
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
నిరాశపరిచిన రాహుల్
తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 42, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (137) చేసిన రాహుల్ స్వల్ప స్కోర్‌కే ఔట్ కావడం టీమిండియా అభిమానులకు తీవ్రంగా నిరాశపరిచింది. విదేశాల్లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన రాహుల్‌కు ఎడ్జ్‌బాస్టన్ అచ్చిరాలేదు. గతంలోనూ అతను ఇక్కడ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలమయ్యాడు (13, 4).
మరో ఛాన్స్‌ను కూడా వృధా చేసుకున్న కరుణ్
రాహుల్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కరుణ్ నాయర్ ఆదిలో కాస్త ఇబ్బంది పడినా ఆతర్వాత కుదురుకున్నాడు. అయితే దురదృష్టవశావత్తు బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి 31 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో కరుణ్ మరో ఛాన్స్‌ను కూడా వృధా చేసుకన్నట్లైంది. 8 ఏళ్ల తర్వాత ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్.. ఆ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటై, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేశాడు.
జైస్వాల్ ఖాతాలో మరో హాఫ్ సెంచరీ
రాహుల్, కరుణ్ ఔటైనా ఏమాత్రం ఒత్తిడికి గురి కాని యశస్వి జైస్వాల్ ఈ మధ్యలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు.
తొలి రోజు లంచ్ విరామం సమయానికి భారత్ 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. జైస్వాల్ 62, శుభ్‌మన్ గిల్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.
తొలి టెస్ట్‌లో ఇలా..
కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది.
ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు. భారత బౌలర్లు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు.
ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు చేశారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవీంద్ర జడేజాది కూడా అదే పరిస్థితి.
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్బుతంగా ఆడారు. అయినా సెకెండ్ ఇన్నింగ్స్‌లో బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదైన ప్రయోజనం లేకుండా పోయింది.
తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134) సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది.