
యశవంతపుర: మగువలు అందచందాలకు మెరుగుల కోసం వెళ్తే వంచకులు పర్సులను ఖాళీ చేశారు. బెంగళూరుకు చెందిన పెరిమీటర్ సెలూన్ అనే సంస్థ పలు జిల్లాలలో స్పా సెలూన్లను నిర్వహిస్తోంది, ఈ సెలూన్లకు వెళ్లిన శ్రీమంత మహిళలకు మాయమాటలు చెప్పి కోట్లాది రూపాయలను మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నిర్వాహకులు నూరిపోసేవారు.
ఇది నమ్మిన మహిళలు డబ్బులు వస్తాయనే ఆశతో రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు ముట్టజెప్పారు. సదరు మహిళలకు అసలు, లాభం ఏదీ దక్కలేదు, సంస్థ యజమానులు రక్షా హరికాల్ సెల్వ, సునీత్ మెహతా, తివారీలు మోసం చేశారని బాధిత మహిళలు బెంగళూరు గోవిందరాజనగర, తలఘట్టపురతో పాటు అనేక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. వందలాది మంది మహిళలకు రూ.50 కోట్ల వరకు మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది.