అనిల్ అంబానీకి ఎస్‌బీఐ ‘ఫ్రాడ్‌’ ట్యాగ్‌.. ఒకప్పుడు బిలియనీర్.. ఇప్పుడు మోసగాడా? | SBI Tags Anil Ambani Reliance Communications Loan Account as Fraud | Sakshi
Sakshi News home page

అనిల్ అంబానీకి ఎస్‌బీఐ ‘ఫ్రాడ్‌’ ట్యాగ్‌.. ఒకప్పుడు బిలియనీర్.. ఇప్పుడు మోసగాడా?

Jul 2 2025 8:55 PM | Updated on Jul 2 2025 10:02 PM

SBI Tags Anil Ambani Reliance Communications Loan Account as Fraud

సాక్షి,ఢిల్లీ: అన్న ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించగా.. తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుని నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.  గతంలో వ్యాపార రంగంలో తన అద్భుతమైన తెలివితేటలు, సామర్ధ్యంతో  ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న అనిల్ అంబానీ ఇప్పుడు బ్యాంకుల్ని మోసం చేసిన మోసగాళ్ల జాబితాలో చేరినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి.

ప్రముఖ వ్యాపార వేత్త అనిల్‌ అంబానీకి ఎస్‌బీఐ షాకిచ్చింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) భారీ ఎత్తున రుణాలిచ్చింది. ఆ రుణాల్ని రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ (ఆర్‌కాం) నిబంధనలకు విరుద్ధంగా నిధుల్ని మళ్లించినట్లు గుర్తించింది. ఫలితంగా బ్యాంకుల్ని మోసం చేసిన సంస్థల జాబితాలో రిలయన్స్‌ కమ్యూనికేషన్‌తో పాటు ఆ సంస్థ మాజీ డైరెక్టర్‌ అనిల్‌ అంబానీ పేరును సైతం చేర్చింది. 

ఎస్‌బీఐ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ ఫైలింగ్‌ ప్రకారం.. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కి ఇచ్చిన రుణాల్లో నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటి అంశాలు కనిపించాయని పేర్కొంది. మొత్తం రూ.31,580 కోట్ల రుణాల్లో సుమారు రూ.13,667 కోట్లు ఇతర రుణాల చెల్లింపులకు, రూ.12,692 కోట్లు సంబంధిత సంస్థలకు మళ్లించారని తెలిపింది. 


ఈ నేపథ్యంలో, ఎస్‌బీఐ జూన్ 23న కంపెనీకి లేఖ రాసింది. సంస్థ ఖాతాల్ని ‘ఫ్రాడ్’గా గుర్తిస్తున్నట్లు సమాచారం అందించింది. అనిల్ అంబానీ పేరును కూడా చేర్చినట్లు ఆర్‌బీఐకి నివేదించింది. అయితే, అనిల్ అంబానీ తరఫు న్యాయవాదులు ఈ నిర్ణయంపై స్పందించారు. తాము సమర్పించిన వివరణలకు ఎస్‌బీఐ సరైన స్పందన ఇవ్వలేదని ఆరోపించారు. ఇదే విషయంలో అనిల్‌ అంబానీ సంస్థలకు రుణాలు ఇచ్చిన ఇతర బ్యాంకుల్ని సైతం ఎస్‌బీఐ సంప్రదించనుంది. ఇప్పటికే కెనరా బ్యాంక్ కూడా ఆర్‌కామ్‌ అకౌంట్లను ఫ్రాడ్‌గా గుర్తించింది.

కాగా, బ్యాంకులు ఏదైనా సంస్థకు రుణాలిచ్చి.. వాటిని చెల్లించే క్రమంలో లేదంటే ఇతర అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే వాటిని ఫ్రాడ్‌ జాబితాలో చేర్చుతాయి. ఆ జాబితాలో పేరుంటే  సదరు సంస్థలకు ‌5 సంవత్సరాల పాటు కొత్త రుణాలు ఇవ్వకూడదు. ఇది అన్ని బ్యాంకులకు వర్తించే నిబంధన. తాజాగా ఆర్‌కామ్‌ విషయంలో సైతం ఎస్‌బీఐ తీసుకున్న నిర్ణయం ఇతరు బ్యాంకులు తీసుకునేలా సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement