
ఉపయోగించుకోవాలే గానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రభావంతవంతంగా ఉపయోగపడుతుందో తెలిపే ఉదాహరణ ఇది. అమెరికాలో ఓ మహిళ పర్సనల్ ఫైనాన్స్‌లో మార్గదర్శకత్వం కోసం ఏఐ సాధనం చాట్‌జీపీటీ ఆశ్రయించి 23,000 డాలర్లకు పైగా (సుమారు రూ . 19.69 లక్షలు) మేర ఉన్న తన క్రెడిట్ కార్డు బాకీలో సగానికి పైగా సులువుగా తీర్చేసింది.
డెలావేర్‌కు చెందిన 35 ఏళ్ల జెన్నిఫర్ అలెన్ తన ఆర్థిక నిర్వహణకు చాట్‌జీపీటీ ఎలా ఉపయోగపడిందో వివరించారు. రియల్టర్, కంటెంట్ క్రియేటర్ అయిన ఆమె న్యూస్‌వీక్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. తాను బాగా సంపాదించినప్పటికీ, ఆర్థిక నిర్వహణ విషయంలో చాలా కాలం కష్టపడ్డానని చెప్పారు. "నేను తగినంతగా సంపాదించకపోవడం వల్ల కాదు, ఆర్థిక అక్షరాస్యత పెంచుకోకపోవడమే దీనికి కారణం" అని ఆమె చెప్పారు.
కుమార్తె పుట్టిన తరువాత అలన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. వైద్య అత్యవసర పరిస్థితులు, పాప ఆలనాపాలన ఖర్చులు ఆమె ఎక్కువగా క్రెడిట్ కార్డులపై ఆధారపడటానికి కారణమయ్యాయి. "మేమేం విలాసవంతంగా జీవించలేదు. సాధారణ జీవనమే గడిపాం. కానీ చూడకుండానే అప్పులు పేరుకుపోయాయి' అని ఆమె వివరించారు.
పరిస్థితి నుంచి బయటపడేందుకు అలెన్ 30 రోజుల పర్సనల్ ఫైనాన్స్ ఛాలెంజ్ కోసం చాట్ జీపీటీని ఆశ్రయించింది. ప్రతిరోజూ ఆమె ఈ ఏఐ సాధనాన్ని ఉపయోగించి నిరుపయోగ సబ్‌స్క్రిప్షన్లను తొలగించడం, మరచిపోయిన ఖాతాలలో ఉపయోగించని నిధులను గుర్తించడం వంటి చేసేవారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూచనలు సరళమైనవే కానీ ప్రభావవంతమైనవి. ఈ క్రమంలో చాట్‌జీపీటీ ఆమెను ఓ పని చేయాలని సూచించింది. అదేంటంటే ఫైనాన్స్ యాప్‌లను, బ్యాంకు ఖాతాలను ఓసారి చెక్ చేసుకోవాలని చెప్పింది. చాలా కాలం ఉపయోగంలో లేని బ్రోకరేజీ ఖాతాతో సహా పలు అకౌంట్లలో అన్‌క్లెయిమ్ సొమ్ము 10,000 డాలర్లు (రూ .8.5 లక్షలు) బయటపడ్డాయి.
అలాగే ప్యాంట్రీ-ఓన్లీ అంటే వంట గదిలో ఉన్నవాటితోనే వండుకోవడం ప్రణాళికను అవలంభించింది. దీంతో ఆమె నెలవారీ కిరాణా బిల్లు దాదాపు రూ .50,000 తగ్గింది. అలా ఛాలెంజ్ ముగిసే సమయానికి అలెన్ మొత్తంగా 12,078.93 డాలర్లు (సుమారు రూ.10.3 లక్షలు) పొదుపు చేసి తన క్రెడిట్ కార్డు బాకీలో సగానికిపైగా తీర్చేసింది.