breaking news
Central Department of Finance
-
బీమా పథకాల మిస్–సెల్లింగ్ వద్దు..
న్యూఢిల్లీ: కస్టమర్లకు ఒక పాలసీ గురించి చెప్పి మరో పాలసీని అంటగట్టే (మిస్–సెల్లింగ్) ధోరణులను నివారించడంపై బ్యాంకులు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి ఎ నాగరాజు సూచించారు. ఇన్సూరెన్స్ అనేది చాలా సున్నితమైన ఆర్థిక సాధనమని, కస్టమర్లకు విక్రయించే ముందు, దాని గురించి క్షుణ్నంగా వివరించాలని పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటలీకి చెందిన జనరాలి గ్రూప్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాగరాజు ఈ విషయాలు తెలిపారు. మిస్–సెల్లింగ్ వల్ల కస్టమర్లకు ప్రీమియంల భారం పెరిగిపోతుందని, ఫలితంగా పాలసీదారులు తమ పాలసీని మళ్లీ పురుద్ధరించుకోరని ఆయన పేర్కొన్నారు. ప్రీమియంలు అధికంగా ఉన్నా కూడా బీమా కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడరు కాబట్టి ప్రీమియంలు సహేతుకంగా ఉండేలా కంపెనీలు చూసుకోవాలని నాగరాజు సూచించారు. కస్టమర్ల క్లెయిమ్‌లు సకాలంలో, సముచితంగా ప్రాసెస్ అయ్యేలా బీమా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు, ఫ్యూచర్ జనరాలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 24.91 శాతం, ఫ్యూచర్ జనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 25.18 శాతం వాటాల కొనుగోలు పూర్తి చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. -
ఐపీ ఫెసిలిటేటర్ల ఫీజులు పెంపు
న్యూఢిల్లీ: అంకుర సంస్థలకు పేటెంట్ దరఖాస్తులపరమైన సేవలు అందించే ఐపీ ఫెసిలిటేటర్ల ప్రొఫెషనల్ ఫీజులను కేంద్రం దాదాపు రెట్టింపు చేసింది. స్టార్టప్స్ మేథోహక్కుల పరిరక్షణ (ఎస్ఐపీపీ) పథకం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంకుర సంస్థలకు ఐపీ ఫెసిలిటేటర్లు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని వివరించింది. పేటెంట్లకు సంబంధించి .. దరఖాస్తును ఫైలింగ్ చేసేటప్పుడు ఫీజును రూ. 10,000 నుండి రూ. 15,000కు పెంచారు. అలాగే ట్రేడ్ మార్క్‌లు, డిజైన్ల విషయంలో రూ. 2,000 నుండి రూ. 3,000కు సవరించారు. స్టార్టప్‌ల మేథోహక్కులను పరిరక్షించేందుకు, నవకల్పనలు.. సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు కేంద్రం 2016లో ఎస్ఐపీపీని ప్రవేశపెట్టింది. ఐపీ ఫెసిలిటేటర్ల ద్వారా అంకుర సంస్థలు తమ పేటెంట్లు, డిజైన్లు లేదా ట్రేడ్‌మార్కుల దరఖాస్తులు సమర్పించేందుకు, ప్రాసెస్ చేయించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందుకు సంబంధించిన ఫీజులను ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్‌మార్క్స్ భరిస్తోంది. దీని కింద ఐపీల ఫైలింగ్స్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ స్కీమును కేంద్రం పొడిగించింది. ఐపీ ఫైలింగ్స్‌లో స్టార్టప్‌లకు తోడ్పడినందుకు గాను సెప్టెంబర్ 30 వరకూ ఫెసిలిటేటర్లకు రూ. 3.80 కోట్ల మేర ఫీజులు చెల్లించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. -
స్వచ్ఛ భారత్ సెస్సుపై త్వరలో నోటిఫికేషన్
న్యూఢిల్లీ: వివిధ సర్వీసులపై 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్సును విధించే అంశాన్ని తర్వాత నోటిఫై చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అయితే, జూన్ 1 నుంచి 14 శాతం సేవల పన్ను అమల్లోకి వస్తుందని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సెస్సు ద్వారా వసూలైన మొత్తాలను స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది. సర్వీస్ ట్యాక్స్‌ను 12 శాతం నుంచి 14 శాతానికి పెంచడంతో పాటు అన్ని లేదా కొన్ని ఎంపిక చేసిన సర్వీసులపై 2 శాతం స్వచ్ఛ భారత్ సెస్సు విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కొత్త సర్వీస్ ట్యాక్స్ రేటుతో రెస్టారెంట్లలో తినడం మొదలుకుని బీమా పాలసీలు .. ఫోన్ బిల్లులు, విమాన ప్రయాణాల దాకా చాలా మటుకు సేవలు మరింత భారంగా మారనున్నాయి.