ఆగ్రహ జ్వాలలు | 22 dead as protest in Nepal over social media ban turns violent | Sakshi
Sakshi News home page

ఆగ్రహ జ్వాలలు

Sep 10 2025 2:32 AM | Updated on Sep 10 2025 7:36 AM

22 dead as protest in Nepal over social media ban turns violent

సింఘదర్బార్‌లో పోలీస్‌జాకెట్‌ వేసుకుని నినదిస్తున్న ఆందోళనకారుడు

నేపాల్‌లో మహోగ్రరూపం దాల్చిన ఆందోళనలు

రెండోరోజూ రెచ్చిపోయిన విద్యార్థులు, యువత 

పోలీసులతో ఘర్షణ, హింసాత్మక ఘటనల్లో 22కు పెరిగిన మరణాలు 

పార్లమెంట్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు 

నైతిక బాధ్యతగా పదవీత్యాగం చేసిన ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ 

మంటల్లో కాలి చనిపోయిన మాజీ ప్రధాని ఖనాల్‌ సతీమణి 

నేపాల్‌తో సరిహద్దు వద్ద పహారాను కట్టుదిట్టంచేసిన భారత్‌ 

కాఠ్మండు మేయర్‌ బాలెన్‌ను కొత్త ప్రధానిగా చేయాలన్న ఆందోళనకారులు 

కర్ఫ్యూలోనూ వీధులను కదనరంగంలా మార్చిన విద్యార్థులు 

ఆర్థిక మంత్రిని రోడ్డుపై పరుగెత్తించి కొట్టిన యువకులు 

రక్తమోడిన మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా దంపతులు 

ఆగ్నికి ఆహుతైన పలువురు నేతల ఇళ్లు  

రాజకీయ పార్టీల ప్రధానకార్యాలయాలూ ధ్వంసం 

జైళ్లను బద్దలుకొట్టి వందలాది ఖైదీలను విడిపించిన నిరసనకారులు 

శాంతించాలంటూ జెన్‌జెడ్‌ వర్గాన్ని చర్చలకు ఆహ్వనించిన సైన్యం

కాఠ్మండు/న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా యాప్‌లపై నిషేధంతోపాటు విద్యార్థులు, యువత సోమవారం మొదలెట్టిన ఆందోళనలు మెరుపువేగంతో నేపాల్‌ను చుట్టేసి దేశాన్ని సంక్షోభ కుంపట్లోకి నెట్టేశాయి. సామాజిక మాధ్యమాల సేవలను పునరుద్ధరిస్తున్నామని కేపీ శర్మ ఓలీ సారథ్యంలోని ప్రభుత్వం కొద్ది గంటల్లోనే స్పష్టంచేసినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. రాజధాని కాఠ్మండు మొదలు దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత తమ నిరసనజ్వాలలను మరింతగా ఎగదోస్తూ ఏకంగా పార్లమెంట్‌ భవనానికి నిప్పు పెట్టారు. మంగళవారం ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగాయి. కాళీమతిలో పోలీస్‌సర్కిల్‌కు నిప్పుపెట్టి అధికారులపై దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు.

దీంతో ఇద్దరు చనిపోయారు. దీంతో కాల్పులు, పరస్పర ఘర్షణ ఘటనల్లో మరణాల సంఖ్య మంగళవారానికి 22కు పెరిగింది. 300 మందికిపైగా గాయపడ్డారు. కట్టలు తెంచుకున్న యువాగ్రహాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మంగళవారం తన పదవికి రాజీనామాచేశారు. భద్రంగా ఇంటి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు నేపాల్‌ ఆర్మీ చీఫ్‌ అశోక్‌ రాజ్‌ సిగ్దెల్‌ను బతిమాలుకున్నట్లు వార్తలొచ్చాయి.

ఆందోళనకారుల నిరసన కార్యక్రమం అదుపుతప్పి మాజీ ప్రధానమంత్రి, తాజా మంత్రులపై భౌతికదాడులదాకా వెళ్లింది. ప్రధాని ఓలీకి చెందిన భక్తపూర్‌లోని బాల్కోట్‌ నివాసాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. మాజీ ప్రధానమంత్రి ఝలనాథ్‌ ఖనాల్‌ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ మంటల్లో చిక్కుకుని ఆయన భార్య రాజ్యలక్ష్మీ చిత్రకార్‌ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆమెను సమీప కీర్తిపూర్‌ బర్న్‌ 

ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు 
కోల్పోయారు. ఎటు చూసినా ఆస్తుల విధ్వంసం, వినాశనంతో నేపాల్‌ నిలువెల్లా రక్తమోడింది. దుకాణాల లూటీలు, పౌరుల భయాందోళనల నడుమ ప్రధాని రాజీనామాతో ఎట్టకేలకు సైన్యం పూర్తస్థాయిలో రంగంలోకి దిగి శాంతభద్రతల పరిరక్షణ బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకుని ప్రజల ఆస్తులను ధ్వంసంచేస్తూ లూటీలకు తెగించిన వాళ్ల అంతుచూస్తామని ఆర్మీ చీఫ్‌ హెచ్చరించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి, రాజకీయ వారసత్వం, సంపన్న, ఉన్నతస్థాయి వర్గాల ఆధిప్యంపై ఇప్పటికే విసిగిపోయిన యువత తాజాగా సామాజికమాధ్యమాలపై హఠాత్తుక నిషేధం 
విధించడంతో వాళ్లలో ఆగ్రహం పెల్లుబికి మహోద్యమంగా మారడంతో దేశ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. 

పెల్లుబికిన ఆగ్రహం 
పరిస్థితిని మరింతగా కట్టుతప్పొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కర్ఫ్యూను విధించింది. అయినాసరే వేలాదిమంది విద్యార్థులు, యువత ‘జెన్‌ జెడ్‌’కూటమిగా ఏర్పడి రాజధాని కాఠ్మండు మొదలు పట్టణాలదాకా విధ్వంసానికి తెగించారు. మాజీ ప్రధానమంత్రులు మొదలు తాజా కేబినెట్‌ మంత్రులు, కీలక నేతల దాకా ముఖ్యమైన వ్యక్తుల ఇళ్లకు నిప్పంటించారు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలనూ ధ్వంసంచేశారు. కనిపించిన ప్రతి ఒక్క రాజకీయ నేతను చితకబాదారు. దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్, మాజీ ప్రధాని పుష్పకమల్‌ దహాల్‌(ప్రచండ), ప్రస్తుత కమ్యూనికేషన్స్‌ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్, మాజీ హోం మంత్రి రమేశ్‌ లఖ్హార్, మాజీ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బాల ఇళ్లను నాశనంచేశారు. ఆందోళనలు కాఠ్మండులోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్నీ తాకాయి. దీంతో ముందుజాగ్రత్తగా అంతర్జాతీయ విమానసర్వీసులను రద్దుచేసి ఎయిర్‌పోర్ట్‌ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు.  

ఎటుచూసినా విధ్వంసమే 
ఆందోళనలను ఏ దశలోనూ అడ్డుకోలేక పోలీసులు చేతులెత్తేయడంతో విద్యార్థులు, నిరసనకారుల విధ్వంసకాండ ఆకాశమే హద్దుగా సాగింది. పార్లమెంట్, దేశాధ్యక్షుని కార్యాలయం, ప్రధాని నివాసం, సుప్రీంకోర్టు భవనం, ప్రధాన రాజకీయ పార్టీల హెడ్‌ఆఫీస్‌లు, సీనియర్‌ నేతల ఇళ్లు, మీడియా కార్యాలయాలు ఇలా ప్రతి దేశంలోని కీలక భవంతులన్నీ ఆందోళనకారుల ఆగ్రహజ్వాలల బారినపడ్డాయి. డల్లూ ఏరియాలోని మాజీ ప్రదాని ఝలానాథ్‌ నివాసానికి నిప్పుపెట్టారు. కపన్‌ ప్రాంతంలోని నేపాలీ కాంగ్రెస్‌ నేత ఇంటిని తగులబెట్టారు.

సింఘదర్బార్‌లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం భవనానికీ నిప్పుపెట్టారు. మహరాజ్‌గంజ్‌లోని అధ్యక్షకార్యాలయం, బలూవతార్‌లో ప్రధాని అధికారి నివాసం సైతం నిప్పురవ్వల వర్షంలో కాలిపోయాయి. టిన్‌కునేలో కాంతిపూర్‌ టెలివిజన్‌ ఆఫీస్‌ను ధ్వంసంచేశారు. బుద్ధనీలకంఠ ప్రాంతంలోని మాజీ ప్రధాని షేర్‌బహదూర్‌ దేవ్‌బా ఇంట్లో చొరబడి దేవ్‌బా, భార్య అర్జూ రాణాలను రక్తంకారేలా కొట్టారు. దీంతో ప్రాణభయంతో ఆయన పచ్చికబయళ్లకు పరుగులుపెట్టారు. విషయం తెల్సుకుని సైన్యం రంగంలోకి దిగి ఆయనను నిరసనకారుల బారినుంచి కాపాడింది.

దేవ్‌బా కుమారుడు జైబీర్‌కు చెందిన కాఠ్మండులో హిల్టన్‌ ఐదునక్షత్రాల హోటల్‌కు, అర్జూకు చెందిన ఖుమల్తార్‌లోని ఉలెన్స్‌ పాఠశాలకు, తోఖాలో మాజీ ప్రధాని బాబూరామ్‌ భట్టారాయ్‌ ఇంటికి నిప్పుపెట్టారు. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్‌ పౌదెల్‌ను వీధిలో పరుగెత్తించిమరీ చితక్కొట్టారు. వెనక నుంచి ఆయన్ను ఒకతను వీపుమీద ఎగిరి తన్నుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గోశాల, లూభూ, కాళీమతి పోలీస్‌పోస్ట్‌లకూ నిరసనకారులు నిప్పుపెట్టారు. కలాంకీ, కాళీమతి, తహచల్, బనేశ్వర్, నైకాప్, ఛియాసల్, ఛపగావ్, థేచో ఇలా ప్రతి ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించారు.

టైర్లు తగలబెట్టి రోడ్లపై రాకపోకలను నిలిపేశారు. కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రధాన కార్యాలయ భవనం ఎక్కి పార్టీ జెండాను చింపేశారు. పోఖ్రా పట్టణంలో ఆందోళనకారులు కారాగారం గోడలు బద్దలుకొట్టారు. దీంతో జైలులోని 900 మంది ఖైదీలు బయటకు పరుగులుతీశారు. కాఠ్మండూలోని నఖూ జైలుకూ ఇదే గతి పట్టింది. దీంతో ఇక్కడి ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో మాజీ హోం మంత్రి రవి లమీచ్ఛానే సైతం ఉన్నారు. ఇదే అదనుగా కొన్ని అల్లరిమూకలు దుకాణాలను లూటీ చేశాయి.  

దిగిపోవాలని డిమాండ్‌ చేసి దింపేశారు
మంగళవారం ఉదయం ప్రధాని కేపీ శర్మ ఓలీ కార్యాలయాన్ని చుట్టుముట్టిన వందలాది మంది ఆందోళనకారులు తర్వాత లోపలికి చొరబడి శర్మను వెంటనే గద్దె దిగాలని మొండిపట్టుపట్టారు. ‘‘కేపీ దొంగ, దేశాన్ని వీడిపో’’అంటూ పెద్దగా నినాదాలు చేశారు. తప్పని పరిస్థితుల్లో వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేశాధ్యక్షుడు రాంచంద్రకు లేఖ రాశారు. ‘‘నేపాల్‌ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. పరిస్థితి కుదుటపడేందుకు రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా తగు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నా’’అని 73 ఏళ్ల సీనియర్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌(యునిఫైడ్‌ మార్కిస్ట్‌–లెనినిస్ట్‌) నేత శర్మ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

వెంటనే రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారు. అయితే నూతన మంత్రివర్గం ఏర్పడేదాకా ఆయనే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారని దేశాధ్యక్షుడు చెప్పారు. నేపాల్‌ కాంగ్రెస్‌ పార్టీ అండతో గత ఏడాది జూలైలో శర్మ నాలుగోసారి ప్రధాని పదవిని చేపట్టడం తెల్సిందే. శర్మ దిగిపోవాలని నేపాల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్వి గగన్‌ థాపా సైతం అంతకుముందే డిమాండ్‌చేశారు. చైనాతో సత్సంబంధాలు కొనసాగించే శర్మీ తరచూ భారతవ్యతిరేక విధానాలను అవలంభించే నేతగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. గత షెడ్యూల్‌ ప్రకారం ఈనెలలోనే భారత్‌లో పర్యటించాల్సి ఉండగా ఆలోపే పదవీసన్యాసం చేశారు. అయితే శర్మ దేశాన్ని వీడి దుబాయ్‌కు వెళ్లనున్నారని, ఆయన కోసం రన్‌వే మీద హిమాలయ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని సిద్ధంగా ఉంచారని వార్తలొచ్చాయి.

 

అగ్నికి ఆహుతవుతున్న ప్రధాని ఇల్లు  

బాణసంచా కాల్చి.. పారిపోకుండా ఆపి.. 
నేపాల్‌ నుంచి పారిపోయేందుకు నేతలకు హెలికాప్టర్‌ సేవలను అందిస్తోందన్న పుకార్లతో సిమ్రిక్‌ ఎయిర్‌లైన్స్‌ భవంతిని ఆందోళనకారులు తగలబెట్టారు. భైసేపతి మంత్రుల క్వార్టర్స్‌ నుంచి మంత్రులు విదేశాలకు హెలికాప్టర్లలో పారిపోతున్నారన్న వార్తలతో విద్యార్థులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేల సమీపంలో బాణసంచా, రాకెట్లు కాల్చారు. దీంతో ఆకాశంలో పొగచూరింది. డ్రోన్లు ఎగరేసి, పౌర లేజర్‌లైట్లు రన్‌వే వైపు ప్రసరింపజేసి విమాన రాకపోకలను అడ్డుకోవాలని ప్రజలకు ఆందోళనకారులు సోషల్‌మీడియా వేదికగా పిలుపునిచ్చారు. అయితే అప్పటికే కొన్ని హెలికాప్టర్లు అక్కడి నుంచి వెళ్లిపోయాయని వార్తలొచ్చాయి. కొందరు మంత్రులు, వీవీఐపీలు ఆర్మీ బ్యారెక్‌లలో తలదాచుకున్నారు.  

పార్లమెంట్‌ను రద్దుచేయండి: బాలెన్‌ షా 
యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న కాఠ్మండు నగర మేయర్, 35 ఏళ్ల బాలేంద్ర షా మాత్రం వెంటనే పార్లమెంట్‌ను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘నిరసనకారులు శాంతించాలి. విద్యార్థి బృందాలు తక్షణం ఆర్మీ చీఫ్‌తో చర్చలకు సంసిద్ధమవ్వాలి. అంతకుముందే పార్లమెంట్‌ను రద్దుచేయాలి’’అని అన్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, తాము ఎంపీలుగా రాజీనామా చేస్తామని రా్రïÙ్టయ స్వతంత్ర పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు ప్రకటించారు. ఉద్యమానికి తమ పూర్తి మద్దతు తెలిపారు. తాను సైతం రాజీనామా చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ప్రదీప్‌ యాదవ్‌ చెప్పారు.  

చర్చించుకుందాం.. రండి 
ఆందోళనను విడనాటి చర్చలకు రావాలని జెన్‌ జెడ్‌ విద్యార్థి, యువలోకానికి దేశాధ్యక్షుడు రాంచంద్ర పౌదెల్‌ పిలుపునిచ్చారు. శాంతి, సుస్థిరతకు అందరం పాటుపడుతున్నామంటూ నేపాల్‌ ఆర్మీ చీఫ్‌ అశోక్‌రాజ్‌ సిగ్దెల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏక్‌ నారాయణ్‌ ఆర్యల్, హోం సెక్రటరీ గోకర్ణ దవాదీ, సాయుధ పోలీసు బలగాల చీఫ్‌ రాజు ఆర్యల్, ఐజీ చంద్ర కుబేర్, జాతీయ దర్యాప్తు విభాగ సారథి హుత్రాజ్‌ థాపా సంతకాలు చేసి ఒక సంయుక్త ప్రకటన విడుదలచేశారు.

అయితే 26 సోషల్‌మీడియా సైట్ల పునరుద్దరణతోపాటు వాక్‌ స్వాతంత్య్రం, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా రాజకీయనేతలకూ రిటైర్మెంట్‌ వయసును ప్రకటించాలని పలు డిమాండ్లను యువత ప్రభుత్వం ముందుంచింది. మంత్రులు, ఉన్నతవర్గాల కుటుంబాలే సకల సౌకర్యాలను పొందుతున్నాయని ఉద్యమకారులు సోషల్‌మీడియాలో ప్రచారాన్ని మొదలెట్టారు. పరిస్థితిని చక్కదిద్ది ప్రభుత్వం, ఆర్మీ దేశంలో మళ్లీ శాంతిని నెలకొల్పాలని నేపాల్‌లోని ఆ్రస్టేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, ద.కొరియా, బ్రిటన్, అమెరికా రాయబార కార్యాలయాలు సంయుక్త ప్రకటనలో అభ్యర్థించాయి. ఉద్యమాలు శాంతియుతంగా సాగాలని హింసాత్మక పథం పనికిరాదని ఐక్యరాజ్య సమితి సైతం హితవు పలికింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement