
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు బుధవారం ఆరు నెలల జైలు శిక్షపడింది. ఆడియో లీక్ వ్యవహారంలో.. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) కోర్టు ధిక్కరణ కింద ఆమెకు ఈ శిక్ష విధించిందని సమాచారం.
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించిందని బుధవారం(జులై 2న) అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వీడిన షేక్ హసీనా.. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.
అయితే.. గత ఏడాది అక్టోబర్‌లో షేక్ హసీనా.. రాజకీయ నాయకుడు షకీల్ అకాండ్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. అందులో న్యాయవ్యవస్థను బెదిరించేలా ఉన్న వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలకుగానూ హసీనాకు ఆరు నెలలు, షకీల్ బుల్బుల్‌కు 2 నెలల జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ ఎం.డి. గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు 30 శాతం కోటా కొనసాగించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై నిరుద్యోగులు కిందటి ఏడాది జూన్‌లో ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఈ కోటాను సమర్థిస్తూ తీర్పు ఇవ్వడంతో.. నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ, నిరసనలు తగ్గలేదు. క్రమంగా ఆ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఘర్షణల్లో 300 మందికి పైగా మరణించగా.. వేలాది మందికి గాయాలయ్యాయి. కర్ఫ్యూ, ఇంటర్నెట్ షట్‌డౌన్, సైన్యం మోహరింపు వంటి కఠిన చర్యలు తీసుకున్నా.. పరిస్థితి అదుపులోకి రాలేదు. చివరకు.. షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనలు ప్రధాని నివాసాన్ని తాకడంతో.. ఆమె అక్కడి నుంచి భారత్‌కు వచ్చేశారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె రాజీనామా అనంతరం, తాత్కాలిక ప్రధానిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు.