
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో నాలుగు వారాల్లోగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను(Xi Jinping) తాను కలుస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చైనాతో సోయాబీన్ అంశంపై చర్చించనున్నట్టు తెలిపారు. కాగా, ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌తో భేటీపై ఆసక్తి నెలకొంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో తాజాగా స్పందిస్తూ..‘చైనా(China) చర్యల కారణంగా అమెరికాలో సోయాబీన్ రైతులు నష్టపోతున్నారు. జోబైడెన్ ప్రభుత్వంలో అమెరికా నుంచి సోయాబీన్ కొనుగోళ్లను చైనా ఆపేసింది. ఇప్పుడు కేవలం చర్చల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే జిన్‌పింగ్‌తో మాట్లాడాలని అనుకుంటున్నారు. మరో నాలుగు వారాల్లో నేను జిన్‌పింగ్‌ను కలిసి దీనిపై మాట్లాడతాను. నేను మా రైతులను ఎప్పటికీ నిరాశపరచను. అమెరికా రైతులకు అండగా ఉంటాను. మేము ఇప్పటికే సుంకాల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాం. ఆ డబ్బులో కొంత భాగం రైతులకు సహాయం చేయబోతున్నాం. రైతులను ఆదుకుంటాం’ అని చెప్పుకొచ్చారు.
Trump announced he will have a meeting with Xi to beg China to start buying American soybeans again: pic.twitter.com/liZZ3cEkFU
— Spencer Hakimian (@SpencerHakimian) October 1, 2025
మరోవైపు.. అక్టోబరు చివరివారంలో దక్షిణకొరియాలో ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (అపెక్) సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి పలు దేశాధినేతలు హాజరుకానున్నారు. ఆ సదస్సు అనుబంధంగా జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతానని ఇటీవల ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక, వచ్చే ఏడాది ఆరంభంలో చైనాలో పర్యటిస్తానని కూడా అమెరికా అధ్యక్షుడు ఆ మధ్య ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. ట్రంప్ యంత్రాంగం మళ్ళీ టిక్ టాక్ విషయంలో ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి మంతనాలను జరుపుతోంది. తాజాగా ఓవల్ ఆఫీసులో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మంచి సంభాషణ జరిపాను. ఆయన టిక్‌టాక్ ఒప్పందాన్ని ఆమోదించారు. ఒప్పందం కోసం మేము ఎదురుచూస్తున్నాం. దానిపై సంతకం చేయాలి. ఇది లాంఛనప్రాయంగా ఉండవచ్చు. టిక్‌టాక్ ఒప్పందం జరుగుతోంది. పెట్టుబడిదారులు సిద్ధమవుతున్నారు’ అని చెప్పుకొచ్చారు.