పొట్టి ఆవులు గట్టి మేలు! | Sagubadi: Animal husbandry for short cows includes breeds, Sakshi Special Story | Sakshi
Sakshi News home page

పొట్టి ఆవులు గట్టి మేలు!

Nov 11 2025 3:55 AM | Updated on Nov 11 2025 3:55 AM

Sagubadi: Animal husbandry for short cows includes breeds, Sakshi Special Story

నగర పరిసరాల్లో చిన్న, సన్నకారు రైతులకు దేశీ పొట్టి ఆవుల పెంపకంతో ప్రయోజనాలెన్నో

దేశీ పొట్టి గోజాతులపై మరింత లోతైన పరిశోధనలతో మరింత ప్రయోజనం ఉంటుందంటున్న నిపుణులు

ఆరోగ్యదాయకమైన ఏ2 పాల ఉత్పత్తులకు, సంప్రదాయ మిఠాయిలకు నగర వినియోగదారుల్లో పెరుగుతున్న ఆదరణ

మన వ్యవసాయంలో కీలకమైనది పశువుల పెంపకం. అనాది కాలం నుంచి సామాజిక–ఆర్థిక చట్రంలో ఇది అంతర్భాగం. దేశీ ఆవుల్లో విశిష్టమైనవి పొట్టి ఆవులు. వేచూర్, కాసరగోడ్‌ డ్వార్ఫ్, పుంగనూర్, నదిపతి, మల్నాడ్‌ గిడ్డ వంటి మినియేచర్‌ ఆవులకు తక్కువ మేతే సరిపోతుంది. పోషకాలతో పాటు ఔషధ విలువలు కలిగిన పాలను ఇస్తాయి. 

ప్రతికూల వాతావరణాల్లో చక్కటి ఫలితాలనిచ్చే సామర్థ్యం వీటి సొంతం. సంకరజాతులు, విదేశీ గోజాతులతో పోల్చినప్పుడు పొట్టి ఆవుల పాలకు మెరుగైన జీర్ణశక్తి, వ్యాధి నిరోధకత ఉన్నాయని చెబుతారు. ఈ సుగుణాల కారణంగా నగర పరిసర ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు పాడి రైతులకు ఇవి ఎంతో అనువైనవి. స్థానికులకు ఆహార భద్రత, ఉపాధి, ఆదాయాన్నిచ్చే భారతీయ పొట్టి గోజాతులపై లోతైన పరిశీలన..

ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిదారైన మన దేశంలో ఏటా 23 కోట్ల టన్నులకు పైగా పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే, మన దేశంలో పాడి పరిశ్రమ అనేక సవా­ళ్లను ఎదుర్కొంటోంది. దాణా ధర పెరుగుదల.. పశుగ్రాసం కొరత.. పాడి పశువుల ఆరోగ్యం, సంతానోత్పత్తి, ఉత్పాదకతలపై వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం.. పెద్ద విస్తీర్ణంలో భూమి అవసరం కావటం.. ప్రత్యేక సుగుణాలున్న పాల ఉత్పత్తులపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతుండటం.. ఈ సవాళ్లలో ముఖ్యమైనవి. సంకరజాతి, విదేశీ జాతుల ఆవులు అధిక దిగుబడినిచ్చేవి అయినప్పటికీ, చిన్న రైతులు వాటిని అరకొర వనరులతో పెంచేటప్పుడు ఎక్కువగా వేడి ఒత్తిడికి, రుగ్మతలకు గురవుతుంటాయి. 

అయితే, దేశీ పొట్టి ఆవుల పెంపకంతో ఈ సవాళ్లన్నిటినీ చిన్న రైతులు అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు అనుగుణమైన ఆరోగ్యకరమైన, స్థానిక దేశీ పాడి ఉత్పత్తులను ఇష్టపడే రైతులు, వినియోగదారులకు దేశీ పొట్టి ఆవులు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. చిన్న డెయిరీ రైతులకు పొట్టి దేశీ ఆవుల పెంపకం అనేక విధాలుగా ఉపయోగకరమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

పుంగనూరు: పొట్టి గో జాతుల్లో ప్రత్యేకమైనది పుంగనూరు. ఈ ఆవుల ఎత్తు 70–90 సెంటీమీటర్లు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని కరువు పీడిత చిత్తూరు జిల్లాకు బాగా అనుకూలంగా ఉంటాయి. పాలలో అసాధారణంగా అధిక కొవ్వు (8%) ఉంటుంది. రోజుకు 3–5 లీటర్ల దిగుబడినిస్తాయి. మెరుగైన నాణ్యతతో కూడిన నెయ్యి, కోవా తయారీకి ఈ పాలు ఉపయోగిస్తాయని జాతీయ పశు వనరుల బోర్డు తెలిపింది. అంతరించే ముప్పును ఎదుర్కొంటున్న ఈ జాతి ఆవులు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అయితే, పరిరక్షణకు కృషి జరుగుతోంది. 

నదిపతి నానో : ఆంధ్రప్రదేశ్‌ గోశాలల్లో కనిపించే నదిపతి నానో ఆవు ఎత్తు 60సెం.మీ.లోపే! రోజుకు అర లీ. నుంచి ఒకలీటరు పాల దిగుబడి. కొవ్వు 4–5%. ప్రొటీన్‌ ఎక్కువ. 

దేశీ పొట్టి ఆవులతో ఉపయోగాలేంటి?
→ భారతీయ దేశీ ఆవుల పాలలో ఏ2 బీ కెసీన్‌ ఉంటుంది. అందువల్ల, పాలు మెరుగ్గా జీర్ణం కావాలని, కడుపులో అసౌకర్యం ఉండదని ఆశించే వినియోగదారులకు ఈ పాలు నచ్చుతాయి. ఈ గుణం మార్కెటింగ్‌లో ఉపయోగకరం. 

→ ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలించే గుణం హోల్‌స్టీన్‌–ఫ్రీసియన్‌ సంకరజాతి ఆవు పాలలో కన్నా వేచూర్, కాసర్‌గోడ్‌ డ్వార్ఫ్‌ వంటి పొట్టి ఆవు పాలలో ఎక్కువని పరిశోధనల్లో తేలింది. బయోయాక్టివ్‌ పెపై్టడ్లు, యాంటీఆక్సిడెంట్‌ విటమిన్లు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ఔషధ గుణాలున్న పాల ఉత్పత్తులను కోరుకునే మార్కెట్లలో విక్రయానికి ఈ గుణం ఉపయోగకరం. 

→ వెచూర్, కాసర్‌గోడ్‌ డ్వార్ఫ్‌ ఆవుల పాలల్లో ఈ–కోలి, సాల్మొనెల్లా వంటి క్రిములను అరికట్టే గుణాలు ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. పెరుగు ఉత్పత్తికి, ప్రోబయోటిక్‌ రిచ్‌ దేశీ పాల ఉత్పత్తుల తయారీకి ఈ గుణం ఉపయోగపడుతుంది. 

→ పొట్టి ఆవుల బరువు తక్కువ కావటం వల్ల అధిక ఉష్ణోగ్రతను మెరుగ్గా తట్టుకోగలుగుతున్నాయి. 

→ తక్కువ నాణ్యమైన గడ్డిని తిని మెరుగ్గా జీర్ణం చేసుకోగల శక్తి కాసర్‌గోడ్‌ పొట్టి ఆవులకు ఉందని పరిశోధనల్లో తేలింది. కరువు పీడిత పేద రైతులు కూడా దేశీ ఆవులను పెంచుకోగలగటానికి ఇదే కారణం. 

→ సంకరజాతి ఆవులతో పోల్చినప్పుడు దేశీ ఆవులు చిన్న రైతులకు అనువైనవి. తక్కువ మేత అవసరం, ఎక్కువ రోగనిరోధకశక్తి, తక్కువ వైద్య ఖర్చుల వల్ల అధిక లాభం వస్తుంది. 

→ ఏ2 నెయ్యి, ప్రొబయోటిక్‌ యోగర్ట్, సంప్రదాయ మిఠాయిలు వంటి ఔషధ గుణాలున్న సాంప్రదాయ ఆహారోత్పత్తులకు నగర ప్రాంతాల్లో గిరాకీ ఎక్కువగా ఉందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధ్యయనంలో తేలింది. అత్యధికంగా 8% కొవ్వు గల పుంగనూరు ఆవు పాలు, యాంటీఆక్సిడెంట్లుండే వెచూర్, కాసర్‌గోడ్‌ డ్వార్ఫ్‌ గోజాతుల పాలకు వాణిజ్యపరమైన విలువ ఉంది. 

→ వాతావరణంలో వేడి, మేత కొరత వంటి ప్రధాన సమస్యలను అధిగమించడానికి దోహదపడే గొప్ప సంపదగా దేశీ పొట్టి గోజాతులు. పర్యావరణ అనుకూల / సేంద్రియ పాడి పరిశ్రమ అభివృద్ధికి ఈ గోజాతులు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ దిశగా ప్రభుత్వం వాల్యూచెయిన్‌ పైలట్‌ ప్రాజెక్టుల ద్వారా అధ్యయనాలు చేపట్టాల్సి ఉంది. 

→ అయితే, పరిశోధనలు మరింత లోతుగా జరగాల్సి ఉంది. దేశీ గోజాతులు, పొట్టి ఆవులు వివిధ రకాల మేపులతో సాధించే పాల దిగుబడిపై విస్తృత అధ్యయనాలు జరగాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎవరేమి చెయ్యాలి?
→ చిన్న రైతులు తమకున్న పరిమిత భూకమతాలు, పరిమిత వనరుల దృష్ట్యా దేశీ పొట్టి ఆవులను పెంచుకోవటం మేలు. ఇవి తక్కువ పాలు ఇచ్చినప్పటికీ అధిక ఆదాయాన్ని ఇవ్వగలుగుతాయని గుర్తించాలి. 

→ సహకార సంఘాలు వారసత్వ సంపదైన దేశీ పొట్టి ఆవుల పాలు, నెయ్యిని గ్రామాల్లో సేకరించి, బ్రాండింగ్‌ వ్యూహాలతో విక్రయాలు పెంచాలి. 

→ పాలకులు దేశీ పొట్టి గోజాతుల జన్యు అభివృద్ధికి, మార్కెటింగ్‌ సదుపాయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. జాతుల పరిరక్షణకు, లాభదాయకతకు దోహదమవుతుంది. 

→ పరిశోధకులు ప్రతి దేశీ పొట్టి గోజాతులకు సంబంధించి ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన ఆహారోత్పత్తుల అభివృద్ధి, వాటి ద్వారా చేకూరే ఆరోగ్య ప్రయోజనాలపై పరిశోధనలు చెయ్యాలి. 

→ ఈ చర్యల ద్వారా దేశీ పొట్టి గోజాతుల పరిరక్షణతో పాటు పర్యావరణహితమైన, ఆరోగ్యదాయకమైన రీతి­లో పాడి పరిశ్రమకు సరికొత్త భాష్యం చెప్పినట్లు అవుతుంది. ఆదాయం,ఆరోగ్యంతోపాటు భారతీయ సంప్రదాయ పశు సంపదకు ఇది గౌరవాన్ని కూ­డా పెంచుతుందని కేరళ వెటర్నరీ యానిమల్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ పరిశోధకురాలు దీప్తి అంటున్నారు.

కాసరగోడ్‌ డ్వార్ఫ్‌: 
ఇది 96–107 సెం.మీ. ఎత్తుండే కేరళ గోజాతి. కోస్తా వాతావరణానికి అనువైనది. అణకువగా ఉంటుంది. పాల దిగుబడి రోజుకు 1.2–1.5 లీటర్లు. ప్రొటీన్‌ 3.8%. కొవ్వు 4–4.5%. వేచూర్‌ పాలలో కన్నా ఈ పాలలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని నిరూపితమైంది.

వేచూర్‌: కేరళ దేశీ పశుజాతుల సుసంపన్న వారసత్వానికి వేచూర్‌ నిదర్శనం. ప్రపంచంలోనే అతి చిన్న పశు జాతుల్లో ఒకటిగా (87–90 సెం.మీ. ఎత్తు) ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) గుర్తించింది. వేచూర్‌ జాతి పొట్టి ఆవులకు అధిక వేడిని తట్టుకునే శక్తి ఉంది. పాల దిగుబడి రోజుకు 2–3 లీటర్లు. పాలలో 4.5–5.5% కొవ్వుతో పాటు ఘనపదార్థాలు ఎక్కువ. నెయ్యి, ప్రోబయోటిక్‌ పెరుగు, సాంప్రదాయ మిఠాయిలు వంటి ప్రీమియం ఉత్పత్తుల తయారీకి ఈ పాలు అనువైనవి. ఈ–కోలి, సాల్మొనెల్లా వంటి క్రిములను నియంత్రించే యాంటీ బాక్టీరియల్‌ శక్తి కూడా ఈ పాలలో ఉందని నిరూపితమైంది.

మల్నాడ్‌ గిడ్డ: 
కర్ణాటకకు చెందిన మల్నాడ్‌ గిడ్డ ఆవు 90 సెం.మీ. ఎత్తుంటుంది. కొండ కోనల్లో తిరిగి రకరకాల గడ్డి మేయటం దీనికి ఇష్టం. ఫ్రీ రేంజ్‌ ఆవు పాలలో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు, బయోయాక్టివ్‌ మెటబొలైట్లు ఎక్కువ. పరాన్నజీవులు, గాలి కుంటు వ్యాధికి నిరోధకత కలిగి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement