
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు రోజుల వ్యవధిలో ముగ్గురు కెప్టెన్లు మారారు. గత నెలలో జరిగిన డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో సౌతాఫ్రికాకు సారథ్యం వహించిన టెంబా బవుమా.. జింబాబ్వే పర్యటనకు విశ్రాంతి తీసుకోగా, కేశవ్ మహారాజ్‌ను తాత్కాలిక సారధిగా నియమించారు.
జింబాబ్వే పర్యటనలో తొలి టెస్ట్‌లో అదరగొట్టిన కేశవ్ మహారాజ్ దురదృష్టవశాత్తు గాయపడటంతో, రెండో టెస్ట్‌లో అతనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త కెప్టెన్‌ను నియమించారు. కెరీర్‌లో కేవలం 20 టెస్ట్ మ్యాచ్‌లే ఆడిన వియాన్ ముల్దర్‌ను దక్షిణాఫ్రికా నూతన సారధిగా ఎంపిక చేశారు.
జింబాబ్వేలో పర్యటిస్తున్న సౌతాఫ్రికా జట్టులో కేశవ్ మహారాజ్ తర్వాత ముల్దరే అత్యంత అనుభవజ్ఞుడు (కైల్ వెర్రిన్ (26) మినహా). మిగతా ఆటగాళ్లంతా 20కి మించి టెస్ట్‌లు ఆడలేదు. తొలి టెస్ట్‌తో ప్రిటోరియస్, బ్రెవిస్, కోడి యూసఫ్ అరంగేట్రం చేశారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకోవడంతో సౌతాఫ్రికా మేనేజ్‌మెంట్ జింబాబ్వే టూర్‌కు యువ జట్టును పంపింది. ఈ యువ జట్టుకు అత్యంత సీనియర్ అయిన కేశవ్ మహారాజ్‌ను కెప్టెన్‌గా నియమించింది.
అయితే అతను తొలి టెస్ట్ సందర్భంగా గజ్జల్లో గాయానికి గురయ్యాడు. రెండో టెస్ట్‌లో అతనికి ప్రత్నామ్నాయ ఆటగాడిగా సెనురన్ ముత్తుస్వామిని ఎంపిక చేశారు. జులై 6 నుంచి బులవాయోలో జరిగే రెండో టెస్ట్‌లో వియాన్ ముల్దర్ దక్షిణాఫ్రికా సారధిగా వ్యవహరిస్తాడు. దీంతో సౌతాఫ్రికా మూడు వరుస టెస్ట్ మ్యాచ్‌ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగినట్లవుతుంది.
కొత్త కెప్టెన్ ముల్దర్ జింబాబ్వేతో జరిగిన తొలి టెస్ట్‌లో అద్బుతంగా రాణించాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అతను తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి, ఆతర్వాత బ్యాటింగ్‌లో సెంచరీ (147) చేశాడు. తొలి టెస్ట్‌లో సారధిగా వ్యవహరించిన కేశవ్ మహారాజ్ కూడా ఆల్‌రౌండర్‌గా రాణించాడు. బ్యాటింగ్‌లో 21, 51 పరుగులు చేసి బౌలింగ్‌లో 3,1 వికెట్లు తీశాడు.
గాయంతో బాధపడుతున్న కేశవ్ మహారాజ్‌ను స్వదేశానికి పిలిపించిన సౌతాఫ్రికా యాజమాన్యం అతనితో పాటు సీనియర్ పేసర్ లుంగి ఎంగిడిని కూడా జట్టు నుంచి రిలీజ్ చేసింది. తొలి టెస్ట్‌లో అద్బుతంగా రాణించిన యువ పేసర్లకు మరో అవకాశం ఇవ్వడం కోసం ఎంగిడిని స్వదేశానికి పిలిపించారు. తొలి టెస్ట్‌లో పేసర్లు కోడి యూసఫ్, మఫాకా, బాష్, ముల్దర్ విశేషంగా రాణించారు. ఆ మ్యాచ్‌లో కేశవ్ మహారాజ్ ఏకైక స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు.
కాగా, జింబాబ్వేతో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కార్బిన్ బాష్ (100, 5/43), డ్రి ప్రిటోరియస్ (153), వియాన్ ముల్దర్ (4/50, 147), కేశవ్ మహారాజ్ (3/70, 51), కోడి యూసఫ్ (3/42, 3/22) అద్భుత ప్రదర్శనలు చేసి సౌతాఫ్రికాను గెలిపించారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా చివరి 9 మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టుగా అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో ఏ జట్టు ఈ ఘనత సాధించలేదు.