
బ్యాంకులకు డీఎఫ్‌ఎస్ కార్యదర్శి నాగరాజు సూచన
న్యూఢిల్లీ: కస్టమర్లకు ఒక పాలసీ గురించి చెప్పి మరో పాలసీని అంటగట్టే (మిస్–సెల్లింగ్) ధోరణులను నివారించడంపై బ్యాంకులు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) కార్యదర్శి ఎ నాగరాజు సూచించారు. ఇన్సూరెన్స్ అనేది చాలా సున్నితమైన ఆర్థిక సాధనమని, కస్టమర్లకు విక్రయించే ముందు, దాని గురించి క్షుణ్నంగా వివరించాలని పేర్కొన్నారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటలీకి చెందిన జనరాలి గ్రూప్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాగరాజు ఈ విషయాలు తెలిపారు. మిస్–సెల్లింగ్ వల్ల కస్టమర్లకు ప్రీమియంల భారం పెరిగిపోతుందని, ఫలితంగా పాలసీదారులు తమ పాలసీని మళ్లీ పురుద్ధరించుకోరని ఆయన పేర్కొన్నారు.
ప్రీమియంలు అధికంగా ఉన్నా కూడా బీమా కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడరు కాబట్టి ప్రీమియంలు సహేతుకంగా ఉండేలా కంపెనీలు చూసుకోవాలని నాగరాజు సూచించారు. కస్టమర్ల క్లెయిమ్‌లు సకాలంలో, సముచితంగా ప్రాసెస్ అయ్యేలా బీమా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు, ఫ్యూచర్ జనరాలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 24.91 శాతం, ఫ్యూచర్ జనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 25.18 శాతం వాటాల కొనుగోలు పూర్తి చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.