
- ముగిసిన జీ జిన్ పింగ్ శకం
- రెండు వారాలపాటు జీ అదృశ్యం.
- నాయకత్వ మార్పుకు సంకేతాలు
- ప్రస్తుతం పాలనా పగ్గాలు జాంగ్ యూక్సియా చేతిలో!
గత మే 21-జూన్ 5 తేదీల మధ్య సుమారు 15 రోజులపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ (72) జనానికి కనిపించలేదు. దీంతో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు. మరి పాలనా పగ్గాలు వాస్తవంగా ఎవరి చేతిలో ఉన్నట్టు? ఈ పరిణామం చైనా కమ్యూనిస్టు పార్టీలో నాయకత్వ మార్పుకు సంకేతమా? అంటే... డ్రాగన్ ముఖచిత్రం అలాగే దర్శనమిస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బ్రెజిల్ దేశంలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకూ జిన్ పింగ్ హాజరుకాబోవడం లేదు. తాను గద్దెనెక్కాక బ్రిక్స్ శిఖరాగ్రానికి జీ హాజరుకాకపోవడం ఇదే తొలిసారి! ఆయన బదులు చైనా ప్రధాన మంత్రి లీ కియాంగ్ బ్రిక్స్ సదస్సుకు వెళ్లనున్నారు.
సమస్య బ్రిక్స్ గురించి కాదు. అసలు చైనాలో ఏం జరుగుతోంది? జిన్ పింగ్ కేవలం దేశాధ్యక్షుడే కాదు... చైనీస్ కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) ఛైర్మన్ కూడా. సీఎంసీ తొలి వైస్ ఛైర్మన్ అయిన జనరల్ జాంగ్ యూక్సియా (జహంగ్ యూషా) చేతిలో ప్రస్తుతం దేశ పాలనా పగ్గాలు ఉన్నట్టు సమాచారం. కమ్యూనిస్టు పార్టీలో శక్తిమంతమైన 24 మంది సభ్యుల పొలిట్ బ్యూరోలో జాంగ్ సభ్యుడు. దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోకు విశ్వాసపాత్రులైన పార్టీ సీనియర్ సభ్యులు పలువురు జాంగ్ యూక్సియాకు మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. చైనాలో కీలక ఆర్థిక, సైనిక రంగాలపై జీ జిన్ పింగ్ ప్రభావం సన్నగిల్లుతోంది. ఆయన భావజాలపు ముద్ర బలహీనపడుతోంది. జీ నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.
ఆర్థిక రంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. నిరుద్యోగం బాగా ప్రబలుతోంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. జిన్ పింగ్ రాజకీయ వారసుడిగా టెక్నోక్రాట్ వాంగ్ యాంగ్ (70) తెరపైకొస్తున్నారు. ఉదారవాదిగా, సంస్కర్తగా వాంగ్ యాంగ్ కు పేరుంది. ఇక జిన్ పింగ్ సన్నిహితులుగా ముద్రపడిన జనరల్స్ ఉద్వాసనకు గురవుతున్నారు. అలా జిన్ పింగ్ క్రమంగా ‘మసకబారుతున్నారు’. కాదు... పార్టీ నాయకత్వమే ఆయన్ను పక్కకు తప్పిస్తోంది. మూడేళ్ళ క్రితం 2022లో చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో... జిన్ పింగ్ పక్కన ఆశీనుడైన దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోను... తాను ‘రాను రానంటున్నా’... సిబ్బంది అమర్యాదకరంగా, బలవంతంగా బయటికి లాక్కెల్లిన దృశ్యాలను ఎవరు మరువగలరు?
ఆ చర్యను జిన్ పింగ్ నిలువరించే ప్రయత్నం చేయకపోగా కనీసం అటు వైపు కన్నెత్తి చూడలేదు. హై ప్రొఫైల్ నేతలను ఇలా సాగనంపడం చైనాకు కొత్త కాదు. తమ దేశంలో తలెత్తే అంతర్గత వివాదాల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం బహిర్గత (విదేశాంగ) వ్యవహారాలను ఉపయోగించుకోవడం చైనాకు రివాజు కనుక... ప్రస్తుత సమయంలో మన దేశం జాగ్రత్తగా ఉండాలనేది నిపుణుల హెచ్చరిక. ఇండియాపై సైబర్ దాడులను చైనా తీవ్రతరం చేయవచ్చు. అలాగే భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా డ్రాగన్ దెబ్బతీసే అవకాశాలూ లేకపోలేదు.
- జమ్ముల శ్రీకాంత్