
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా విషయంలో దూకుడు పెంచుతూ నాటో దేశాలు, చైనాలను హెచ్చరించారు. చమురు కొనుగోలును వెంటనే నిలిపేయాలని.. లేదంటే చైనాపై 100 శాతం పన్నులు విధిస్తానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలపై చైనా స్పందించింది.
అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రి స్పందించారు. స్లోవేనియా పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ..‘యుద్ధం సమస్యలను పరిష్కరించలేదు. ఇదే సమయంలో పలు దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయి. ప్రస్తుతం చైనా ఎలాంటి యుద్దం చేయడం లేదు.. యుద్ధంలో పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు. అయితే, చైనాపై ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన చేసిన కొద్దిసేపటికే వాంగ్ యి ఇలా కామెంట్స్ చేయడం గమనార్హం.
అంతకుముందు ట్రంప్.. చైనాపై భారీ సంఖ్యలో సుంకాలు విధిస్తేనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని నాటో దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. యుద్ధాన్ని నిలువరించేందుకు కావాల్సిన నిబద్ధత కొన్ని నాటో దేశాల్లో 100 శాతం కన్నా ఎంతో తక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే పన్నులు విధిస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు. లేదంటే తన సమయంతోపాటు అమెరికా డబ్బునూ వృథా చేస్తున్నట్లేనని అన్నారు.
China hits back at Trump's 100% tariff call.
Chinese Foreign Minister Wang Yi said that war cannot solve problems and sanctions only complicate them— CivilBuzz (@NetiNeti24) September 14, 2025
అంతటితో ఆగకుండా.. రష్యాపై బీజింగ్ పట్టు సాధించిందని.. సుంకాలు విధించడం ద్వారా దీన్ని బలహీనపరచవచ్చని అన్నారు. ఈ యుద్ధానికి బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలే కారణమని మరోసారి ఆరోపించారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై టారిఫ్‌లు విధించాలని ఈయూ, జీ7 దేశాలకు విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.