
టిక్‌టాక్‌తోపాటు వాణిజ్యంపై చర్చ
వాషింగ్టన్: అమెరికా, చైనా సంబంధాల్లో మరో ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. చైనాకు చెందిన సోషల్ మీడియా యాప్ ‘టిక్‌టాక్’ను అమెరికాలో యథాతథంగా కొనసాగించడంపై వారు చర్చించినట్లు సమాచారం. దీనిపై త్వరలో తుది ఒప్పందానికి రావాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు ఇరువురి మధ్య చర్చ ప్రారంభమైనట్లు వైట్‌హౌస్ అధికారులు వెల్లడించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించి, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్, జిన్‌పింగ్ భావిస్తున్నారు. త్వరలో ముఖాముఖి సమావేశమై ఒప్పందాన్ని కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చి చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించిన తర్వాత జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడడం ఇది రెండోసారి.
వచ్చే నెలలో జిన్‌పింగ్‌ను కలుస్తా: ట్రంప్ జిన్‌పింగ్‌తో మాట్లాడానని, టిక్‌టాక్ అంశంతో పాటు వాణిజ్యంపై చర్చించానని ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. దక్షిణ కొరియాలో వచ్చే నెల లో జరగబోయే శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జిన్‌పింగ్‌ను కలుసుకోబోతున్నానని పేర్కొన్నారు. అలాగే వచ్చే ఏడాది ఆరంభంలో చైనాకు వెళ్తానని తెలిపారు.