
అభిప్రాయం
భారతీయ ప్రజాస్వామ్యానికి దేశంలోని మరే ఇతర సంస్థ కన్నా కూడా ఎన్నికల కమిషనే (ఈసీ) ఎక్కువ నష్టం కలిగించింది. తెలిసో తెలియకనో వాటిల్లిన ఆ నష్టం వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాలక పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నికలను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ఇపుడు ప్రజల మనసులలో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి.
దీనిలో ఉద్దేశపూర్వకంగా జరిగింది ఎంతో నాకు తెలియదు. దానికి సంబంధించి నా వద్ద ఎలాంటి సమాచారం కూడా లేదు. కానీ, ఒక సంస్థగా దాని వ్యవహార శైలిపై మరింత స్పష్టీకరణ, మరింత నిజాయతీతో కూడిన జవాబులు అవసరం. ‘సీఎస్‌డీఎస్’ సర్వేలలో ఈసీ విశ్వసనీయత స్థిరంగా తగ్గుతూ రావడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది! తన ప్రతిష్ఠను పునరుద్ధరించుకునేందుకు ఈసీ చేసుకున్నది కూడా ఏమీ లేదు.
ఇప్పుడెందుకు సమీక్ష?
బిహార్ శాసన సభ ఎన్నికల సందర్భంగా, ఆ రాష్ట్రంలోని ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా నిశితంగా సమీక్షించాలని ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
బిహార్ ఎన్నికలను మరో రెండు నెలల లోపలే ప్రకటించనున్నారని అందరికీ తెలిసిన విషయమే. అటువంటి సమయంలో ఎన్నికల జాబితాను విస్తృతంగా సమీక్షించవలసిన అవసరం ఏమొచ్చింది? కడపటి సమీక్షను 2003లో నిర్వహించారు. అది పూర్తయ్యేందుకు దాదాపు రెండేళ్ళు పట్టింది. ఇపుడు ఈసీ ఆ పనిని రెండు నెలల్లో పూర్తి చేయాలని కోరుతోంది.
ఇది వర్షాకాలం. బిహార్‌లో చాలా భాగం వరద తాకిడికి గురవడం కూడా సర్వ సాధారణం. దీంతో ఓటర్ల జాబితా సమీక్ష మరింత క్లిష్టంగా మారుతుంది. అసలు అలా ఆదేశించడమే తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రమైన బిహార్‌లో వనరులు అరకొరగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు దేశం మొత్తంమీద నాసిరకమైనవి.
ఈ నేపథ్యంలో, ఓటర్ల జాబితాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సవరించడం ఇంచుమించుగా అసాధ్యం. రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్‌లతోపాటు ఇతర పార్టీలు కూడా ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పాలక పార్టీకి సాయపడేందుకే అది ఈ ప్రక్రియను చేపట్టిందని నిందించడంలో వింతేముంది?
ఈ పార్టీలు కొన్ని సమంజసమైన ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఓటర్ల జాబితా సంగ్రహ సవరణ జరిగినపుడు, మళ్ళీ ఈ తతంగం దేనికి? తప్పుడు ఓటర్ల జాబితాను ఆధారం చేసుకుని కడపటి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని ఈసీ భావిస్తోందా? కొద్ది నెలల క్రితం నిర్వహించిన సంగ్రహ సవరణ లోపాలతో కూడుకుని ఉందనీ, వాటిని ఇపుడు సరిదిద్దవలసి ఉందనీ భావిస్తోందా? అని అవి ప్రశ్నలను సంధిస్తున్నాయి.
అదే నిజమైతే, దేనిని ఆధారం చేసుకుని ఆ రకమైన నిర్ధారణకు వచ్చిందో ఈసీ మొత్తం దేశానికి చెప్పవలసిన అవసరం లేదా? ఏదైనా దర్యాప్తు జరిపారా? నివేదిక దేనినైనా రూపొందించారా? ఈ అంశాలపై ఎవరూ నోరు విప్పడం లేదు.
ఆధార్ పనికిరాదా?
ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా నిశితంగా సవరిస్తామంటే ఏ పార్టీ అయినా వ్యతిరేకిస్తుందని నేను అనుకోను. క్రితంసారి 2003లో సవరించినపుడు, ఆ ప్రక్రియ సాధికారమైనదిగా ఉండేందుకు తగినంత సమయాన్ని ఇచ్చారు. ఈసారి కనిపిస్తున్నట్లుగా ఆదరాబాదరాగా ఎన్నడూ జాబితాలను సవరించిన దాఖలాలు లేవు.
ఓటర్ల జాబితా (2003)కు ఎక్కని ప్రతి పౌరుడు/పౌరురాలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పడమే ప్రతిపక్ష నాయకుల మనసులలో తీవ్ర సందేహాలను రేకెత్తిస్తోంది. అలాగే, 1987 తర్వాత పుట్టినవారు వారి తల్లితండ్రుల బర్త్ సర్టిఫికెట్‌ను సమకూర్చాలని చెబుతున్నారు. అది, అందులోనూ బిహార్ వంటి రాష్ట్రంలో చాలా బృహత్తరమైన కార్యం. బిహార్‌లో అక్షరాస్యత అత్యల్పం.
ప్రభుత్వ యంత్రాంగం అంతంత మాత్రంగా ఉన్న చోట, చాలా తక్కువ వ్యవధిలో అటువంటి సర్టిఫికెట్లను పొందడం కుదిరే పని కాదు. పరమ దారిద్య్రంలోనున్న సమాజంలోని బడుగు వర్గాలు ప్రభుత్వ కార్యాలయం గడప తొక్కేందుకే జంకుతాయి. అలాంటిది తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలను వారు సమకూర్చుకోగలరని ఊహించడం కూడా అసంబద్ధమే అవుతుంది.
ఈ ప్రక్రియ మరింత సందేహాస్పదంగా మారడానికి మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిణమించింది. ఈ ప్రక్రియకు ఆ కార్డు చెల్లదని చెబుతున్నారు. ‘ఎందుకని’ అనే దానికి వివరణ లేదు. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించడం తేలిక కనుక, అది అధికారికమైన గుర్తింపు పత్రంగా గణనకు రాదని ఊహాగానాలు సాగుతున్నాయి. ఆ లెక్కన, ఇతర డాక్యుమెంట్లు మాత్రం నకిలీవి కావనే గ్యారంటీ ఏమైనా ఉందా? దీనిపై ఈసీ నోరు విప్పుతుందా?
తటస్థ అంపైర్ అనుకోవచ్చా?
ఈసీ అసాధారణమైన రీతిలో న్యాయబద్ధత తాలూకు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సమాన పోటీ అవకాశాలను కల్పించి, తటస్థ అంపైర్‌గా ఉండవలసిన ఈసీ భారతీయ జనతా పార్టీ ఆడించే బొమ్మగా మారిందనీ, దాని స్వతంత్రత తీవ్ర రాజీకి లోనవుతోందనీ రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.
మోదీ ప్రభుత్వం ఈ అంశాన్ని మరింత జటిలం చేసింది. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానల్‌లో ప్రధాని, ప్రతిపక్ష నాయకునితోపాటు భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని సుప్రీంకోర్టు తీర్పు చెబితే, సీజేఐ స్థానాన్ని ప్రభుత్వం ఒక క్యాబినెట్ మంత్రితో భర్తీ చేసింది. స్వతంత్రంగా వ్యవహరించే ఈసీ రావడం ప్రభుత్వానికి ఇష్టం లేదేమోననే అభిప్రాయాన్ని అది కల్పించింది.
మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరగడం పైన, ఎన్నికల జాబితాలను ఇష్టానుసారం తారుమారు చేసేశారని ప్రశ్నలు రేకెత్తినపుడు, ఈసీ నుంచి విశ్వసనీయమైన వివరణ రాలేదు.
కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లుగా పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీని ఇచ్చేందుకు కూడా ఈసీ తిరస్కరించింది. అందుకు అది సాంకేతిక కారణాన్ని సాకుగా చూపింది. వాస్తవానికి, ప్రభుత్వం నిబంధనను మార్పు చేసింది. వీడియో ఫుటేజీని 45 రోజులకు మించి అట్టేపెట్టకూడదని ఈసీ కూడా నిర్ణయించింది. అంతకు ముందు ఆ కాల పరిధి ఏడాదిగా ఉండేది.
దేశంలో 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అత్యంత మతపరమైన ఎన్నికలు. ముస్లింలను నేరుగా లక్ష్యంగా చేసుకున్నా, ఎటువంటి చర్యా తీసుకోలేదు. ఈసీ కనుక నిఘా నేత్రంగా వ్యవహరించి ఉంటే, అనేక మంది నాయకులు వారి ఓటింగ్ హక్కును కోల్పోయి ఉండేవారు. మతపరమైన ప్రచారం చేసినందుకు ఓసారి బాలాసాహెబ్ ఠాక్రే అలాగే ఓటు హక్కును కోల్పోయారు.
ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. సంస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని ఈసీ గ్రహించాలి. ఆ సంస్థ విశ్వసనీయతను కోల్పోతే, దేశానికి భవిష్యత్తు అనేదే ఉండదు. మాయోపాయాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఈసీ రాజీపడుతోందని అనుమానం ప్రబలితే, మొత్తం ప్రజాస్వామిక ప్రక్రియే సందేహాస్పదంగా మారుతుంది. చట్టబద్ధమైన ఓటర్లదే విజయమనే ప్రజా నమ్మకం వమ్ము అవుతుంది. ప్రజాస్వామ్యానికి అది మరణ శాసనం అవుతుంది.
ఆశుతోష్
వ్యాసకర్త సత్యహిందీ డాట్‌కామ్ సహ–స్థాపకుడు,
‘హిందూ రాష్ట్ర’ పుస్తక రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)