తున్నారు. అయితే ఈ రిపోర్టులు రావడానికి 24 గంటల నుంచి 48 గంటలు పడుతుందని అధికారులు చెప్పారు.  

చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మృత్యువాత 
తీవ్ర గాయాలపాలై సంగారెడ్డి జిల్లాతోపాటు, హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో బుధవారం ముగ్గురు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి కారి్మకులు చాలామంది 70 శాతం వరకు కాలిన గాయాలైన విషయం విదితమే. ఇందులో పలువురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. 

బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారుల విడుదల చేసిన సమాచారం ప్రకారం.. 
– ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో పనిచేస్తున్నవారు : 143 
– ప్రమాదం నుంచి బయటపడిన వారు : 60 
– గాయపడి చికిత్స పొందుతున్నవారు : 35 
– మరణించిన వారిలో పేర్లు గుర్తించిన మృతదేహాలు : 18 
– పేర్లు గుర్తించని మృతదేహాల సంఖ్య : 20 
– ఆచూకీ లభించకుండా పోయినవారు : 10 

డీఎన్‌ఏ రిపోర్టుల సమాచారం : 
డీఎన్‌ఏ టెస్ట్‌ అయ్యాక ఆయా కుటుంబాలకు అప్పగించిన మృతదేహాల సంఖ్య : 18 
– ల్యాబ్‌ నుంచి డీఎన్‌ఏ రిపోర్టుల రావాల్సిన మృతదేహాలు : 18 
– డీఎన్‌ఏ పరీక్షల కోసం సేకరించాల్సిన శాంపిల్స్‌ : 2 
– ల్యాబ్‌లో ప్రాసెస్‌ చేయాల్సిన కుటుంబసభ్యుల రక్త శాంపిల్స్‌ : 25 
– ఇప్పటి వరకు జాడ తెలియని కుటుంబాల సంఖ్య : 3 
– ప్రాసెస్‌ చేయబడిన, సరిపోలిన శాంపిల్స్‌ సంఖ్య : 5 

మంత్రి దామోదర వాహనం అడ్డగింత  
రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించేందుకు వస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ వాహనాన్ని సిగాచీ పరిశ్రమ వద్ద బాధిత కుటుంబాలు అడ్డున్నాయి. జస్టిన్‌ ఆచూకీ చెప్పాలని బాధిత కుటుంబ సభ్యులు మంత్రి వాహనానికి ఎదురుగా వెళ్లారు. దీంతో వాహనం దిగి వచ్చిన మంత్రి వారిని సుముదాయించి దైర్యం చెప్పారు.  



18 బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం  
18 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.18 లక్షలు చెల్లించారు. గాయపడిన 34 మందికి రూ.50 వేల చొప్పున రూ.17 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆచూకీ లభించని వారి కుటుంబాలకు తాత్కాలికంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందించినట్టు అధికారులు తెలిపారు. 

పరిశ్రమలోకి దూసుకెళ్లేందుకు బాధిత కుటుంబాల యత్నం..ఉద్రిక్తత  
సిగాచీ పరిశ్రమలోకి కొందరు బాధిత కుటుంబ సభ్యులు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. బుధవారం సాయంత్రం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిశ్రమ గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదం జరిగి మూడు రోజులైనా, తమ వారి మృతదేహాలను అప్పగించకపోవడం దారుణమన్నారు. అధికారుల వైఫల్యం కారణంగానే మట్టి దెబ్బల కింద ఎంతోమంది విగతజీవులుగా పడి ఉన్నారన్నారు. 

‘మీకు చేతకాకపోతే చెప్పండి.. ఎముకలైనా తవ్వుకొని తీసుకెళతాం’అని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ప్రమాదం జరిగిన రోజే శిథిలాలను తొలగించి వెతికి చూస్తే ఇంకా చాలామంది బతికే వారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రెండు మృతదేహాలు వెలికి తీశారని, అది కూడా తమ ఒత్తిడి మేరకే జరిగిందని వారు వివరించారు. ఒక మృతదేహంపై దుస్తులు కూడా ఉన్నాయని, శవాన్ని గుర్తించే స్థితిలో ఉందని వారు చెప్పారు.ఆ రోజే శిథిలాలను తొలగించి ఉంటే ఇంకొంతమంది ప్రాణాలతో బయటపడే వారిని బండ్లగూడకు చెందిన శిల్ప పేర్కొన్నారు.  

ఇద్దరి పరిస్థితి విషమం  
గచ్చిబౌలి: ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మదీనాగూడలోని ప్రణమ్‌ హాస్పిటల్‌లో 18 బాధితులకు చికిత్స అందిస్తున్నామని, గురువారం 10 మందిని డిశ్చార్జ్‌ చేస్తామని హాస్పిటల్‌ ఎండీ మనీష్‌గౌర్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన రోజే ఈ హాస్పిట్‌కు 22మందిని తీసుకొచ్చారు. వీరిలో హేమసుందర్, లగ్నాజిత్, శశిభూషణ్‌లు మృత్యువాత పడ్డారు. ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జనరల్‌ వార్డులో 13 మందికి చికిత్స అందిస్తున్నారు. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన తారక్‌ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయంగా ఉందని డాక్టర్లు తెలిపారు.  

మిషనరీ కాలం చెల్లిందని చెప్పినా... 
సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన విషయంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌కు చెందిన రాజనాల సాయియశ్వంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భానూరు పోలీసులు మంగళవారం కేసు (క్రైం నెం.184/2025) నమోదు చేశారు. అయితే ఈ పరిశ్రమలో మిషనరీ కాలం చెల్లిపోయిందని.. పాతబడిన ఈ మిషనరీని మార్చాలని.. తన తండ్రి రాజనాల వెంకట్‌జగన్‌మోహన్‌ పలుమార్లు యాజమాన్యం దృష్టికి తెచ్చారని సాయియశ్వంత్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తక్షణం ఈ యంత్రాలను మార్చకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లుతుందని ముందుగానే యాజమాన్యానికి చెప్పారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో 20 సంవత్సరాలుగా తన తండ్రి వెంకటజగన్‌మోహన్‌ (55) పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనలో ఆయన మరణించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు భానూరు పోలీసులు సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై బీఎన్‌ఎస్‌ 105, 110, 117 సెక్షన్ల కింద జూన్‌ 30న కేసు నమోదు చేశారు. వెంకటజగన్‌మోహన్‌ది స్వస్థలం ఒడిశాలోని గంజామ్‌ జిల్లా చత్రాపూర్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement