
కొలొంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో శ్రీలంక సారధి చరిత్ అసలంక సూపర్ సెంచరీతో మెరిశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఐదో స్థానంలో బరిలోకి దిగిన అసలంక.. 123 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేసి ఔటయ్యాడు. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో అసలంకకు ఇది రెండో సెంచరీ. ఓవరాల్‌గా అతని కెరీర్‌లో ఐదవది.
అసలంక చివరిగా ఆస్ట్రేలియాతో ఆడిన వన్డేల్లో వరుసగా 127, 78 నాటౌట్ పరుగులు చేశాడు. గత కొన్నేళ్లుగా అసలంక వన్డేల్లో అత్యంత నమ్మదగిన బ్యాటర్‌గా మారాడు. 2024లో 97.11 స్ట్రయిక్‌రేట్‌తో 50.41 సగటున పరుగులు చేసిన అసలంక.. ఈ ఏడాది ఏకంగా 68 సగటున, 96.03 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్నాడు. కెరీర్‌లో ఇప్పటివరకు 74 వన్డేలు ఆడిన అసలంక 44.98 సగటున 5 సెంచరీలు, 15 అర్ద సెంచరీల సాయంతో 2474 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అసలంక ఆదుకోవడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోర్ (49.2 ఓవర్లలో 244 పరుగులు) చేయగలిగింది. జట్టులో మిగతా బ్యాటర్లెవ్వరూ రాణించకపోగా అసలంక ఒక్కడే జట్టు భారం మొత్తాన్ని మోశాడు. కుసాల్ మెండిస్ (45), జనిత్ లియనాగే (29), మిలన్ రత్నాయకే (22), హసరంగ (22) రెండంకెల స్కోర్లు చేసి అసలంకకు సహకరించారు.
కొద్ది రోజుల కిందట బంగ్లాదేశ్‌తోనే జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారీ శతకం బాదిన పథుమ్ నిస్సంక ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. మరో స్టార్ బ్యాటర్ కమిందు మెండిస్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
ఓపెనర్ నిషాన్ మదుష్క 6, తీక్షణ 1, ఎషాన్ మలింగ 5, అశిత ఫెర్నాండో 1 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ అద్బుతంగా బౌలింగ్ చేశారు. వీరిలో తస్కిన్ 4 వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ 3 వికెట్లు తీశాడు. తన్వీర్ ఇస్లాం, షాంటో తలో వికెట్ దక్కించుకున్నారు.
3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి వన్డే ఇది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక 1-0 తేడాతో కైవసం చేసుకుంది. వన్డే సిరీస్ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది.