
ఈ నెలలోనే భారత్‌కు రానున్న అపాచీ యుద్ధ హెలికాప్టర్లు
ఐదేళ్ల నిరీక్షణ తర్వాత అమెరికా నుంచి ఎగిరొస్తున్న లోహవిహంగాలు !
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన వైమానిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్న తరుణంలో భారత వాయుసేనకు అమెరికా నుంచి తీపి కబురు అందింది. ఐదేళ్ల క్రితంనాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి తెప్పిస్తున్న ఈ అధునాతన హెలికాప్టర్లు వచ్చాక వీటిని వాయుసేన దళాలకు అందించనున్నారు. పాకిస్తాన్ సరిహద్దు వెంట కీలక మిషన్‌లలో ఇవి పాలుపంచుకోనున్నాయి.
దాదాపు రూ.5,140 కోట్ల ఒప్పందంలో భాగంగా భారత్‌కు అమెరికా ఆరు అపాచీ ఏహెచ్–64ఇ రకం యుద్ధ హెలికాప్టర్లను అందచేయాల్సి ఉంటుంది. 15 నెలల క్రితమే తొలి బ్యాచ్ హెలికాప్టర్లను డెలివరీ చేయాల్సిఉన్నా ఇంతవరకు అది ఆచరణలో సాధ్యంకాలేదు. ఎట్టకేలకు ఈనెలలోనే మూడింటిని అప్పజెప్పనున్నారు. వీటిని వెంటనే పాక్ సరిహద్దులో మోహరించనున్నట్లు తెలుస్తోంది. రవాణాకు సంబంధించిన 2024 మార్చిలోనే కొన్ని హెలికాప్టర్లను అందుకున్నా యుద్ధ హెలికాప్టర్ల అందజేత మాత్రం ఇన్ని నెలలుగా ఆలస్యమైంది.
ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కోర్‌కు తొలుత గత మే–జూన్‌లో ఇస్తామని అమెరికా ప్రకటించింది. తర్వాత ఈ గడువును పొడిగించింది. తర్వాత డిసెంబర్‌కల్లా ఇస్తామని తెలిపింది. ఆ గడువు కూడా ముగిసింది. ఇక 2025 జూన్‌లో ఇస్తామని ఇటీవల ప్రకటించింది. సరఫరా గొలుసులో అవాంతరాల కారణంగా భారత్‌కు అప్పగింత ఆలస్యమైందని అమెరికా వివరణ ఇచ్చింది. రెండో దఫా మూడు హెలికాప్టర్లను మరుసటి ఏడాదిలో అందజేయనున్నట్లు అమెరికా పేర్కొంది.
పశ్చిమ సరిహద్దు వెంట భారత సైనికదళాల ప్రత్యేక ఆపరేషన్లలో నూతన తరం అపాచీ హెలికాప్టర్లు కీలక బాధ్యతలు నెరవేర్చనున్నాయి. వేగం, దాడి, లక్ష్య చేధనలో తిరుగులేని సామర్థ్యాలు నూతన హెలికాప్టర్ల సొంతం. కొత్త హెలికాప్టర్ల చేరికతో భారత అమ్ములపొది మరింత శక్తివంతంకానుంది. 2015నాటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను భారత వాయుసేన అందుకుంది. వీటికి తోడుగా అత్యంత శక్తివంతమైన, ఎటాక్ హెలికాప్టర్లు అత్యావశ్యకం కావడంతో ఇలా నూతన తరం ఏహెచ్–64ఇ కోసం భారత్ అమెరికాకు ఆర్డర్ ఇచ్చింది.

మెరుపుదాడిలో దిట్ట
→ 2012లో తయారుచేసిన ఏహెచ్–64డీ బ్లాక్–3ని మరింత ఆధునీకరించి ఏహెచ్–64ఈ గార్డియన్‌గా రూపాంతరీకరించారు.
→ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. గరిష్టంగా ఏకధాటిగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
→ గరిష్టంగా 16 హెల్‌ఫైర్ రకం చిన్న క్షిపణులు, 2.75 అంగుళాల వ్యాసముండే 76 రాకెట్లు, వందల బుల్లెట్ల వర్షం కురిపించే 30 ఎంఎం బుల్లెట్ చైన్ ఇందులో అమర్చారు.
→ గరిష్టంగా 10,543 కేజీల బరువులను మోసుకెళ్లగలదు. నిమిషానికి 2,800 అడుగుల ఎత్తుకు ఎగరగలదు.
→ గరిష్టంగా 20,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు
→ నూతన తరం హెలికాప్టర్‌లో జాయింట్ టాక్టిక్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒకేసారి నిరాటంకంగా భిన్నరకాల సైనిక వ్యవస్థలతో ఇది అనుసంధానమవుతుంది. అంటే క్షిపణిని ప్రయోగించి మిస్సైల్ లాంచర్, భూస్థిర రాడార్లు, కమాండర్ కంట్రోల్ సెంటర్లు, తోటి హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో ఇది అనుసంధానమై ఉంటుంది.
→ కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, దాడికి సంబంధించి అధునాతన టెక్నాలజీతో దీనిని రూపొందించారు.
→ తాను సేకరించిన డేటాను, శత్రుజాడను రెప్పపాటు కాలంలో సైనిక స్థావరాలు, వ్యవస్థలకు చేరవేసి అప్రమత్తంచేస్తుంది. తనపై దాడికి తెగబడే శత్రు హెలికాప్టర్లు, భూ స్థిర స్థావరాలపై బుల్లెట్ల వర్షం కురిపించగలదు.
→ ఇన్‌ఫ్రారెడ్ లేజర్ సాంకేతికతతో వర్షం వంటి అననుకూల పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని వేగంగా, సులభంగా గుర్తించి దాడి చేయగలదు
→ టీ700– జనరల్ ఎలక్ట్రిక్701డీ రకం శక్తివంతమైన ఇంజిన్లు ఇందులో ఉంటాయి. అధునాతన రెక్కల కారణంగా ఇది చాలా వేగంగా నిట్టనిలువుగా గాల్లోకి ఎగరగలదు.
→ అన్ని రకాల డ్రోన్ల నుంచి సీ, డీ, ఎల్, కేయూ బ్యాండ్‌ల ద్వారా వీడియో డేటాను తెప్పించుకుని విశ్లేషించి కమాండ్ సెంటర్‌కు చేరవేయగలదు
→ వీటిలో ఇంధన ట్యాంక్ కూడా పెద్దది. దీంతో ఎక్కువ సేపు శత్రువుతో పోరాడేందుకు ఇది ఎంతో అనువైంది.
– సాక్షి, నేషనల్ డెస్క్