
సాక్షి, సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచి కంపెనీ ప్రమాదంపై పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలను వెల్లడించారు. మిషనరీ పాతది కావడం, కనీస ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపింది.
సిగాచి కంపెనీ ఉద్యోగి యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదుపై భానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై పోలీసుల ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. సిగాచి కంపెనీలో పాత బడిన మిషనరీ ఉంది. దీనిపై కంపెనీ ఉద్యోగులు ఇప్పటికే చాలా సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా అదే పాత బడిన మిషనరీ వాడటంతో ప్రమాదం జరిగింది. ఉద్యోగుల మరణాలకు కంపెనీయే కారణం.
సోమవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో కంపెనీలో 145 మంది పనిచేస్తున్నారు. పేలుడు ధాటికి కొంత మంది అక్కడికక్కడే చనిపోయారు. చాలా మంది మంటల్లో కాలిపోతూ కనిపించారు. సిగాచి కంపెనీలో కనీస సదుపాయాలు లేవు. మంటలను ఆర్పేందుకు కనీసం ఫైర్ సిలిండర్స్ కూడా లేవు. ఇక, సిగాచి కంపెనీలో కనీస ప్రమాణాలు పట్టించుకోలేదని అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉండగా.. పాశమైలారంలోని పరిశ్రమలో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం పరిశీలించారు. మంత్రితో పాటు ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, సీనియర్ నేత జగ్గారెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో ఇప్పటివరకు 36 మంది మరణించారని.. ఇంకా 11 మంది కార్మికుల ఆచూకీ దొరకడం లేదని తెలిపారు. ఆచూకీ గల్లంతైనవారు బతికే అవకాశాలు తక్కువని పేర్కొన్నారు. 18 మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. బాధితుల బంధువులను పరామర్శించి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు.