
నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాబినేషన్‌లో వడచైన్నె అనే చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత కూడా ధనుష్ కావడం విశేషం. కాగా దానికి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఇటీవల ఓ సినిమా వేడుకలో వడచైన్నె– 2 చిత్రం గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకు వచ్చే ఏడాది ఆ చిత్రం ఉంటుందని ధనుష్ బదులిచ్చారు. కాగా ప్రస్తుతం దర్శకుడు వెట్రిమారన్ ఉత్తర చైన్నె నేపధ్యంలో నటుడు శింబు కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనతో కూడిన ఒక వీడియోను ఇటీవల విడుదల చేశారు.
దీంతో నటుడు ధనుష్ నటించాల్సిన వడచైన్నె– 2లో శింబు నటిస్తున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అంతే కాకుండా వడచైన్నె– 2 చిత్ర కాపీ రైట్స్ కోసం నటుడు ధనుష్ రూ.20 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో దర్శకుడు వెట్రిమారన్ ఈ వ్యవహారంపై స్పందించాల్సిన పరిస్థితి. ఆయన వివరణ ఇస్తూ ప్రస్తుతం జరుగుతున్న చర్చ గురించి తానూ గమనిస్తున్నానని, అయితే శింబు హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం వడచైన్నె 2 కాదనీ, ఉత్తర చైన్నె నేపధ్యంలో సాగే మరో కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.

అయితే వడచైన్నె చిత్రంలోని పాత్రల ఛాయలుగానీ కొనసాగింపులు గానీ ఉంటే ఈ చిత్ర నిర్మాత (ధనుష్)తో తాము మాట్లాడుకుని అనుమతి పొందుతామని చెప్పారు. ఇకపోతే నటుడు ధనుష్ కాపీరైట్ రూ.20 కోట్లు అడిగారన్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. ఈ విషయమై ధనుష్‌తో చర్చించానని, ఆయన సార్ మీకు ఏది కరెక్టో అది చేయండి, తాము తమ సైడ్ నుంచి నో అబ్జెక్స్ పత్రం ఇస్తాం అని చెప్పారన్నారు. అంతే కానీ డబ్బు ఏమీ వద్దు అని ఆయన చెప్పారన్నారు. అలాంటిది ప్రస్తుతం జరుగుతున్న వదంతులు బాధిస్తున్నాయని దర్శకుడు వెట్రిమారన్ ఆవేదన వ్యక్తం చేశారు.