
తమిళనాడు రాష్ట్రం, కరూర్‌కి చెందిన ఒక బ్యాంకు ఉద్యోగి వేంకటేశ్వర స్వామి దర్శనార్థం కారులో తిరుమల బయలుదేరాడు.ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చేసరికి కొంచెం సేద తీర్చుకోవాలనుకున్నాడు. ఓ ఆంజనేయస్వామి గుడి వద్ద కారు ఆపాడు.ఆ పక్కనే ఓ భార్యాభర్తల జంట కొబ్బరికాయల కొట్టు పెట్టుకుని ఉన్నారు. భార్య అంగడిలో కూర్చుని ఉంది. భర్త అంగడి ముందర ఉన్న పూల మొక్కలకు నీళ్ళుపోస్తూ ఉన్నాడు. అతడి దగ్గరికి వెళ్ళాడు బ్యాంకు ఉద్యోగి. ఇక్కడ స్వామికి తమల΄ాకులతో పూజ చేస్తారా?’’ అని ప్రశ్నించాడు. ‘‘అవును’’ అని బదులిచ్చాడు వ్యాపారి.
‘‘నేనెప్పుడూ చూడలేదు. దీని విశేషం ఏమిటి?’’ అని ఆసక్తిగా అడిగాడు బ్యాంకు ఉద్యోగి. ‘‘నేను పెద్దగా చదువుకున్న వాణ్ని కాదు. పెద్దలెవరైనా రామాయణం, మహా భారతం లాంటివి చెబుతూ ఉంటే కనీసం వినను కూడా వినలేదు. అయితే మా ఊరిలో ఈ ఆకు పూజ గురించి చెప్పుకునే కథ గురించి మాత్రం మీకు చెప్పగలను’’ అన్నాడు.
‘‘నువ్వు విన్నదే చెప్పు. నాకెందుకో కుతూహలంగా ఉంది’’ అన్నాడు బ్యాంకు ఉద్యోగి.భక్తి భావంతో ఆ వ్యా΄ారి తను వేసుకున్న చెప్పులు తీసివేశాడు. తలకి చుట్టిన తువ్వాలును తీసి భుజాన వేసుకున్నాడు. చక్కగా నిలబడి ఆంజనేయ స్వామిని మనసులోనే ప్రార్థించి ఇలా చెప్పసాగాడు.
‘‘అది లంకానగరంలో అశోక వనం. ఎక్కడ చూసినా కురూపులైన రాక్షస స్త్రీలు. వారి మధ్యలో సీతమ్మ.ఆమె ముఖం కళ తప్పి ఉంది. పది తలల రాక్షసుడు పెట్టే బాధలు సహించలేకపోతోంది. సరిగ్గా ఆ సమయంలో పిల్ల గాలి వీచింది. చెట్టు మీది పక్షుల రెక్కలు రెపరెపలాడాయి. ‘ఏమిటా’ అని సీతమ్మ చుట్టూ కలయచూసింది. ఎదురుగా ఒక కాంతి పుంజం. కళ్ళు వెడల్పు చేసి చూస్తే ఎదురుగా వినయ విధేయతలతో చేతులు జోడించిన ఆకారం. అది మానవాకారం కాదు, వానరాకారం. సీతమ్మ జడుసుకుంది. ‘ఇది రావణ మాయ ఏమో...’ అని అనుమానపడింది.
అయితే ఆ వానరాకారం గౌరవంగా ‘అమ్మా’ అని సంబోధిస్తే ఉలిక్కిపడింది. ‘‘అనుమానం వలదు, నేను రామదూతను’’ అని హనుమంతుడు వినమ్రంగా విషయమంతా వివరించాడు. అంతా ఆసక్తిగా విన్నది సీతమ్మ. హనుమంతుడు చెప్పటం ఆ΄ాక సుగుణాభిరాముని క్షేమ సమాచారాలు అడిగింది. వాలి సుగ్రీవుల గురించి వాకబు చేసింది. శ్రీ రాముడు కపిసైన్యంతో రానున్నాడనే చల్లని కబురు తెలుసుకుని ఆనందపడింది. శ్రీరాముల వారు ఆనవాలుగా పంపిన ఉంగరం చూసి పరవశించిపోయింది.
ఆ సంతోషంలో హనుమంతుడిని గౌరవించాలని అనుకుంది సీతమ్మ. చుట్టూ చూసింది. పూల చెట్లు ఏవీ కనిపించలేదు. కనీసం తులసీ బృందావనమైనా అక్కడ లేదు. పరిసరాలను మరింత సూక్ష్మంగా చూసింది. కంచెను అల్లుకుని ఉన్న తమలపాకు తీగలను చూసింది. వాటిని చిన్నగా గిల్లి దండగా మార్చింది. చిరునవ్వుల మోముతో హనుమ మెడలో వేసింది. ఈ హఠాత్పరిణామానికి హనుమ ఆశ్చర్యచకితుడయ్యాడు. హనుమ కంట ఆనందాశ్రువులు. ‘‘అంజన తనయా.. లోకంలో ఎవరు ఏ శుభ వార్త అందించినా బహుమతులివ్వడం మా ఆనవాయితీ. నువ్వు శ్రీ రాములవారి ఉంగరాన్ని నాకు చేరవేశావు. శ్రీరాముడు వస్తున్నాడన్న మంచి విషయం తెలియ జేశావు. ఈ దేశం కాని దేశంలో నీకు ఈ తమల పాకుల దండ తప్ప మరేమీ ఇవ్వలేను’’ అని చెప్పింది.
ఊహించని సత్కారానికి హనుమంతుని ఒళ్లంతా పులకరించింది. ‘‘లోకమాత అయిన నీవు నా మెడలో తమలపాకుల మాల వేశావు, నా జన్మ చరితార్థమయ్యింది తల్లీ’’ అని రెండు చేతులూ జోడించి తల వంచాడు. ఇదే రానురాను ఆకు పూజకు నాంది పలికిందని ఇక్కడ చెప్పుకుంటారు. శివునికి బిల్వపత్రం, విష్ణువుకు తులసి లాగా హనుమంతునికి తమలపాకు ప్రియ మయిందని భావిస్తారు. హనుమంతునికి ఆకుపూజ చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చని ఇక్కడి వారి నమ్మకం’’ అని వివరించాడు. అప్పటికే ఆ బ్యాంకు ఉద్యోగి తమలపాకుల మాల, ఇతర పూజా సామగ్రి కొనుక్కుని గుడిలోకి వడివడిగా వెళ్తూ ఉన్నాడు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు