
నడి వయసు వారికంటే జెన్–జెడ్‌లో అధిక అసంతృప్తి
సంప్రదాయ సూత్రీకరణలకు భిన్నంగా వాస్తవ స్థితి
సోషల్ మీడియా, ఆర్థిక అస్థిరత, కోవిడ్‌తో యువతలో నిరాశ
44 దేశాల్లో అధ్యయనం ద్వారా తేల్చిన పరిశోధకులు
యువతరం అనగానే ఉరిమే ఉత్సాహం, నిత్య చైతన్యం నిండిన ముఖాలే గుర్తుకొస్తాయి. సాధారణంగా జీవితంలో అసంతృప్తి దశ అంటే మధ్య వయసు అని ఎన్నాళ్లుగానో ఒక నమ్మకం బలపడిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. మధ్య వయస్కులకంటే జనరేషన్–జెడ్ (1996–2010 మధ్య పుట్టిన వారు)గా పిలుస్తున్న యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడైంది.
భవిష్యత్తుపై అనిశ్చితి, సోషల్ మీడియా ప్రభావం, కోవిడ్–19 తర్వాత వచ్చిన మార్పులు తదితర పరిణామాలతో యువతలో అసంతృప్తి అధికంగా ఉందని 44 దేశాల్లో దీర్ఘకాలంపాటు నిర్వహించిన గ్లోబల్ సర్వేలో తేలింది. డేవిడ్ జి.బ్లాంచ్‌ఫ్లవర్, అలెక్స్ బ్రైసన్, జియావోయ్ జు అనే శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయన నిర్వహించింది. 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వంటి పరిశోధనలను బట్టి చూస్తే మధ్య వయస్కులలోనే అసంతృప్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.
కానీ, ఈ సంప్రదాయ సూత్రీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పు అని ఈ శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిర్వహించిన సర్వేలోనూ దాదాపు ఇవే ఫలితాలు వచ్చాయి. దశాబ్దాలుగా పరిశోధకులు ‘మిడ్ లైఫ్ అన్‌హ్యాపినెస్ హంప్’ను ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చారు.
కానీ, ఇప్పుడు యువతలో.. అదీ కూడా 15 నుంచి 28 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారిలో ఈ ధోరణి అధికంగా ఉందని గుర్తించారు. ఇందుకు సోషల్ మీడియా, ఆర్థిక అస్థిరత, కోవిడ్–19 దీర్ఘకాలిక ప్రభావాలు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిర పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం వంటివి కారణమని తేల్చారు.
స్కీ స్లోప్‌లోకిజెన్ జెడ్
అధిక ఆదాయ దేశాల్లోని (హై ఇన్‌కమ్ కంట్రీస్)యువతలో అసంతృప్తి స్థాయి అధికంగా ఉంది. విభిన్న నేపథ్యాలున్న దేశాల్లోనూ ఈ పరిస్థితి పెరుగుతోంది.జెన్– జెడ్ అసంతృప్తిలో ‘స్కీ స్లోప్’ను అంటే.. పల్లంలోకి జారుకునే స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇతర అధ్యయనాల్లోని డేటా కూడా ఈ ధోరణిని సమరి్థస్తోంది. మానసికఆందోళన, ఒత్తిళ్లు, కుంగుబాటు అనేవి 16–19 ఏళ్ల మధ్యనున్న టీనేజర్లు, 20–24 ఏళ్ల మధ్య వయసులోని యువతలో అధికంగా ఉన్నట్టు తేలింది. గత పదేళ్లుగా యువతరం మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఈ బృందం ప్రచురించిన అధ్యయనంలో పేర్కొన్నారు.
ఐక్యరాజ్య సమితి సీడీసీ నివేదికలోని అంశాలు..
» యువకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు 1993లో 2.5% ఉండగా, 2024లో 6.6%కి పెరిగాయి.
» యువతుల్లో ఇదే కాలంలో 3.2% నుంచి 9.3%కి చేరింది.
» 2023 గ్యాలప్ సర్వేలో జెన్ జెడ్‌లో 15% మంది తమ మానసిక ఆరోగ్యం బాగా ఉందని తెలిపారు.
» 1981–1996ల మధ్య జని్మంచిన 52% మిలీనియల్స్ (మధ్య వయసువారు) మానసిక ఆరోగ్యం మాత్రం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.
సమస్యలకు కారణాలు..
» సోషల్ మీడియా అధిక వినియోగంతో అవాస్తవిక సామాజిక పోలికలు ఏర్పడి ఆందోళన, అసంతప్తి పెరుగుతోంది. జెన్ జెడ్ ఎక్కువగా ఆర్థిక ఆందోళన, అస్థిరతను ఎదుర్కొంటున్నారు.
» కోవిడ్–19 వల్ల సామాజిక, విద్యా జీవితానికి ఏర్పడిన అంతరాయాలు యువత మానసిక ఆరోగ్యంపై శాశ్వత ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.
» రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పులపై అవగాహన పెరగడం యువతలో నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితి భావాలకు దారితీస్తోంది.
పరిష్కారాలు..
» యువతలో సంతోషాలు నింపేందుకు వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని మెరుగుపర్చాలి. పాఠశాలల్లో ఫోన్ వాడకాన్ని నిషేధించాలి.
» మెంటల్ హెల్త్ సర్వీసెస్‌ను పెంచాలి.
» కౌమార దశ నుంచి వయోజనులుగా మారుతున్న క్రమంలో యువతకు సంబంధించి స్కూళ్ల విధానాలను నవీకరించడంతోపాటు డిజిటల్–సేఫ్టీ చర్యలు చేపట్టాలి.
» సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి, చుట్టూ ఉన్నవారితో ప్రత్యక్ష సంబంధాలను ప్రోత్సహించాలి.
» స్నేహితులతో అధిక సమయం గడపడం ద్వారా యువతలో ఆనందాన్ని మెరుగుపర్చవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.
- సాక్షి, హైదరాబాద్