
ఒక శాస్త్రవేత్త వ్యాపారవేత్తగా మారి దృఢ చిత్తంతో కృషి చేసి గ్రామీణ రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచటం ఎంత వరకూ సాధ్యమనే ప్రశ్నకు కామినీ సింగ్ అనుభవాలే చక్కని జవాబు. సేంద్రియ మునగ సాగు ప్రాధాన్యతను గుర్తింపజేయటం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని వెయ్యికి పైగా రైతులను కార్యోన్ముఖులను చేసిన ఆమె ఏకంగా రూ. 1.75 కోట్ల మేరకు వారికి ఆర్థిక ప్రయోజనం కలిగించగలిగారు. ఈ క్రమంలో కామినీ సింగ్ కేంద్రీయ ఉప ఉష్ణమండల ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (సిఐఎస్‌హెచ్), సిఎస్‌ఐఆర్– కేంద్రీయ ఔషధ, సుగంధ మొక్కల పరిశోధనా సంస్థ (సీమాప్) వంటి సంస్థల తోడ్పాటు తీసుకున్నారు.
ఆమె ఉద్యాన పంటల సాగులో ఏళ్ల తరబడి అనుభవం ఉన్న శాస్త్రవేత్త. సేంద్రియ వ్యవసాయంలో కూడా ఆమెకు గాఢమైన ప్రవేశం ఉంది. తన పరిశోధనా ఫలితాలను చూపుతూ వ్యవసాయంపై మనకున్న సాధారణ అభిప్రాయాన్ని సైతం మార్చేయగల సత్తా గల కార్యశీలి ఆమె. పిహెచ్‌డి విద్యార్థిగా ఆమె గుర్తించిన విషయం ఏమిటంటే.. పరిశోధనా ఫలితాలు గ్రామీణ స్థాయిలోని సాధారణ రైతులకు అతి తక్కువగా/అరుదుగా చేరుతున్నాయని. అంతే. 17 ఏళ్లుగా పరిశోధన శాలల్లో పరిశోధనలకే పరిమితమైన ఆమె లాబ్‌లను వదిలి పొలాల్లోకి దారితీశారు. పరిశోధనకు వాస్తవికతకు మధ్య వారధిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆ విధంగా 2016–17లో కామినీ సింగ్ ఉత్తరప్రదేశ్ రైతులకు సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. నేల రసాయనిక ఎరువులపై ఆధారపడకుండా సేంద్రియ వ్యవసాయంలో తిరిగి జీవాన్ని సంతరించుకోవటానికి 2–3 ఏళ్లు సమయం పడుతుంది అంటారామె. అయితే, సేంద్రియ సేద్యం అనగానే ఆకర్షితులైన రైతుల్లో కూడా చాలా మంది నిజాయితీగా సేంద్రియ పద్ధతులను పాటించకపోవటం, ఫలితాలు నాసిగా రావటం ఆమె గుర్తించారు. సేంద్రియ సేద్యం వైపు రైతులను నడిపించాలన్న ఆమె సంకల్పం మాత్రం సడలలేదు.
అయితే, తక్కువ ఉత్పాదకాల ఖర్చుతో అధిక దిగుబడులు ఇచ్చే పంటను గనక చెబితే రైతులుమరింత ఉత్సాహంగా ముందుకు వచ్చి చెయ్యగలుగుతారని భావించి మునగ వైపు దృష్టి సారించారు. పోషకాల గని కావటం, అనాదిగా మనకు తెలిసిన పంట కావటం, ఎరువులేవీ పెద్దగా వేయక΄ోయినా మంచి దిగుబడులిచ్చే పంట కావటంతో సేంద్రియ సేద్యానికి ఇది అనువైన పంటగా గుర్తించానంటారామె. దీంతో, శాస్త్రవేత్తగా ఉండటం కన్నా రైతులకు కూడా ఉపయోగపడే వ్యాపారవేత్తగా మారటం మేలని ఆమె నిర్ణయాన్నికొచ్చారు.
గట్లపైనే శ్రీకారం
2017లో లక్నోలో ఏడెకరాల భూమిలో ఆమె స్వయంగా సేంద్రియ మునగ సాగు ప్రారంభించారు. ఫలితాలు అనుకున్నదాని కన్నా బాగా వచ్చాయి. తక్కువ నీరు ఇచ్చినా స్థానిక వాతావరణానికి మునగ మంచి దిగుబడి వచ్చింది. ఈ విజయంతో ఒక వినూత్న ఉపాయాన్ని ఆమె అమల్లోకి తెచ్చారు. రైతులు తమ పొలాల్లో ఏ పంటైనా పండించండి.
అయితే, గట్లపై మాత్రం మునగ మొక్కలు వెయ్యాలని సూచించారు. దీంతో చాలా మంది రైతులు ముందుకొచ్చారు. ప్రధాన పంటకు ఇబ్బంది లేకుండా చేసిన ఈ పని వల్ల ఏడాదికి రూ. 30 వేల వరకు ఆదాయం రావటంతో రైతులు సంతోషించి, మునగ సాగు చేపట్టారు. ‘నా పొలం చుట్టూతా గట్లపై 400 మునగ మొక్కలు మొదట నాటా. ఆదాయం బాగుంది. అందుకని ఇప్పుడు పది ఎకరాల్లో మునగ పంటను సాగు చేస్తున్నా’ అన్నారు
లక్నో ప్రాంతానికి చెందిన రైతు షాలిక్రమ్ యాదవ్. మొదట్లో నాకు చాలా భయాలుండేవి. అయితే, కామినీ సింగ్ ప్రోత్సాహంతో ముందుకు నడిచా. ఏ రైతుకైనా పండించిన పంటను అమ్ముకోవటమే పెద్ద సమస్య. తానే స్వయంగా మునగ ఆకులను కిలో రూ. 60కి కొంటుండటంతో నాకు మార్కెటింగ్ సమస్య లేకుండా ΄ోయింది. ఈ సీజన్‌లో వాతావరణం అనుకూలించలేదు. 5 క్వింటాళ్ల మునగాకు పండించా. అయినా నాకు నష్టం లేదు. సేంద్రియ మునగ సాగు ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది అన్నారాయన.
ఆమె కృషి ఫలించటం ప్రారంభించింది. మునగాకును రైతుల నుంచి కొని అనేక ఉత్పత్తులుగా మార్చి విక్రయించటం ఆమె ప్రారంభించారు. నెమ్మదిగా సేంద్రియ మునగాకు సాగు చేసే రైతుల సంఖ్య పెరిగింది. చిన్న బృందం కాస్తా పెద్ద నెట్‌వర్క్‌గా మారింది. రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వెయ్యి ఏభై మంది రైతులు చేరారు. వారంతా మునగ సాగు చేయటం మాత్రమే కాదు, స్థిరమైన ఆదాయాన్ని, ఆరోగ్యాన్నిచ్చే పంటను స్థిమితంగా సాగు చేయటం నేర్చుకున్నారు.
డాక్టర్ మోరింగ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రూ. 9 లక్షల పెట్టుబడితో ఆమె స్థాపించిన కంపెనీ మునగ ఆకులతో 22 రకాల ఉత్పత్తులను తయారు చేసి అమ్ముతోంది. సబ్బులు, గ్రీన్ టీ, బిస్కెట్లు, పొడితో గొట్టాలు, నూనెలు, ముఖ సౌందర్యం కోసం రాసుకునే పొడులు.. వంటివెన్నిటినో తయారు చేస్తున్నారు. ఎఫ్‌పివో తరఫున అనేక చోట్ల విక్రయాలు ప్రారంభించటంతో ఆదాయం పెరిగింది. రూ. 9 లక్షల రుణంతో ప్రారంభించిన కంపెనీ వార్షిక టర్నోవర్ ఇప్పుడు రూ. కోటి 75 లక్షలకు చేరింది. ఖర్చులు పోగా 30% నికరాదాయం వస్తోంది.
డాక్జర్ కామిని శాస్త్రీయ దృష్టికి రైతులను చైతన్యవంతులను చేసి ఆర్థికంగా తోడ్పాటునందించాలన్న సంకల్పం తోడు కావటంతో విజయం చేకూరింది. మొలక శాతం, చీడపీడల నియంత్రణ, నాణ్యత, పంటకు రక్షణ వంటి అంశాలన్నిటినీ ఆమె సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారు. తన క్షేత్రంలో ఆమె అనుసరించే సేంద్రియ పద్ధతులను చూసి రైతులు సులువుగా నేర్చుకొని అనుసరిస్తున్నారు. మంచి ఆదాయం ఉండటంతో, ఇతర పంటలు పండించే రైతులు సైతం సేంద్రియ మునగ సాగు వైపు ఆకర్షితులవుతున్నారు. కుమార్ సింగ్ అనే రైతు మలిహాబాద్΄ ప్రాంతంలో మామిడి సాగుకు ప్రసిద్ధి పొందారు. ఆయన కూడా 17 ఎకరాల్లో మునగాకు సాగు ప్రారంభించారు. మొదట్లో ఒక ఎకరం మునగ వేశా.
శాస్త్రవేత్తే స్వయంగా సలహాలు ఇస్తూ ఉండటం, మంచి ఆదాయం వస్తుండడంతో 17 ఎకరాలకు విస్తరించా అన్నారు అనిల్ కుమార్ సింగ్. గతంలో వరి, గోధుమ సాగు చేస్తే నాకు రూ. 40 వేలు వచ్చేవి. ఇప్పుడు అదే బూమిలో మునగ ఆకు, కాయల సాగుతో రూ. 1.5 లక్షల ఆదాయం వస్తోంది. పెట్టిన పెట్టుబడి రూ. 30 వేలు తొలి ఏడాదే వచ్చేసింది. ఇది చూసి మిగతా రైతులు కూడా మునగ సాగులోకి వస్తున్నారు అని ఆయన వివరించారు.
‘సాధారణ పంటలు పండిస్తే ఎకరానికి రూ. పాతిక వేలు సంశయించే రైతులు మునగ సాగు చేసి, విలువ జోడించి అమ్మటం వల్ల రూ. లక్ష వరకు సంశయిస్తున్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కొత్త విధంగా పంటలు పండించటం నేర్చుకుంటే ఇంత ప్రయోజనం ఉంటుంది అంటున్నారు డాక్టర్ కామినీ సింగ్.
ఆమె శాస్త్రవేత్తగా కెరియర్‌ను వదిలేసి వ్యాపారవేత్తగా మారాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అయితే, ఆమె కృషి ఫలించి, ఆమె స్థాపించిన కంపెనీ చక్కటి ఫలితాలనిస్తూ రైతులకు కూడా మంచి లాభాలు వస్తుండటం, మునగ సాగు 15 గ్రామాలకు విస్తరించటంతో ఆమె కుటుంబం ఇప్పుడు సంతోషిస్తున్నారు. కేవలం ఒక శాస్త్రవేత్తగా మాటలు చెప్పేలానే ఉండి΄ోకుండా, ధైర్యంగా ముందడుగు వేసి, రైతులకు మార్గదర్శకురాలిగా మారిన ఆమె కృషి నిజంగా ప్రశంసించదగినది.
(చదవండి: బ్యాంకు ఉద్యోగం వదిలేసి, ఆధునిక సేద్యం : కోట్లలో ఆదాయం)