
వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు విస్మయం
సివిల్ కేసును పోలీసులు క్రిమినల్ కేసుగా మారుస్తారా?
ఇది సరైన పద్ధతి కాదంటూ ప్రభుత్వానికి చీవాట్లు
వంశీ బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం ధర్మాసనం
హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ
మైనింగ్ కేసులోనూ బెయిల్ రద్దుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ
ఈ దశలో బెయిల్ రద్దు సాధ్యం కాదని స్పష్టీకరణ
ఇప్పటికే అనేక కేసుల్లో ఆయనను అరెస్ట్ చేశారని గుర్తు చేసిన కోర్టు
ఈ వ్యవహారం మొత్తం సివిల్ వివాదం. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మలుస్తారా? ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత కేసు నమోదు చేస్తారా? ఇదేమి తీరు? సరైన పద్ధతి కాదు.
– రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ సుప్రీం విస్మయం
అక్రమ కేసులమీద అక్రమ కేసులతో ప్రతిపక్ష నేతలను జైలు పాల్జేయడమే లక్ష్యంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసుపై కూటమి సర్కారును నిలదీసింది. తప్పుడు కేసులతో 140 రోజులు జైల్లో ఉంచిన వంశీని బయటకు రాకుండా చేసిన ప్రయత్నాలకు సర్వోన్నత న్యాయస్థానం అడ్డుకట్ట వేసింది.
– సాక్షి, అమరావతి
⇒ ఓ సివిల్ వివాదంలో ఫిర్యాదుదారు వెనుకుండి వంశీ బెయిల్ రద్దు కోసం పిటిషన్ దాఖలు చేయించిన రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి చీవాట్లు పెట్టింది. వంశీ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
⇒ గన్నవరం మైనింగ్ కేసులో వంశీకి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో బెయిల్ రద్దు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే వంశీని అనేక కేసుల్లో అరెస్ట్ చేశారని ప్రభుత్వానికి గుర్తుచేసింది. గన్నవరం మైనింగ్ వ్యవహారంలో మైనింగ్ వాల్యుయేషన్ నివేదికను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుందరేష్, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
2022–23లో ఘటన.. 2025లో కేసా?
వల్లభనేని వంశీ, తదితరులు తమ ఆస్తి వివాదంలో జోక్యం చేసుకుంటున్నారంటూ సుంకర సీతామహాలక్ష్మి 2025లో గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. అయితే, ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మే 9న తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సీతామహాలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది.
వాదనలు విన్న ధర్మాసనం వంశీకి బెయిల్ ఇస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. 2022–23లో ఘటన జరిగితే 2025లో కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం మొత్తం సివిల్ వివాదమని, దీనిని క్రిమినల్ కేసుగా ఎలా మారుస్తారంటూ పోలీసుల తీరును ఎండగట్టింది. వంశీ బెయిల్‌ను రద్దు చేయాలన్న సీతామహాలక్ష్మి అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.
⇒ గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు, గన్నవరంతోపాటు విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు మైనింగ్ జరిపి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి మే 15న ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా గన్నవరం పోలీసులు వంశీ, మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపి పలు షరతులతో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మే 29న ఉత్తర్వులిచ్చింది. వీటిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ వేసింది. దీనిపై బుధవారం సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. హైకోర్టు తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అక్రమ మైనింగ్‌తో రూ.195 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని తెలిపారు. 700 పేజీల నివేదిక ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఈ దశలో బెయిల్ రద్దు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఆ నివేదికను సీల్డ్ కవర్‌లో తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.