వర్క్‌ ఫర్‌ హోమ్‌..కార్పొరేట్‌ థీమ్‌..! | Home Office Design Ideas Like Corporate Office Theme In Hyderabad, Know More Details About This Trend | Sakshi
Sakshi News home page

వర్క్‌ ఫర్‌ హోమ్‌..కార్పొరేట్‌ థీమ్‌..! ఆఫీస్‌ని తలపించే నివాసాలు..

Jul 2 2025 10:43 AM | Updated on Jul 2 2025 11:02 AM

Home Office Design Ideas Like Corporate Office Theme In Hyderabad

ఇటీవల కాలంలో ఇంటి స్వరూపం మారిపోతోంది. కార్పొరేట్‌ ఉద్యోగాల పుణ్యమాని ఇంట్లో కొత్త హంగులు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి. వర్క్‌ ఫ్రం హోమ్‌తో ప్రతి ఇంట్లో ఓ వర్క్‌ స్పేస్‌.. తప్పనిసరి అయ్యింది. ఒకప్పుడు ఇల్లు కట్టుకోవడం అంటే కల సాకారం కావడం లాంటిది అనేవారు.. అయితే ఇప్పుడు అదే ఇల్లు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌తో కెరీర్‌ కలల సాకారానికి సాధనంగా మారిపోతోంది. మరీ ముఖ్యంగా భాగ్యనగరంలో ఇంటి స్వరూపంలో భారీగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్క్‌ స్పేస్‌లో కార్పొరేట్‌ థీమ్‌ ఆక్రమిస్తోంది. 

కోవిడ్‌ పుట్టించిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతోపాటు మన నగరంలోనూ స్థిరపడిపోయింది. దీనికితోడు ఆఫీస్‌ స్పేస్‌ ఖర్చులు తగ్గించుకునేందుకు కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కల్చర్‌ నగర జీవనశైలిలో భాగమైంది. 

కార్యాలయ పని పాటల తీరు తెన్నులనే మార్చేసిన ఈ కల్చర్‌ ఇంటినీ ఇంటి అంతర్గత నిర్మాణాన్ని (ఇంటీరియర్‌ డిజైన్‌)ని సైతం సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. నగరంలో కొత్త ఇంటి కొనుగోలుపై మాత్రమే కాదు.. ఇంటి మోడిఫికేషన్, ఫర్నిచర్‌ ఎంపికలపై స్పష్టమైన ప్రభావం చూపుతోంది. 

అచ్చం..ఆఫీస్‌ లా.. 
ఇంట్లో ప్రత్యేకంగా ఒకటి లేదా రెండు గదులను హోమ్‌ ఆఫీస్‌గా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ అవకాశం లేకుంటే హాల్‌ లేదా బెడ్‌రూంలో విడిగా కొన్ని చిన్న చిన్న ఏరియాలను వాడుకుని అక్కడ వర్క్‌ స్పేస్‌ సెటప్‌ చేస్తున్నారు. 

ఉదాహరణకు బెడ్‌రూమ్‌లో ఒక వారగా చిన్న టేబుల్, కుర్చీ పెట్టి, ఒక షెల్ఫ్‌ అమర్చడం, అలాగే హాల్లోని ఒక మూలలో వాల్‌ మౌంటెడ్‌ డెస్క్‌, అక్కడ ల్యాప్‌టాప్, లైటింగ్‌ సెట్‌ చేసుకోవడం. చిన్న బాల్కనీ ఉంటే గ్లాస్‌ డోర్‌తో  మూసి, మినీ ఆఫీస్‌గా మార్చడం చేస్తున్నారు. ఇలా కొద్దిపాటి వర్క్‌ప్లేస్‌ ఉంటే ‘మినీ కౌనర్‌‘ లేదా ‘వర్క్‌ నుక్‌’, ‘కాంపాక్ట్‌ ఆఫీస్‌ స్పేస్‌‘ అంటున్నారు.  

ట్రెండీ పార్టీస్‌.. టెర్రస్‌ గార్డెన్స్‌..
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ వృత్తి నిపుణులు ఇంట్లో గడిపే సమయాన్ని పెంచడంతో సహజంగానే ఇంట్లో మరిన్ని వసతులు, సౌకర్యాలు తప్పనిసరి అవుతున్నాయి. వ్యాయామ సాధనాలను అమర్చుకుని వర్కవుట్స్‌ చేయడం దగ్గర నుంచి చిన్న చిన్న పారీ్టలకు వీలుగా మార్పు చేర్పులు చేస్తున్నారు. మీటింగ్స్‌ కోసం టెర్రస్‌ గార్డెన్స్‌ వాడకంతో వాటర్‌ప్రూఫ్‌ మెటల్‌ ఫ్రేములు, వూన్‌ డిజైన్‌లతో కూడిన ఔట్‌డోర్‌ ఫర్నీచర్‌కు డిమాండ్‌ ఏర్పడింది.  

ఫర్నీచర్‌.. ఫర్‌ ఛేంజ్‌.. 
వర్క్‌ డెస్క్, ఎర్గోనామిక్‌ చైర్, బుక్‌ షెల్ఫ్, మంచి లైటింగ్, సౌండ్‌ ప్రూఫింగ్‌ వంటివి కూడా అమర్చుకుంటున్నారు. వర్చువల్‌ మీటింగ్స్‌కు అనువైన విధంగా కూడా ఇంటీరియర్‌లో మార్పు చేర్పులు చేసుకుంటున్నారు. ఇంట్లో హై–స్పీడ్‌ ఇంటర్నెట్, వై–ఫై బూస్టర్లు, ఇంటెలిజెంట్‌ ప్లగ్‌ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఒకప్పుడు అరకొరగా కనిపించిన సోఫా కమ్‌ బెడ్‌ లాంటి మల్టీ పర్పస్‌ ఫరి్నచర్‌ ఉత్పత్తుల వినియోగం భారీగా పెరిగింది. యుఎస్‌బీ ఛార్జింగ్, కేబుల్‌ హోల్డర్స్‌ వంటి పలు వస్తువులను ఇముడ్చుకోగల టెక్‌ ఇంటిగ్రేషన్‌  ఫర్నీచర్‌ వాడకం ఊపందుకుంది. 

‘ఫర్నిచర్‌ ఉత్పత్తుల రూపకల్పనను ఈ డబ్ల్యూఎఫ్‌హెచ్‌ బాగా ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో పనిచేసేందుకు, అదే సమయంలో విశ్రాంతి కోసం కూడా వేర్వేరు మోడ్స్‌ మార్చుకునే నూతన డిజైన్లతో మల్టీఫంక్షనల్‌ ఫరి్నచర్, మాడ్యూలర్‌ బుక్‌షెల్ఫ్‌లు అందుబాటులో ఉన్నాయి’ అని ప్రముఖ ఫర్నీచర్‌  బ్రాండ్‌ రాయల్‌ ఓక్‌ షోరూమ్‌ ప్రతినిధి చెప్పారు. గతంలో లుక్, డెకరేషన్‌కు ప్రాధాన్యత ఉండేదని, అయితే ఇప్పుడు ఫంక్షనల్, మినిమలిస్టిక్‌ డిజైన్‌లకు ప్రాధాన్యం పెరిగిందని చెబుతున్నారు.  

ఫర్నీచర్‌ ఉత్పత్తులపై ప్రభావం.. 
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ మా ఉత్పత్తుల డిజైనింగ్‌పై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. కార్పొరేట్‌ ధోరణులకు, వర్కింగ్‌ స్టైల్స్‌కు అనుగుణంగా హోమ్‌ ఫర్నీచర్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌లో అందించాల్సి వస్తోంది.  
– రాయల్‌ ఓక్‌ సంస్థ ప్రతినిధి.

సొంతిట్లో కార్నర్‌ ఏర్పాటు చేసుకున్నా.. 
గత కొంత కాలంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నా.  ఈ వర్కింగ్‌ స్టైల్‌ అందుబాటులోకి రావడం వల్ల నగరానికి దూరంగా రాంపల్లిలో విల్లా కొనుగోలు చేసి ఉంటున్నా. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి ఇబ్బంది లేకుండా ఉంది. ప్రస్తుతం ఇంట్లోనే తాత్కాలికంగా చిన్నపాటి కార్నర్‌లో కాంపాక్ట్‌ ఆఫీస్‌ సెట్‌ చేసుకున్నా. త్వరలోనే ఇంటి టెర్రస్‌ మీద పూర్తి ఆఫీస్‌ ఏర్పాటు చేసుకోనున్నా.  
– కుమార్, ఐటీ ఉద్యోగి.   

(చదవండి: ట్రాన్స్‌ ఈక్వాలిటీ ఫర్‌ సొసైటీ..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement