
బుమ్రాకు విశ్రాంతి
కుల్దీప్‌కు దక్కని చోటు
ప్రపంచంలో బెస్ట్ బౌలర్ మీ జట్టులో ఉన్నాడు... అప్పుడప్పుడు ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నా రెండు టెస్టుల మధ్య ఏడు రోజుల విరామం వచ్చింది. గత మ్యాచ్‌లో ఒక వేళ ఏమైనా ఇబ్బంది కలిగినా...ఫిట్‌నెస్ ట్రైనర్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో ఉన్నప్పుడు కోలుకునేందుకు ఏడు రోజుల సమయం కూడా సరిపోతుంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడి జట్టు వెనుకంజలో ఉంది. ప్రత్యర్థిపై పైచేయి సాధించి సింగిల్ హ్యాండ్‌తో గెలిపించగల సత్తా అతనికి ఉంది.
అయినా సరే... భారత జట్టు జస్‌ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడించలేదు. పైగా తర్వాతి టెస్టులో పిచ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆడతాడని కెప్టెన్ గిల్ వ్యాఖ్యానించడం క్షమించరానిది! అతని స్థానంలో ఆకాశ్‌దీప్‌కు అవకాశం లభించింది. మరో వైపు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మళ్లీ అన్యాయం జరిగింది. రెండో స్పిన్నర్‌గా అతనికి ఈ మ్యాచ్‌లోనూ అవకాశం లభించలేదు. అటాకింగ్ బౌలర్ అయిన కుల్దీప్ గత టెస్టులో లేకపోవడం లోటుగా కనిపించింది.
ఈ సారి ఇంగ్లండ్‌పై చెలరేగే అవకాశం ఉందని భావించగా ఈ సారి స్థానమే దక్కలేదు. పైగా గత మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్ విఫలమైంది కాబట్టి బ్యాటింగ్ చేయగల బౌలర్ కావాలంటూ సుదర్శన్ స్థానంలో సుందర్‌ను తీసుకున్నారు. ఒక రెగ్యులర్ బౌలర్‌ను అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి ఎంపిక చేయడం ఏమిటో అర్థం కాలేదు! శార్దుల్ ఠాకూర్‌కు బదులుగా అదే తరహా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఆంధ్రకు చెందిన నితీశ్ కుమార్ రెడ్డికి చాన్స్ ఇచ్చినా అతనూ విఫలమయ్యాడు.
‘బుమ్రాను తప్పించడం నమ్మశక్యంగా లేదు. అతని పని భారం తగ్గించాలని చూస్తే ఇప్పటికే తగినంత విశ్రాంతి లభించింది. ఎంతో కీలకమైన మ్యాచ్‌కు అతను లేకపోవడం ఆశ్చర్యకరం. ఆటగాడు తన ఇష్ట్రపకారం మ్యాచ్‌ను ఎంచుకునే అవకాశం ఇవ్వరాదు. ఇక్కడ టెస్టు గెలిచి 1–1తో సిరీస్‌ను సమం చేస్తే ఆ తర్వాత విశ్రాంతి ఇచ్చుకోవచ్చు’ అని రవిశాస్త్రి దీనిపై తీవ్రంగా వ్యాఖ్యానించాడు. ఇలా బ్యాటింగ్ బలమే కావాలంటే సిరీస్ చివరకు వచ్చే సరికి బుమ్రా, మరో పది మంది బ్యాటర్లే బరిలోకి దిగుతారేమో!