
మోనోజిత్‌పై మరో విద్యార్థిని ఆరోపణలు
కోల్‌కతా: లా కాలేజీ గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు మోనోజిత్ మిశ్రాపై మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతను తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మరో విద్యార్థిని వెల్లడించింది. ఓ వేడుక సందర్భంగా గదిలో బంధించి, వివస్త్రను చేసి లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ‘‘2023 అక్టోబర్‌లో కాలేజీ వేడుకలో ఓ పక్క విద్యార్థులు డ్యాన్స్ చేస్తుండగా మా నాన్న ఫోన్ చేశారు.
గోలగోలగా ఉండటంతో మాట్లాడటానికి పక్కనున్న ఖాళీ గదిలోకి వెళ్లాను. మాట్లాడి బయటికి రాబోతుండగా మోనోజిత్ లోపలికొచ్చి తలుపు లాక్ చేశాడు. మద్యం, గంజాయి తాగి ఉన్నాడు. నా మీదికొస్తుంటే నెట్టేశా. దాంతో తన జేబులోని రిమోట్‌తో వేదిక వద్ద మ్యూజిక్ సౌండు పెంచాడు. తర్వాత నా జుట్టు పట్టుకుని గదిలోని బాల్కనీలోకి ఈడ్చుకెళ్లాడు. నా బట్టలు విప్పడం ప్రారంభించాడు. వదిలెయ్యమని వేడుకున్నా. బిగ్గరగా అరిచా. అదృష్టవశాత్తూ ఒక సీనియర్ విద్యార్థి తలుపు తట్టడంతో మోనోజిత్ పారిపోయాడు’’ అని వెల్లడించింది.
ఇష్టపూర్వక లైంగిక కలయికే: లాయర్
గ్యాంగ్ రేప్ కేసులో మోనోజిత్‌తో పాటు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ కస్టడీని కోర్టు మరో ఎనిమిది రోజులు పొడిగించింది. వారి తర్వాత అరెస్టయిన నాలుగో నిందితుడు, కాలేజీ సెక్యూరిటీ గార్డు పినాకీ బెనర్జీ కస్టడీనీ జూలై 4 వరకు పొడిగించారు. మోనోజిత్ ఆరోగ్య పరీక్షల సమయంలో సమయంలో అతని శరీరంపై రక్కిన గీతలను పోలీసులు గుర్తించారు. లైంగిక దాడిని బాధితురాలు ప్రతిఘటించిందనేందుకు అవి నిదర్శమని పోలీసు వర్గాలు తెలిపాయి.
మోనోజిత్ కాల్ రికార్డులను సిట్ బృందం పరిశీలించింది. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నయనా చటర్జీతో అతనికి జరిగిన ఫోన్ సంభాషణల ఆధారాలను గుర్తించింది. కానీ మోనోజిత్ తరఫు లాయర్ రాజూ గంగూలీ మాత్రం బాధితురాలి ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ఆరోపించారు. ‘‘ఆమె ఇష్టపూర్వకంగానే అతనితో లైంగికంగా కలిసింది. మోనోజిత్ మెడపై ఆమె గోటి గుర్తులే దానికి నిదర్శనం. ఈ విషయాన్ని ప్రాసిక్యూషన్ కావాలనే దాస్తోంది’’ అని ఆక్షేపించారు.