సోషల్‌ మీడియా వరమా? శాపమా? బాధితులెవరు? ఏం చేయాలి? | Gift or a curse? pros and cons of Social media | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా వరమా? శాపమా? బాధితులెవరు? ఏం చేయాలి?

Jul 2 2025 10:47 AM | Updated on Jul 2 2025 11:00 AM

Gift or a curse? pros and cons of Social media

విజయనగరం గంటస్తంభం: సోషల్‌ మీడియా (Social Media)  ఇప్పుడు మనిషి నిత్యకృత్యాల్లో ఓ భాగమైంది. బంధుమిత్రులతో కనెక్ట్‌ అవ్వడానికి మంచి వేదికైంది. అనుభావాలను, అలవాట్లను, ఆలోచనలను పంచుకునే చోటు. ఇది కొంతమేర బాగానే ఉన్నా ఎదుటివారి ‘సోషల్‌ బతుకు’లను చూస్తూ కుంగుబాటుకు లోనవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇతరుల వివరాలు, వినోదాలు, విలాసాలను చూస్తూ.. చాలామంది.తమను తాము తక్కువ చేసుకుంటున్నారు. మరి సోషల్‌ మీడియాలో మనం చూసే ప్రతిదీ నిజమేనా? అంటే..‘కాదు’ అనే చెప్పాల్సి వస్తుంది. 

ఎందుకుంటే  ‘ఫ్యామిలీ ఓవర్‌ ఎవ్రీ«థింగ్‌’ అంటూ ఫొటోను స్టేటస్‌ పెట్టుకునేవారు పట్టుమని పది నిమిషాలు కూడా ఫ్యావిులీతో గడపకపోవచ్చు. ‘ఫ్రెండ్స్‌ ఫర్‌ లైఫ్‌’ అనేవారు  అసలు స్నేహితులే లేకపోవచ్చు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంటూ అర్ధరాత్రి పూట పోస్టులు పెడుతుండవచ్చు, నిద్రపోకుండా ఆరోగ్యం పాడుచేసుకోవచ్చు. ‘అమ్మే దైవం’ అని ఎమోషనల్‌ క్యాప్షన్స్‌ పెట్టేవారంతా అమ్మకు పనుల్లో సాయం చేస్తారన్నది అపోహే. పొద్దున నిద్ర లేదగానే దేవుడి వీడియోలను స్టేటస్‌లుగా పెట్టుకున్నవారు మంచి మనుషులని ఏ తప్పూ చేయని వారని అనుకుంటే పొరపాటే. 

పిల్లికి బిచ్చం వేయనివారే ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడుపడవోయ్‌’ అంటూ ఫోజులు కొట్టవచ్చు. నువ్వు లేనిదే నేను లేనంటూ ఇన్‌ బాక్స్‌ల్లో ప్రేమ పాఠాలు వల్లె వేసేవారు..ఆ మాటే మరొకరికి చెప్పరని గ్యారంటీ లేదు. ఖరీదైన కారు ముందో, విలాసవంతమైన భవనం ముందో నిలబడి ఫొటోలు పెడితే వాళ్ల వైభోగాన్ని చూసి అసూయ కలుగుతుంది. కానీ అవి వాళ్ల సొంతమేనా కాదా?  వారికి ఆ తాహతుందా, లేక ఆర్భాటాలకు పోయి ఆనక అప్పులతో ఇబ్బందులు పడుతున్నారా? అవేవీ మనకు తెలియదు. ఫొటోల కోసం ఎవరికో ఏదో సాయం చేస్తున్నట్లు నటించేవారు పెరుగుతున్నారని వారి సోషల్‌ మీడియా పోస్టులే చెబుతుంటాయి. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌లలో  అందమైన అమ్మాయిలు ఫొటోలు చూసి ఆత్మన్యూనతకు లోనయ్యేవారు, తామూ అలాగే కనపడాలని రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌  కొంటున్న వారూ లేకపోలేదు. ఫొటోలకు ఫిల్టర్లు ఉంటాయని ఎలాంటి వారైనా అందంగా కనిపించవచ్చని ఆ క్షణం స్ఫురించదు.   తెరమీద కనిపించేవన్నీ ఫిల్టరేసిన బతుకులు. నిజజీవితాలు కాదు. నిజాయతీగా ఉన్నదున్నట్లు చూపించుకునేవారూ ఉంటారు. కాకపోతే వారిది ప్రదర్శనలా ఉండదు. ఎవరికీ ఇబ్బంది కలిగించదు. లేనిది ఉన్నట్లూ ఉన్నది లేనట్లూ చూపించుకోవడానికి సోషల్‌ మీడియాను మయసభలా వాడుకునే వారితోనే సమస్యంతా.  

మంచికి వాడుకుందాం.. 
పోస్టులు పెడుతుంటారు, సమాచారాన్ని షేర్‌ చేస్తుంటారు. ఇటీవల సోషల్‌ మీడియాలో రాజకీయ, విధానాపరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి.ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలు, న్యాయపరమైన విధానాలపై వచ్చే పోస్టులను ఇతరులకు పంపడం ద్వారా చిక్కుల్లో పడుతుంటాం. అనవసరంగా పోలీసు కేసుల బారిన పడుతుంటాం.అటువంటి సమయంలో సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు సాక్ష్యాలుగా చూపుతున్నారు పోలీసులు. లేనిపోని లింకులు క్లిక్‌ చేయడం, పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్టులకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.  

అడిక్షన్‌ ఉందో లేదో ఇలా గుర్తించొచ్చు...
సోషల్‌ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనికి బదులు ఫోన్‌లో  యాప్‌లను తెరిస్తే అది వ్యసనానికి సంకేతంగా చెబుతున్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకోవడం, మెస్సేజ్‌లను చూడడం.ప్రతి చిన్న సమస్యకు పరిష్కారంగా ఆన్‌లైన్, సోషల్‌ మీడియాపై అధికంగా ఆధారపడడం.

సెల్ఫీల మోజు బాగా పెరిగింది..
సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవాలి. అతిగా సెల్‌ఫోన్‌ వినియోగంచడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. ఇక యువతకు సెల్ఫీ మోజు బాగా పెరిగింది. సెల్ఫీ మోజులో ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. దీంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. -వై.సతీష్‌ కుమార్,  సీనియర్‌ కెమిస్ట్రీ లెక్చరర్, విజయనగరం 

తల్లిదండ్రులు నియంత్రించాలి..
అనవసరమైన వయస్సులో పిల్లలకు సెల్‌ఫోన్‌ ఇవ్వకూడదు. యువత ఫోన్లను విపరీతంగా వాడుతోంది. సరదా కోసం తీస్తున్న సెల్ఫీలు చివరకు ప్రాణాల మీదికి తెస్తున్నాయి.– ప్రశాంత్‌ కుమార్‌ ఎంఎస్సీ సైకాలజీ,  విజయనగరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement